'టోమహాక్' క్షిపణులు: సిరియాపై దాడికి అమెరికా వాడింది వీటినే

టోమహాక్ క్షిపణి

ఫొటో సోర్స్, Getty Images

సిరియాపై శనివారం జరిపిన దాడుల్లో టోమహాక్ క్షిపణులను ఉపయోగించినట్లు అమెరికా రక్షణశాఖ మంత్రి జేమ్స్ మాటిస్ 'రాయిటర్స్' వార్తాసంస్థతో చెప్పారు.

2017 ఏప్రిల్‌లో సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలోని ఖాన్‌షేఖౌన్ పట్టణంలో రసాయనిక దాడి అనంతరం తాము జరిపిన దాడులతో పోలిస్తే తాజా దాడుల తీవ్రత రెండింతలని ఆయన తెలిపారు.

అమెరికా అమ్ములపొదిలో ఈ క్షిపణి మూడు దశాబ్దాలకు పైగా ఉంది. అమెరికా ఆదివాసీలకు చెందిన ఒక గొడ్డలి పేరు- 'టోమహాక్'.

రసాయన దాడికి పాల్పడిందంటూ సిరియాపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు శనివారం తెల్లవారు జామున వైమానిక, క్షిపణి దాడులకు దిగాయి. ఈ సందర్భంగా అమెరికా సైన్యం ఉపయోగించిన అస్త్ర, శస్త్రాల్లో టోమహాక్ ఒకటి.

టోమహాక్ క్షిపణి

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్,

'టోమహాక్'.. అమెరికా ఆదివాసీలకు చెందిన ఒక గొడ్డలి పేరు

'టోమహాక్' సామర్థ్యం ఏంటి?

  • క్షిపణి పరిధి: 1,600 కిలోమీటర్లకు పైనే
  • వేగం: గంటకు 885 కిలోమీటర్లు
  • బరువు: 1,361 కేజీలు
  • పొడవు 20.5 అడుగులు

(ఆధారం: ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్, రేథియాన్, అమెరికా సైన్యం)

సిరియాలో దాడి తీవ్రతను చూపుతున్న పటం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

దాడి ముందు, తర్వాత సిరియాలోని బర్జా పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఎలా ఉందో చూపుతున్న అమెరికా సైన్యాధికారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దృశ్యం

ఏం జరిగింది?

సిరియాలోని డ్యూమాలో ఏప్రిల్ 8న జరిగిన అనుమానిత రసాయన దాడికి ప్రతిగా శనివారం తెల్లవారుజామున అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు సిరియాలోని మూడు ప్రాంతాలపై వైమానిక, క్షిపణి దాడులు చేశాయి.

సిరియా రాజధాని నగరం డమాస్కస్‌లోని బర్జా పరిశోధన, అభివృద్ధి కేంద్రం, హమా పట్టణానికి ఉత్తరాన ఉన్న హిమ్ షిన్షర్ రసాయన ఆయుధాల స్థావరం, అదే ప్రాంతంలో ఉన్న రసాయన ఆయుధాల బంకర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి.

అయితే, తాము ఎలాంటి రసాయనాలు వాడలేదని, తమపై వచ్చిన ఆరోపణలన్నీ ప్రత్యర్థులు అల్లిన కట్టుకథలని సిరియా కొట్టిపారేసింది.

వీడియో క్యాప్షన్,

వీడియో: డమాస్కస్‌లోని సైనిక పరిశోధనా కేంద్రంపై దాడి.. అనంతరం దెబ్బతిన్న భవనం దృశ్యాలు

సైనిక స్థావరాలన్నీ ముందే ఖాళీ చేసేశాం: సిరియా

అమెరికా, దాని మిత్రపక్షాల దాడుల నేపథ్యంలో తమ సైనిక స్థావరాలన్నింటినీ ముందే ఖాళీ చేయించినట్లు సిరియా ప్రభుత్వం తెలిపింది. దాడులు జరుగుతాయని రష్యా తమను ముందస్తుగా హెచ్చరించిందని, దీంతో కొన్ని రోజుల కిందటే సైనిక స్థావరాలను ఖాళీ చేయించామని సిరియా అధికారి ఒకరు 'రాయిటర్స్' వార్తాసంస్థతో చెప్పారు.

అమెరికా, దాని మిత్రపక్షాలు ప్రయోగించిన చాలా క్షిపణుల్ని తాము కూల్చివేశామని కూడా తెలిపారు.

సిరియా, రసాయన దాడులు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

శనివారం ఉదయం డమాస్కస్‌ నగరంపై ఎగురుతున్న క్షిపణి చిత్రం

‘సోవియట్ కాలం నాటి గగనతల రక్షణ వ్యవస్థను వాడిన’ సిరియా

అమెరికా నేతృత్వంలోని క్షిపణి దాడుల్ని ఎదుర్కొనేందుకు సిరియా దశాబ్ధాల కిందటి వ్యవస్థలను వినియోగించిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది.

‘‘ఎస్ 125, ఎస్ 200 సిరియా గగనతల రక్షణ వ్యవస్థలు, బుక్, క్వడ్రాట్‌లను క్షిపణుల్ని ఎదుర్కొనేందుకు వాడారు. 30 ఏళ్ల కిందట సోవియట్ యూనియన్‌లో తయారైన రక్షణ వ్యవస్థలివి’’ అని రష్యా రక్షణ శాఖ ప్రకటించినట్లు ఇంటర్‌ఫాక్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)