కామన్వెల్త్ సమావేశాలు: వస్తూ వస్తూ మోదీ ఏం తెస్తారు?

  • 18 ఏప్రిల్ 2018
ప్రిన్స్ చార్లెస్, మోదీ Image copyright Getty Images

ప్రిన్స్ చార్లెస్ గత నవంబర్‌లో భారత్ వచ్చినప్పుడు, బ్రిటన్ రాణి ఎలిజబెత్ రాసిన ఓ లేఖను ప్రధాని మోదీకి అందించారు. ఈ వారంలో లండన్‌లో జరుగుతున్న కామన్వెల్త్ సదస్సుకు మోదీ హాజరవ్వాలని ఎలిజబెత్ స్వయంగా ఆ లేఖ ద్వారా కోరారు.

ప్రధాని ఆ ఆహ్వానాన్ని స్వీకరించారు. ఏప్రిల్ 19-20 తేదీల్లో లండన్‌లో జరగనున్న కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్‌లో (సీహెచ్ఓజీఎం) ఆయన పాల్గొననున్నారు. దాదాపు పదేళ్ల విరామం తరవాత ఆ సమావేశాలకు హాజరవుతున్న తొలి భారత ప్రధాని మోదీనే.

మోదీకి ఎందుకంత ప్రత్యేక ఆహ్వానం?

‘యూకేకి ప్రస్తుతం విదేశీ పెట్టుబడులు చాలా అవసరం. అందుకే మోదీకి ఆ దేశం అంత ప్రాధాన్యం ఇస్తోంది’ అని దిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన జయశ్రీ సేన్ గుప్తా అభిప్రాయపడ్డారు.

దీని వల్ల భారత్‌తో పాటు బ్రిటన్‌కు కూడా లాభమేనని ఆమె అన్నారు.

భారత్ అంతర్జాతీయంగా ఎదగాలన్న తన ప్రణాళికను విస్తరించడానికి కామన్వెల్త్ కూటమి ఓ మంచి వేదికలా పనిచేస్తుంది.

భారత్‌కు ప్రధాన పోటీదారైన చైనా.. కామన్వెల్త్ కూటమిలో లేకపోవడం కూడా భారత్‌కు కలిసొచ్చే అంశమే.

2015లో జరిగిన సమావేశానికి మోదీ హాజరుకాలేదు. 2011, 2013లో జరిగిన సమావేశాలకు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా హాజరవ్వలేదు. అందుకే ఈ సమావేశాల ద్వారా మోదీ ఎలాంటి ఫలితాలు రాబడతారన్నది ఆసక్తికరంగా మారింది.

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దేశాన్ని కామన్వెల్త్ కూటమిలో భాగం చేశారు. కానీ ఆ తరవాత వచ్చిన ప్రధానులెవ్వరూ ఆ కూటమికి అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. దాన్ని కొందరు వలసవాద అవశేషంగా భావిస్తారు.

Image copyright Getty Images

భారత్‌కు ఏంటి లాభం?

కామన్వెల్త్ కూటమితో కలిసి పనిచేయడం ద్వారా స్వేచ్ఛా వాణిజ్యం, భద్రత, విద్య, నైపుణ్యాలు తదితర రంగాల అభివృద్ధి సాధ్యమయ్యే అవకాశం ఉంది.

‘అంతర్జాతీయంగా తన వాణిజ్య పరిధిని విస్తరించుకోవడానికి, స్వేచ్ఛా వాణిజ్యం జరపడానికి భారత్ ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల భారత వాణిజ్య శక్తి బలపడుతుంది’ అని లండన్‌లోని కింగ్స్ కాలేజీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హర్ష్ పంత్ వ్యాఖ్యానించారు.

స్వేచ్ఛా వాణిజ్యం వల్ల ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయని ఆయన అన్నారు.

బయటి దేశాలతో పోలిస్తే కామన్వెల్త్ సభ్య దేశాల మధ్య వాణిజ్య ఖర్చులు 19శాతం తక్కువగా ఉంటాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1969లోనూ కామన్వెల్త్ దేశాల అధినేతలు లండన్‌లో సమావేశమయ్యారు

కామన్వెల్త్‌కు భారత్ నాయకత్వం?

కామన్వెల్త్ కూటమికి భారత్‌ను నాయకత్వం వహించమని కోరుతున్నట్లు తెలుస్తోంది. కానీ దానికి ఇది సమయం కాదనీ, ఆ బాధ్యతను స్వీకరించడానికి భారత్‌కు ఇంకాస్త సమయం అవసరమనీ ముంబై విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఉత్తర సహస్రబుద్దే అన్నారు.

‘రెండు దశాబ్దాలుగా ప్రపంచం భారత్ వైపుచూస్తోంది. ఓ బలమైన ప్రాంతీయ శక్తిగా భారత్ అవతరిస్తుందని భావిస్తోంది. కానీ భారత్ మాత్రం దానికి సిద్ధంగా లేదు. ఇదో చిత్రమైన పరిస్థితి’ అని ఆమె పేర్కొన్నారు.

కానీ మూడేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. పాకిస్తాన్‌పై కఠిన వైఖరిని ప్రదర్శించే క్రమంలో ఇతర చిన్నదేశాలను తనతో కలుపుకోవడం, అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటు చేయడం లాంటి చర్యల ద్వారా భారత్ బలమైన శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తోందని భావించొచ్చు.

‘భారత్ ఆర్థికంగా ఎదుగుతున్నప్పటికీ, ఇప్పటికీ ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతోంది. ఇలాంటి కారణాల వల్ల బలమైన శక్తిగా ఆవిర్భవించే అవకాశాలు తగ్గిపోతాయి’ అని ఉత్తర అభిప్రాయపడ్డారు.

ఏంటీ సమావేశాల ప్రాధాన్యం?

1931లో బ్రిటిష్ పాలనలో ఉన్న కొన్ని దేశాలు, కొన్ని ఇతర దేశాల కలయికగా కామన్వెల్త్ కూటమి ఏర్పడింది. కామన్వెల్త్ దేశాధినేతల సమావేశం ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. సభ్య దేశాల అభివృద్ధే అందులో కీలక ఎజెండాగా ఉంటుంది.

  • కామన్వెల్త్ కూటమిలో మొత్తం 6 ఖండాలకు చెందిన 53 దేశాలున్నాయి.
  • ఈ దేశాల్లో 240 కోట్లమంది ప్రజలు జీవిస్తున్నారు. ప్రపంచ జనాభాలో ఇది దాదాపు 30శాతం.
  • మొత్తం కామన్వెల్త్ జనాభాలో సగం భారత్‌లోనే ఉంది.
  • కామన్వెల్త్ జనాభాలో 60శాతంమంది 30ఏళ్ల లోపు, వంద కోట్ల మంది 25ఏళ్ల లోపు ఉన్నారు.
  • జీ20, ఈయూ, ఆసియాన్, ఆఫ్రికన్ యూనియన్‌ సదస్సులలో కామన్వెల్త్ దేశాలకు ప్రాతినిధ్యం లభిస్తుంది.
  • కామన్వెల్త్ దేశాల్లో పసిఫిక్ ఐలాండ్‌లోని నారు అతి చిన్నదేశం. దాని జనాభా 10వేలు. విస్తీర్ణం 21చదరపు కిలోమీటర్లు.
Image copyright Getty Images
చిత్రం శీర్షిక కామన్వెల్త్ కూటమికి బ్రిటన్ రాణి ఎలిజబెత్ నాయకత్వం వహిస్తున్నారు

బ్రిటన్‌కు ఉన్న సవాళ్లేంటి?

అంతర్జాతీయ రాజకీయాల్లో బ్రిటన్‌కు ఇప్పుడు కొత్త గుర్తింపు అవసరం. బ్రెక్సిట్ అనంతరం ఆ దేశం లక్ష్యాలు మారాయి. కొత్త దేశాలతో మైత్రిని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. దానికి కామన్వెల్త్ ఓ రెడీమేడ్ వేదికలా మారింది.

కానీ అనేక విషయాల్లో బ్రిటన్ రక్షణాత్మకంగా వ్యవహిరిస్తోందనే భావన భారత్‌తో సహా అనేక కరీబియన్ దేశాల్లో నెలకొంది. తమ దేశ వీసా కోసం బ్రిటన్ విధించే ఆంక్షలే అందుకు ఉదాహరణ.

ఏదేమైనా యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటికొచ్చినప్పటికీ కామన్వెల్త్ నాయకత్వం మూలంగా అది బలమైన స్థానంలోనే ఉంది.

ప్రపంచ జీడీపీలో 15శాతం (2014 లెక్కల ప్రకారం) కామన్వెల్త్ దేశాల నుంచే వస్తోంది. 100కోట్ల మంది యువతకు కామన్వెల్త్ దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలన్నదే ప్రధానమైన సవాల్.

అందుకే ఈ వారంలో కామన్వెల్త్ దేశాధినేతలు ఏ నిర్ణయాలు తీసుకుంటారో, ఎలా ముందుకెళ్తారోనన్నది ఆసక్తికరం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)