ట్రంప్ దృష్టిలో ఆడదంటే ఓ మాంసం ముద్ద... అంతే!: ఎఫ్‌బీఐ మాజీ అధిపతి

  • 16 ఏప్రిల్ 2018
జేమ్స్ కోమీ, డొనాల్డ్ ట్రంప్ Image copyright AFP

డొనాల్డ్ ట్రంప్ మహిళలను ''మాంసం ముద్ద'' లాగా భావించి వ్యవహరిస్తారనీ, ఆయన ''అమెరికా అధ్యక్షుడిగా ఉండటానికి నైతికంగా అనర్హుడ''ని ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కోమీని ఎఫ్‌బీఐ చీఫ్ పదవి నుంచి ట్రంప్ గత ఏడాది తొలగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోమీ మొట్టమొదటిసారిగా ఆదివారం రాత్రి ఏబీసీ న్యూస్ టెలివిజన్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

''సత్యం అనే దానిని ఒక ఉన్నత విలువగా పరిగణించని వ్యక్తి ట్రంప్'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ఇంటర్వ్యూ ప్రసారం కావటానికి కొన్ని గంటల ముందు.. కోమీ ''చాలా అబద్ధాలు'' చెప్తున్నారంటూ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

''ట్రంప్ మానసిక ఆరోగ్యపరంగా అసమర్థుడనో, లేదంటే ఆయనకు డిమెన్షియా (మతిమరుపు) తొలి దశలో ఉందనో చేసే వాదనలను నేను ఒప్పుకోను'' అని కోమీ ఏబీసీ 20-20 కార్యక్రమంలో పేర్కొన్నారు.

''ఆయన అధ్యక్షుడిగా ఉండటానికి ఆరోగ్యపరంగా అనర్హుడు (మెడికల్లీ అన్‌ఫిట్) అని నేననుకోవటం లేదు. ఆయన అధ్యక్షుడిగా ఉండటానికి నైతికంగా అనర్హుడు (మోరల్లీ అన్‌ఫిట్) నేననుకుంటున్నాను'' అని చెప్పారు.

''ఈ దేశానికి గుండెకాయ అయిన విలువలకు మన అధ్యక్షుడు ప్రతిరూపంగా ఉండాలి. వాటిని గౌరవించాలి. వాటికి కట్టుబడాలి. అందులో చాలా ముఖ్యమైనది సత్యం. ఈ అధ్యక్షుడు ఆ పనిచేయలేడు’’ అని కోమీ వ్యాఖ్యానించారు.

డొనాల్డ్ ట్రంప్, జేమ్స్ కోమీల మధ్య దీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఘర్షణలో తాజా పరిణామం ఈ వ్యాఖ్యలు. కోమీ తన స్వానుభవాలతో రచించిన ‘ఎ హైయర్ లాయల్టీ: ట్రూత్, లైస్ అండ్ లీడర్‌షిప్’ పుస్తకం త్వరలో ప్రచురణ కానుంది. ఈ పుస్తకం కూడా వీరిద్దరి మధ్య ఘర్షణకు ఆజ్యం పోసింది.

ఆ పుస్తకాన్ని ‘‘చెత్తగా సమీక్షించార’’ని, ఆ పుస్తకం ‘‘పెద్ద ప్రశ్నల’’ను లేవనెత్తుతోందని ట్రంప్ విమర్శించారు. కోమీని జైలులో పెట్టాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కొంత కాలంగా కోమీని ‘స్లైమ్‌బాల్’ (చెత్తకుప్ప) అని అభివర్ణించటం కూడా మొదలుపెట్టారు.

కోమీ తాజా టీవీ ఇంటర్వ్యూలో.. ట్రంప్‌ను తాను యువకుడిగా ఉండగా పలు కేసుల్లో దర్యాప్తు చేసిన ముఠా బాసులతో పోల్చారు. అధ్యక్షుడు తన చుట్టూ తనకు విధేయులైన వారినే పెట్టుకున్నారని అన్నారు.

‘‘ఈ విధేయత.. ప్రతిదానికీ బాసే ఆధిపత్య కేంద్ర బిందువుగా ఉంటారు. ఆ బాస్‌కి ఎలా సేవ చేస్తాం.. బాస్ ప్రయోజనాలు ఏమిటి.. అనేదానిచుట్టూనే అంతా నడుస్తుంది’’ అని కోమీ వ్యాఖ్యానించారు.

అధ్యక్షుడి చుట్టూ ఉన్నవారు ఆయన ‘‘చెడు ప్రవర్తనకు సాయపడుతున్నారా’’ అని ప్రశ్నించినపుడు.. ‘‘ఈ అధ్యక్షుడితో సమస్య ఏమిటంటే.. ఆయన తన చుట్టూ ఉన్న వారందరికీ మచ్చతెస్తాడు’’ అని కోమీ స్పందించారు.

అయితే.. అధ్యక్షుడిగా ట్రంప్‌ని అభిశంసించాలని తాను భావించటం లేదని కోమీ పేర్కొన్నారు.

‘‘ఎందుకంటే.. డొనాల్డ్ ట్రంప్‌ను అభిశంసించటం, ఆయనను పదవి నుంచి తొలగించటం వల్ల అమెరికా ప్రజలు చిక్కుల నుంచి బయటపడతారని నేను అనుకోవటం లేదు’’ అని చెప్పారు.

‘‘అలాకాకుండా.. ఆ పనిని ఓటింగ్ బూత్‌లో నేరుగా చేయాల్సిన కర్తవ్యం అమెరికా ప్రజలది’’ అని కోమీ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)