మానవ సంబంధాల గురించి చార్లీ చాప్లిన్ చెప్పింది ఇదీ!

మానవ సంబంధాల గురించి చార్లీ చాప్లిన్ చెప్పింది ఇదీ!

వెండితెర ఇంకా మాటలు నేర్చుకోక ముందే దానికి అద్భుతమైన భావోద్వాగాలను అద్దిన సృజనశీలి చార్లీ చాప్లిన్.

జీవితంలోని సంఘర్షణను, వ్యవస్థలోని డొల్లతనాన్ని, మనుషుల్లోని రకరకాల రంగులను నలుపు తెలుపుల తెర మీద నర్మగర్భంగా ఆవిష్కరించిన చిత్ర శిల్పి.

నవ్విస్తూనే అలవోకగా కంటతడి పెట్టిస్తూ.. గుండెను పిండేసే హాస్య చతురుడు... చార్లీ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16న బ్రిటన్ లో జన్మించారు.

ప్రపంచ సినిమా చరిత్రలో చాప్లిన్ ఒక చెరిగిపోని అధ్యాయం. ఆయన సృష్టించిన ట్రాంప్ పాత్రతో పరిచయం లేని వారెవరైనా ఉంటారా?

రచయిత, దర్శకుడు, సంగీతకారుడు, ఎడిటర్, నటుడిగా సినిమా ప్రియుల హృదయాల్లో తరతరాలుగా చెరగని ముద్ర వేశారు చాప్లిన్. ఆయనతో బీబీసీ ఇంటర్వ్యూ ఇది!

మీ సినిమాల్లో ఎక్కువగా ఒంటరితనమే ఎందుకు కనిపిస్తుంది?

'ఎ కింగ్ ఇన్ న్యూయార్క్' సినిమా విషయానికి వస్తే.. నిజమే. ఇందులో ఒంటరితనం ఉంది. నమ్ముకున్న వాళ్ళే ఆయనకు ద్రోహం చేస్తారు. మిగతా సినిమాల విషయానికి వస్తే ఒంటరితనం అని చెప్పలేను. అవి చాలా వరకు తమదైన వ్యక్తిత్వానికి కట్టుబడి ఉండే పాత్రలని అనుకోవచ్చు.

మీకు కూడా ఒంటరిగా ఉండడమంటే ఇష్టమా?

లేదు. నాకు అందమైన భార్య, ఎనిమిది మంది అద్భుతమైన పిల్లలున్నారు. మీరు ఒకసారి మా ఇంటికి వస్తే, నేను ఒంటరితనాన్ని ఇష్టపడతానో లేదో మీకే తెలుస్తుంది.

మీరు మీ చిత్రాల ద్వారా సందేశం ఇవ్వాలనుకుంటారా?

సినిమాల ద్వారా సందేశం ఇవ్వడం మీద నాకు నమ్మకం లేదు. నేను నా చిత్రాలతో ప్రజలను మమేకం అయ్యేలా చేయాలనుకుంటాను. వారు ఆ దృశ్యాల్లో లీనమైపోవాలని, ఆ విధంగా వినోదాన్ని అనుభవించాలని ఆశిస్తాను. ప్రధాన లక్ష్యం వినోదమే, సందేశం ఇవ్వడం కాదు. ఆ పని చర్చిలు బాగా చేస్తాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)