అమెజాన్‌లో సరికొత్త జీవజాతుల్ని గుర్తించిన శాస్త్రవేత్తలు

అమెజాన్‌లో సరికొత్త జీవజాతుల్ని గుర్తించిన శాస్త్రవేత్తలు

బ్రెజిల్‌లోని ఆమెజాన్ అరణ్యంలో ఒక జీవశాస్త్రవేత్తల బృందం తొమ్మిది సరికొత్త జీవజాతులను గుర్తించింది. ఆ శాస్త్రవేత్తలతో కలిసి ప్రయాణించిన బీబీసీ ప్రతినిధి షువో ఫెల్లెట్ అందిస్తోన్నకథనం ఇది:

"ఇది బ్రెజిల్ కు చెందిన పీకూ దా సెబ్లీనా… అంటే పొగమంచు శిఖరం అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఈ ప్రాంతం మబ్బుల మాటున దాక్కున్నట్లుగా ఉంటుంది.

అమెజాన్ మారుమూల ప్రాంతంలో ఉన్న నేషనల్ పార్క్ ఈ కీకారణ్యంలో విస్తరించింది. జంతు శాస్త్రంలో అగ్రగామి అయిన సావో పాలో విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు ప్రొఫెసర్లు, ఎనిమిది మంది జీవశాస్త్రవేత్తలతో కలిసి మేము ఇక్కడికి వచ్చాం.

సరికొత్త వృక్ష, జంతు జాతులను కనుగొనేందుకు చేపట్టిన కార్యక్రమం ఇది. అలాగే, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పుల వల్ల ఏవైనా ప్రాణులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయా అన్నది తెలుసుకోవడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యం.

మిగెల్ ట్రెఫాట్ రోడ్రిగిజ్ ఈ యాత్రకు నాయకత్వం వహిస్తున్నారు. స్థానిక గైడ్స్, బ్రెజిల్ సైన్యం సహాయంతో ఈ యాత్ర సాధ్యమైంది.

భూమి మీద మనిషికి తెలిసిన జీవజాతులలో పది శాతం అమెజాన్‌లోనే ఉన్నాయి. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఇక్కడ ఎదో ఒక కొత్త రకమైన వృక్షజాతినో లేదంటే జీవజాతినో కనుక్కోవచ్చని అంటుంటారు.

పీకూ దా సెబ్లీనా పర్వతానికి చేరుకోవడానికి సైన్యం ఎన్నో నెలలు కష్టపడి ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే రెండువేల మీటర్ల ఎత్తులో ఉన్నాం.

అయితే శిఖరానికి ఇంకా వెయ్యి మీటర్ల దూరంలో ఉన్నాం. శాస్త్రవేత్తల శిబిరాలకు సమీపంలోనే చాలా రకాల ప్రాణులు తిరుగుతుండడం చూశాం.

పెరుగుతోన్న ఉష్ణోగ్రతలను ఇక్కడి జీవజాలం తట్టుకుని ఉంటుందా లేదా అన్న విషయం తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఇక్కడ సమయంతో పోటీ పడుతున్నారు."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)