మెక్సికో: రోజుకు 71 హత్యలు.. డ్రగ్స్, నేరాలతో ముదురుతున్న సంక్షోభం

మెక్సికో: రోజుకు 71 హత్యలు.. డ్రగ్స్, నేరాలతో ముదురుతున్న సంక్షోభం

మెక్సికోలో మరో రెండు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఒక వైపు హత్యలు, మరో వైపు మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారాలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సందర్భంలో ఎన్నికలు వస్తున్నాయి.

మెక్సికోలో ఒక్క 2017లోనే దాదాపు 30 వేల హత్యలు జరిగాయి. ఈ ఏడాది ఆ సంఖ్య ఇంకా పెరిగేలా ఉంది. సగటున ఇక్కడ రోజుకు 71 హత్యలు జరుగుతున్నాయి. గత ఇరవయ్యేళ్ళలో ఎన్నడూలేని స్థాయిలో ఇక్కడ హింస చెలరేగుతోంది.

హింసాత్మక ఘటనలతో దారుణంగా దెబ్బతిన్న గెర్రెరో రాష్ట్రంలోని అకపుల్కో పట్టణం నుంచి బీబీసీ ప్రతినిధి అందిస్తున్న (పైన ఉన్న) వీడియోలోని కొన్ని దృశ్యాలు, గ్రాఫిక్స్ మీ మనసుల్ని కలచివేయవచ్చు. కానీ, ఇది మెక్సికోలోని హృదయవిదారక వాస్తవం.

అకపుల్కో పట్టణంలో రెండు ప్రపంచాలున్నాయి. రెండూ వాస్తవాలే. ఒకటి సూర్యకాంతితో మిలమిల మెరిసే సముద్ర తీరాల స్వర్గం. మరొకటి, అక్షరాలా నరకం.

ఈ ప్రపంచంలో హత్య ఒక అతి మామూలు విషయం. ఇక్కడ ఏ క్షణంలోనైనా ఓ నేరం మీ కంటపడవచ్చు. ఈ నగరంలోని మార్చురీకి దాని సామర్థ్యానికన్నా మూడు రెట్లు ఎక్కువ మృతదేహాలు వచ్చి పడ్డాయి. దాంతో, సంచుల్లో కుక్కిన దేహాలు కుళ్ళిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images

అకపుల్కో ఒకప్పుడు విదేశీ పర్యాటకులతో కళకళలాడేది. కానీ, మెక్సికో ఇప్పుడు అఫ్ఘానిస్తాన్ లేదా సిరియాల కన్నా ప్రమాదకర ప్రాంతమని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించడంతో అక్కడి నుంచి దాదాపు ఎవరూ రావడం లేదు. ధైర్యంతో మెక్సికోకు వస్తున్న పర్యాటకులకు రక్షణ కల్పించేందుకు సైన్యంతో గస్తీ నిర్వహిస్తున్నారు.

డ్రగ్స్‌పై ఫెడరల్ గవర్నమెంట్ చేసిన పన్నెండేళ్ల పోరాటం వల్ల చాలా మంది పెద్ద మనుషులు అరెస్టయ్యారు. డ్రగ్స్ బిజినెస్ చేసే పెద్ద ముఠాలు చీలిపోయాయి.

అకపుల్కోకు వెయ్యి మైళ్ల దూరంలో ఉన్న సినలోవ రాష్ట్రంలో ఏకైక శక్తిమంతమైన డ్రగ్స్ ముఠా ఉంది. మత్తు పదార్థాల వ్యాపారం వల్ల కలుగుతున్న విధ్వంసం, నష్టపోతున్న ప్రాణాల గురించి మేం వాళ్లను ప్రశ్నించాం. కానీ, వ్యసనపరులు కావాలని తామెవ్వరినీ ఒత్తిడి చేయడం లేదని ఆ డ్రగ్స్ ముఠా నాయకుడు సమర్థించుకున్నాడు. ఏకైక శక్తిమంతమైన డ్రగ్స్ కూటమి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో రాజకీయ నాయకులు అర్థం చేసుకోగలరని ఆయన చెప్పాడు.

వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఏ ఒక్క అభ్యర్థి దీన్ని ఒప్పుకోరు. పైగా డ్రగ్స్ ముఠాలను ధ్వంసం చేయాలని అంటారు. ఇదే మెక్సికో ఎదుర్కొంటున్న సమస్య. ఈ సంకట స్థితిలో డ్రగ్స్ మీద పోరాటం చేయడం ఎలా?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)