క్యూబాలో క్యాస్ట్రోల 60 ఏళ్ల పాలనకు తెర

  • 19 ఏప్రిల్ 2018
రౌల్ క్యాస్ట్రోతో మిగెల్ డియాజ్ Image copyright AFP

క్యూబాలో సుదీర్ఘంగా సాగిన క్యాస్ట్రో కుటుంబ పాలనకు ఇక తెరపడనుంది. భవిష్యత్ అధ్యక్షుడిగా మిగెల్ డియాజ్-కానెల్‌ను ఆ దేశ పార్లమెంటు ఎంపిక చేసింది.

ప్రస్తుతం రౌల్ క్యాస్ట్రో కుడిభుజంగా వ్యవహరిస్తున్న మిగెల్ డియాజ్.. రౌల్ తదనంతరం క్యూబా అధ్యక్షుడవుతారు.

రౌల్ క్యాస్ట్రో 2006లో.. అనారోగ్యంగా ఉన్న తన సోదరుడు ఫిడెల్ క్యాస్ట్రో నుంచి అధ్యక్ష పదవి చేపట్టిన విషయం తెలిసిందే.

ఫిడెల్ క్యాస్ట్రో 90 ఏళ్ల వయసులో 2016లో చనిపోయారు.

రౌల్ వారసుడిగా మిగెల్ డియాజ్‌ అభ్యర్థిత్వంపై క్యూబా జాతీయ అసెంబ్లీ తాజాగా ఓటింగ్ నిర్వహించి ఆమోదించింది.

రౌల్ క్యాస్ట్రో గురువారం అధ్యక్ష పదవిని మిగెల్ డియాజ్‌కు అప్పగించే అవకాశముంది.

అయితే.. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా కమ్యూనిస్టు పార్టీ అధినాయకుడిగా 2021 వరకూ రౌల్ కొనసాగుతారు.

అలాగే.. ప్రభుత్వంలోనూ ఆయన బలమైన శక్తిగానే కొనసాగుతారని పరిశీలకులు భావిస్తున్నారు.

ఒకవైపు మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ, మరోవైపు మార్పు కోరుతూ అసహనంగా ఉన్న యువ జనాభా గల క్యూబాను కొత్త అధ్యక్షుడు ఎలా ముందుకు నడిపిస్తారనేది చూడాలని బీబీసీ క్యూబా ప్రతినిధి విల్ గ్రాంట్ పేర్కొన్నారు.

ఫిడెల్, రౌల్ క్యాస్ట్రోలలోలా మూర్తీభవించిన విప్లవ చరిత్ర లేకుండానే దేశానికి నాయకత్వం వహించాల్సిన సంక్లిష్ట పరిస్థితిని కూడా మిగెల్ ఎదుర్కొంటున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక క్యాస్ట్రోల సోదరులకన్నా మిగెల్ డియాజ్ ప్రజలకు మరింత ఎక్కువగా అందుబాటులో ఉంటారని చెప్తారు

ఎవరీ మిగెల్ డియాజ్-కానెల్?

మిగెల్ 2013లో క్యూబా ప్రభుత్వ మండలికి ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యారు. అప్పటికి పెద్దగా పేరు లేనప్పటికీ.. ఆ తర్వాత రౌల్ క్యాస్ట్రో కీలక మిత్రుడిగా మారారు.

ఆయనను గత ఐదేళ్లుగా అధ్యక్ష పదవి కోసం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 57 సంవత్సరాలు.

మిగెల్ మొదటి ఉపాధ్యక్షుడిగా నియమితుడు కావటానికి ముందే సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించారు.

ఆయన 1960లో జన్మించారు. అంటే.. ఫిడెల్ క్యాస్ట్రో మొదట ప్రధానమంత్రిగా ప్రమాణం చేయటానికి సుమారు ఒక ఏడాది ముందు పుట్టారు.

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన మిగెల్.. 20 ఏళ్ల వయసులోనే శాంటా క్లారాలో యంగ్ కమ్యూనిస్ట్ లీగ్ సభ్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు.

స్థానిక యూనివర్సిటీలో ఇంజినీరింగ్ బోధిస్తూ.. యంగ్ కమ్యూనిస్ట్ లీగ్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. తనకు 33 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ విభాగం రెండో కార్యదర్శిగా పదవి చేపట్టారు.

మిగెల్ ‘‘సైద్ధాంతిక నిబద్ధత’’ను రౌల్ క్యాస్ట్రో కీర్తించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఫిడెల్ క్యాస్ట్రో

క్యాస్ట్రో నమూనాకు కొనసాగింపు...

మిగెల్ డియాజ్-కానెల్‌ అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికవటం.. కొన్ని రకాలుగా చూస్తే గతానికి భిన్నంగా ఉందని హవానా బీబీసీ న్యూస్ ప్రతినిధి విల్ గ్రాంట్ పేర్కొన్నారు.

‘‘ఆయన ఐదు పదుల వయసులో ఉన్నారు. విప్లవం అధికారాన్ని సొంతం చేసుకునేటప్పటికి ఆయన ఇంకా పుట్టలేదు’’ అంటారు గ్రాంట్.

అయినప్పటికీ.. ‘‘క్యాస్ట్రో నమూనాకు.. ప్రత్యేకించి రాజకీయ నమూనాకు కొనసాగింపుగానే ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు’’ అని చెప్పారు.

‘‘అధికార మార్పిడి గురించి ప్రకటించిన క్షణం నుంచీ.. రాజకీయ కొనసాగింపు గురించి క్యూబా ప్రభుత్వం ఉద్ఘాటిస్తుండటం.. క్యూబా కొత్త శకంలోకి పయనిస్తుందన్న భావనలను తుడిచేసింది’’ అని గ్రాంట్ విశ్లేషించారు.

రౌల్ క్యాస్ట్రో ఆంతరంగిక వర్గానికి చెందిన వారు కనీసం ఇద్దరు ప్రభుత్వ మండలిలో కొనసాగుతున్నారు. వారిద్దరూ 80వ పడి చివర్లో ఉన్నవారే.

Image copyright AFP
చిత్రం శీర్షిక ‘ఫిడెల్ జిందాబాద్’, ‘రౌల్ జిందాబాద్’ అని హవానాలోని గోడల మీద రాసిన నినాదాలు

కొత్త అధ్యక్షుడు వాస్తవ మార్పు తీసుకొస్తారా?

ప్రత్యేకించి రౌల్ క్యాస్ట్రో రాజకీయ శక్తిగా ఇంకా కొనసాగుతున్న పరిస్థితుల్లో.. మిగెల్ తక్షణమే భారీ మార్పులు తీసుకొచ్చే అవకాశం కనిపించటం లేదు.

ఏ మార్పులైనా క్రమంగా, నెమ్మదిగా ఉండే అవకాశముంది. నిజానికి రౌల్ క్యాస్ట్రో తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని సంస్కరణలు తెచ్చారు. అందులో అమెరికాతో సంబంధాలు మెరుగుపడటం చాలా ముఖ్యమైనది. ఫిడెల్ క్యాస్ట్రో హయాంలో ఇటువంటి మార్పు ఊహలో కూడా సాధ్యమయ్యేది కాదు.

క్యూబా మిత్ర దేశమైన వెనిజువెలా ఆర్థికంగా కుప్పకూలటంతో తలెత్తిన సమస్యల నుంచి గట్టెక్కటమెలా అనే అంశంపై కొత్త అధ్యక్షుడు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే.. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికాతో తమ దేశం ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలన్నదీ ఆయన ఆలోచించాల్సి ఉంటుంది.

ఒబామా హయాంలో అమెరికాతో మెరుగుపడ్డ సంబంధాలు ట్రంప్ వచ్చాక దెబ్బతిన్నాయి.

క్యూబా విషయంలో ఒబామా ప్రభుత్వం సడలించిన కొన్ని ప్రయాణ, వ్యాపార ఆంక్షలను ట్రంప్ గత ఏడాది మళ్లీ విధించారు. అయితే.. ఒబామా పాలనలో నెలకొన్న కీలకమైన దౌత్య, వాణిజ్య సంబంధాలను అలాగే కొనసాగించారు.

కానీ.. తమ రోజు వారీ జీవితాలు మెరుగుపడతాయా లేదా అన్నదాన్ని బట్టి కొత్త అధ్యక్షుడి పనితీరుపై క్యూబా ప్రజలు అత్యధికంగా తీర్పు చెప్తారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మిగెల్ డియాజ్ గతంలో భారత్‌లో పర్యటించారు

‘‘భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడు మాకు తెలీదు’’ అని హవానాలో టీచర్‌గా పనిచేస్తున్న 45 ఏళ్ల ఆడ్రియానా వాల్దీవియా రాయిటర్స్ వార్తా సంస్థతో పేర్కొన్నారు.

‘‘రౌల్ శకం ముగిసింది. ఫిడెల్ చరిత్రగా మారారు. క్యూబా ప్రజల జీవితాలు మెరుగుపడే దారి నాకు కనిపించటం లేదు. జీతాలు అలాగే ఉన్నాయి. జీవితం గడవటం లేదు. ఇప్పుడు ట్రంప్ ఆంక్షలతో నట్లు బిగిస్తున్నారు. పరిస్థితిని ఊహించండి’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

‘‘రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలీదు. కానీ.. నాయకుడు మారటంతో నా జీవితం మారుతుందని నేననుకోవటం లేదు’’ అని దియాదెనిస్ సనాబ్రియా (34) అనే ప్రభుత్వ రెస్టారెంట్ కార్మికురాలు చెప్పారు.

క్యూబా జాతీయ అసెంబ్లీలో ప్రజా ప్రాతినిధ్యం ఎలా ఉంటుంది?

క్యూబా జాతీయ అసెంబ్లీని ఎక్కువ శాతం ఒక రబ్బరు స్టాంపుగానే పరిగణిస్తారు. ఈ అసెంబ్లీకి గత నెలలో ఎన్నికైన 605 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం కోసం ప్రస్తుతం సమావేశమైంది.

దేశంలో అత్యంత శక్తిమంతమైన రాష్ట్ర మండలి కూర్పును కూడా అది ఓటు వేసి నిర్ణయిస్తుంది. ఆ మండలి అధ్యక్షుడు.. ప్రభుత్వాధినేతగానూ, దేశాధినేతగానూ వ్యవహరిస్తారు.

ప్రపంచంలో అత్యంత ప్రాతినిధ్యపూరితమైన, నిష్పాక్షికమైన ఎన్నికల వ్యవస్థ తమదని క్యూబా ఎప్పటి నుంచో చెప్తోంది. అయితే.. ఆ మాటలు హాస్యాస్పదమని.. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా అధికార కమ్యూనిస్టు పార్టీ పర్యవేక్షణలో జరుగుతుందని విమర్శకులు అంటారు.

మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఎన్నికైన 605 మంది అభ్యర్థులపై ఎవరూ పోటీ చేయలేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)