కామన్వెల్త్ సమావేశాలు: మీరు తప్పక తెలుసుకోవాల్సిన 7 విషయాలు!

  • 17 ఏప్రిల్ 2018
1997లో భారత్‌లో ఎలిజబెత్ Image copyright PA

కామన్వెల్త్ దేశాలకు చెందిన నేతలంతా లండన్‌లో కలవనున్నారు. ఆ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొంటారు.

కామన్వెల్త్ కూటమిలో భాగమైన దేశాల గురించి ఈ ఏడు విషయాలూ బహుశా చాలామందికి తెలియకపోవచ్చు.

1. మూడో వంతు జనాభా అక్కడే

దాదాపు 740 కోట్ల ప్రపంచ జానాభాలో 240 కోట్ల మంది.. అంటే మూడో వంతు ప్రజలు కామన్వెల్త్‌ కూటమిలో భాగమైన 53 దేశాల్లోనే జీవిస్తున్నారు. ఈ దేశాల్లో ఎక్కువమంది 30 ఏళ్ల లోపువారే.

ఈ కూటమిలో జనాభా పరంగా భారతే అతిపెద్ద దేశం. మొత్తం కామన్వెల్త్ కూటమి దేశాల జనాభాలో సగం భారత్‌లోనే ఉంది. కూటమిలోని 31 దేశాల జనాభా 15 లక్షల కంటే తక్కువే.

2. బ్రిటిష్ సామ్రాజ్యంతో సంబంధంలేని దేశాలు

కామన్వెల్త్ కూటమిలో భాగమైన అత్యధిక దేశాలు బ్రిటిష్ సామ్రాజ్య పాలనతో ఏదో విధంగా సంబంధం ఉన్నవే. రవాండా, మొజాంబిక్ లాంటి దేశాలు మాత్రమే వాటికి అతీతం. రవాండా 2009లో, మొజాంబిక్ 1995లో కామన్వెల్త్ దేశాల కూటమిలో భాగమయ్యాయి. అవి గతంలో బ్రిటిష్ పాలనలో లేవు.

కూటమి లోంచి గతంలో విడిపోయిన దేశాలు కూడా ఉన్నాయి. 2003లో జింబాబ్వే కూటమి నుంచి వైదొలగింది. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో జింబాబ్వే మొదట సస్పెన్షన్‌కు గురైంది. తరవాత నాటి దేశాధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కూటమి నుంచి బయటికొచ్చేశారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక రవాండా ఎప్పుడూ బ్రిటన్ పాలనలో లేదు

సైనిక తిరుగుబాటు నేపథ్యంలో 1999లో పాకిస్తాన్ సస్పెన్షన్‌కు గురైంది. నాలుగేన్నరేళ్ల తరవాత మళ్లీ అది కూటమిలో భాగమైంది. దక్షిణాఫ్రికా కూడా 1961లో తన సభ్యత్వాన్ని రద్దు చేసుకొని 1994లో కూటమిలోకి పున:ప్రవేశించింది.

3. 16దేశాలకే బ్రిటన్ రాణి నాయకత్వం

కామన్వెల్త్ కూటమిలోని 16 దేశాలకు బ్రిటన్ రాణి అధినేతగా ఉన్నారు. 31 గణతంత్ర దేశాలు ఉన్నాయి.

లెసొతో, స్వాజీలాండ్, బ్రూనె దారుస్సలాం, మలేషియా, సమోవా, టోంగా దేశాలకు తమ సొంత చక్రవర్తులున్నారు.

4. భారీ భూభాగం

ప్రపంచ దేశాలన్నింటి విస్తీర్ణంలో పావు భాగాన్ని కామన్వెల్త్ దేశాలే ఆక్రమిస్తున్నాయి.

విస్తీర్ణం పరంగా కెనడా కామన్వెల్త్ కూటమిలో తొలిస్థానంలో, ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, భారత్‌లు కూడా విస్తీర్ణం పరంగా చాలా పెద్దవి. నారు, సమోవా, టువాలు, ఆంటిగ్వా లాంటి చిన్న దేశాలు కూడా కూటమిలో భాగంగా ఉన్నాయి.

Image copyright Reuters
చిత్రం శీర్షిక కెనడా చాలా పెద్దది
Image copyright Getty Images
చిత్రం శీర్షిక నారు చాలా చిన్నది

5. పేరు మారింది

ఆధునిక కామన్వెల్త్ కూటమి 1949లో ఏర్పడింది. మొదట ఆస్ట్రేలియా, కెనడా, భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, యూకేలు సభ్య దేశాలుగా స్వతంత్ర దేశాల ‘ఫ్రీ అసోసియేషన్’ పేరుతో అది ఏర్పడింది. ఆ తరవాత అది ‘కామన్వెల్త్ నేషన్స్‌’గా రూపాంతరం చెందింది.

ఇప్పటి దాకా ఇద్దరే కామన్వెల్త్ కూటమికి నాయకులుగా వ్యవహరించారు. ఒకరు కింగ్ జార్జ్ VI, రెండోది క్వీన్ ఎలిజబెత్ II. ఆ నాయకత్వం వంశపారంపర్యంగా సంక్రమించేది కాకపోయినా, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బ్రిటన్ రాజుగా మారిన తరవాత ఆయనే తదుపరి కామన్వెల్త్ దేశాల కూటమికి కూడా నాయకత్వం వహిస్తారని భావిస్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1969లోనూ కామన్వెల్త్ దేశాల అధినేతలు లండన్‌లో సమావేశమయ్యారు

2012 దాకా కామన్వెల్త్ కూటమికి ఎలాంటి రాజ్యాంగం లేదు. ఆ తరవాతే ప్రజాస్వామ్యం, లింగ సమానత్వం, శాంతి, భద్రత లాంటి 16 విలువలకు సభ్య దేశాలు కట్టుబడి ఉండాలని తీర్మానించుకున్నాయి.

కామన్వెల్త్ కూటమిపైన విమర్శలూ ఉన్నాయి. 2013లో దాన్ని ‘కొత్త వలసవాద సంస్థ’గా పేర్కొంటూ గాంబియా కూటమి నుంచి వైదొలగింది.

కానీ కూటమిలోని దేశాలన్నీ పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధికి తోడ్పడతాయని దాని మద్దతుదారులు చెబుతారు.

6. యూకేను దాటనున్న భారత్

2017 గణాంకాల ప్రకారం కామన్వెల్త్ దేశాల్లో యూకేదే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కానీ ఈ ఏడాదిలోనే ఆ స్థానాన్ని భారత్ ఆక్రమిస్తుందని భావిస్తున్నారు.

మొత్తం 53 దేశాల జీడీపీ దాదాపు 10 ట్రిలియన్ డాలర్లు. అది చైనా జీడీపీకి (11 ట్రిలియన్ డాలర్లు) దగ్గరగా ఉన్నా, అమెరికాతో (19 ట్రిలియన్ డాలర్లు) పోలిస్తే చాలా వెనకబడి ఉంది.

చిత్రం శీర్షిక జీడీపీ పరంగా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు (జీడీపీ బిలియన్ డాలర్లలో)

7. 'కామన్వెల్త్' ఇదొక్కటే కాదు

కామన్వెల్త్ నేషన్స్ తరహాలో ఇతర కూటములు కూడా ఉన్నాయి. ఫ్రెంచ్ మాట్లాడే దేశాలన్ని కలిపి ‘ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లా ఫ్రాంకోఫొనీ’గా ఏర్పడ్డాయి. 1991లో సోవియట్ యూనియన్‌లోని మాజీ సభ్య దేశాలు కలిసి ‘కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్‌గా ఏర్పడ్డాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)