అమెరికాకు రష్యా హెచ్చరిక: సిరియాపై దాడి ఎలా చేస్తారో మేమూ చూస్తాం!

పుతిన్

సిరియాలో అనుమానిత రసాయన దాడికి ప్రతిచర్యగా ఆ దేశంలో అమెరికా వైమానిక దాడులకు దిగితే అది అమెరికా, రష్యాల మధ్య యుద్ధానికి దారితీయగలదని రష్యా హెచ్చరించింది. యుద్ధం ముప్పును తప్పించడమే తక్షణ ప్రాథమ్యమని ఐక్యరాజ్యసమితిలో రష్యా రాయబారి వసిలీ నెబెంజియా గురువారం చెప్పారు.

ప్రపంచ శాంతికి అమెరికా ముప్పు కలిగిస్తోందని, పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని నెబెంజియా వ్యాఖ్యానించారు. ''ఏదైనా జరగొచ్చు, దేన్నీ తోసిపుచ్చలేం'' అని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రైవేటు సమావేశం తర్వాత ఆయన విలేఖరులతో చెప్పారు.

సిరియాలో రష్యా బలగాలు ఉన్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికా దాడులకు దిగితే ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే ముప్పుందని ఆయన తెలిపారు.

సిరియాలో రష్యా బలగాలకు ముప్పు ఏర్పడితే అమెరికా ప్రయోగించే క్షిపణులను కూల్చేస్తామని, క్షిపణులను ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నారో ఆ ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటామని సైన్యాధిపతి సహా పలువురు రష్యా ముఖ్యులు చెప్పారు.

పాశ్చాత్య దేశాలు సైనిక చర్య చేపట్టే అవకాశంపై చర్చించేందుకు శుక్రవారం ఐరాస భద్రతా మండలి సమావేశం నిర్వహించాలని నెబెంజియా కోరారు.

అమెరికా, దాని పాశ్చాత్య మిత్రదేశాలు సిరియాలో దాడులకు సన్నద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సిరియాలోని బషర్ అల్-అసద్‌ ప్రభుత్వానికి మద్దతుదారైన రష్యా, ఈ దాడుల సన్నాహాలను వ్యతిరేకిస్తోంది. రసాయన దాడి జరగనేలేదని, జరిగిందనే ప్రచారమంతా బూటకమని అసద్ ప్రభుత్వం పేర్కొంది.

ఫొటో క్యాప్షన్,

బ్రిటన్ ప్రధాని థెరెసా మే, అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు ట్రంప్, ఎమాన్యుయెల్ మేక్రాన్

దాడులకు మద్దతు కూడగడుతున్న ట్రంప్

సిరియాకు సంబంధించి నిఘా సమాచారాన్ని విశ్లేషిస్తున్నామని, తదుపరి చేపట్టాల్సిన చర్యపై మిత్రదేశాలతో మాట్లాడుతున్నామని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ చెప్పింది. రాజధాని డమాస్కస్‌కు సమీపంలోని డ్యూమాలో జరిగినట్లు అనుమానిస్తున్న ఈ దాడిపై విచారణ జరిపేందుకు తమ నిపుణులు సిరియా వెళ్తున్నారని 'రసాయన ఆయుధాల నిషేధ సంస్థ(ఓపీసీడబ్ల్యూ)' తెలిపింది. వారు శనివారం పని మొదలుపెడతారని చెప్పింది.

డ్యూమా దాడిలో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారని సిరియాలో ప్రతిపక్షం, సహాయ కార్యక్రమాల కార్యకర్తలు, వైద్య సిబ్బంది చెబుతున్నారు. సిరియాలో అంతర్జాతీయ చట్టం ఉల్లంఘనల ఆరోపణలను నమోదుచేసే 'వయొలేషన్స్ డాక్యుమెంటేషన్ సెంటర్(వీడీసీ)' డ్యూమా ఘటనపై స్పందిస్తూ- మృతదేహాల నోట్లో నురగ, బాధితుల శరీరం రంగులో తీవ్రమైన మార్పు, కార్నియా దెబ్బతినడం గుర్తించినట్లు తెలిపింది.

బాధితుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా, వారు క్లోరిన్ ప్రభావానికి గురైనట్లు తేలిందని అమెరికా అధికారులు చెప్పారు.

డ్యూమాలో అసద్ ప్రభుత్వం రసాయన ఆయుధాలు ఉపయోగించిందనే ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మేక్రాన్ పేర్కొన్నారు.

డ్యూమా దాడికి బాధ్యురాలు అసద్ ప్రభుత్వమే అయ్యుండొచ్చని బ్రిటన్ చెప్పింది. రసాయనిక ఆయుధాల వినియోగాన్ని కొనసాగనివ్వకూడదని వ్యాఖ్యానించింది. సిరియా పరిణామాలపై గురువారం బ్రిటన్ ప్రధాని థెరెసా మే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. సిరియాలో రసాయన ఆయుధాల ప్రయోగాన్ని నిరోధించాల్సిన అవసరముందని వారిద్దరూ అభిప్రాయపడ్డారు.

సిరియాలో దాడులు చేసేందుకు బ్రిటన్, ఫ్రాన్స్‌ మద్దతు కూడగట్టేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.

దాడులు జరిగిన మరుసటి రోజు ఏప్రిల్ 9న ట్రంప్ స్పందిస్తూ.. డ్యూమాలో జరిగిన దాడిని అరాచక చర్యగా పేర్కొంటూ, దీనికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బాధ్యత వహించాల్సి ఉందని చెప్పారు. సిరియాలో అసద్ ప్రభుత్వానికి పుతిన్ మద్దతిస్తున్నారని ప్రస్తావించారు.

ఫొటో క్యాప్షన్,

రసాయన దాడి జరిగినట్లు అనుమానిస్తున్న డ్యూమా శివార్లకు చేరుకుంటున్న సిరియా సైనిక బలగాలు

రష్యా విధానం ఏంటి?

దాదాపు ఏడాది క్రితం తిరుగుబాటుదారుల అధీనంలోని ఖాన్‌షేఖౌన్ పట్టణంలో అసద్ ప్రభుత్వం రసాయనిక దాడికి పాల్పడిందంటూ, దీనికి ప్రతిగా ట్రంప్ ఒక వైమానిక స్థావరంపై క్షిపణి దాడి జరిపించారు. ఖాన్‌షేఖౌన్‌లో సారిన్ వాయువును ప్రయోగించడంతో 80 మందికి పైగా చనిపోయారు. ఈ రసాయనిక దాడికి సిరియా ప్రభుత్వమే కారణమని ఐక్యరాజ్యసమితి, రసాయన ఆయుధాల నిర్మూలన సంస్థ సంయుక్తంగా జరిపిన విచారణలో వెల్లడైంది.

'రసాయనిక దాడి' జరగనేలేదని, దీనిని సాకుగా చూపి సిరియా వ్యవహారాల్లో జోక్యం చేసుకొనేందుకు పాశ్చాత్య దేశాలు యత్నిస్తున్నాయని రష్యా పేర్కొంది. అందరూ ఆలోచనతో వ్యవహరిస్తారని, పరిస్థితి చక్కబడుతుందని ఆశిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ బుధవారం పేర్కొన్నారు.

అసద్ ప్రభుత్వానికి రష్యా అండగా నిలుస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేక పక్షాలకు అమెరికా మద్దతు అందిస్తోంది.

వీడియో క్యాప్షన్,

రసాయన దాడులపై డొనాల్డ్ ట్రంప్ విధానమేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)