పరిశోధన: మైగ్రేన్‌కు సరికొత్త మందు..‘ఇది జీవితాలను మార్చేస్తుంది!’

  • 21 ఏప్రిల్ 2018
మైగ్రేన్ తలనొప్పి Image copyright iStock

మైగ్రేన్ కోసం ఓ సరికొత్త ఔషధం అందుబాటులోకి వచ్చేలా ఉంది. దశాబ్దాల చరిత్రలో.. మైగ్రేన్ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఈ ఔషధం సత్ఫలితాలనిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఎరెన్యుమాబ్ అన్నది నెలనెలా వాడాల్సిన సూది మందు. దీని ధరనుబట్టి, మైగ్రేన్‌తో బాధపడేవారికి ఇకపై ఈ మందునే వైద్యులు సూచించవచ్చు.

అమెరికన్ మెడికల్ కాన్ఫరెన్స్‌లో ఈ ఔషధం గురించి ప్రస్తావించారు. మైగ్రేన్‌తో బాధపడేవారిలో కనీసం మూడోవంతు మందిపై ఇది పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. మైగ్రేన్‌కు ఇంతవరకూ సూచించిన నాలుగు వైద్య విధానాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.

మైగ్రేన్ కోసం ప్రత్యేకంగా తయారీ

తీవ్రమైన మైగ్రేన్‌తో బాధపడేవారిపై 12 వారాలపాటు పరిశోధనలు చేశారు. వారికి ఎరెన్యుమాబ్‌తో చికిత్స అందించారు. వీరిలో మూడోవంతు మందికి నెలనెలా వచ్చే తలనొప్పుల సంఖ్య యాభై శాతం వరకూ తగ్గింది.

మైగ్రేన్ తలనొప్పికోసం ఇప్పటివరకూ అందుబాటులోని మందులకంటే ఎరెన్యుమాబ్ భిన్నంగా పని చేస్తుంది. రక్తపోటు, మూర్ఛరోగానికి ఇచ్చే మందులనే మైగ్రేన్‌కూ ఇస్తూ వచ్చారు. కానీ ఎరెన్యుమాబ్‌ను మైగ్రేన్‌ కోసమే ప్రత్యేకంగా తయారు చేశారు.

ఎలా పనిచేస్తుంది?

మెదడులో.. మైగ్రేన్ సంకేతాలను ప్రసరింపచేసే గ్రాహకాలను నియంత్రించే యాంటీబాడీగా ఈ మందును తయారు చేశారు.

మెదడులో.. మైగ్రేన్ ‘నొప్పి’ సంకేతాలను ప్రసరింపచేసే గ్రాహకాలపై ఎరెన్యుమాబ్ పని చేస్తుంది. ఈ గ్రాహకాలను నియంత్రించడం వల్ల నొప్పిని అదుపు చేయడానికి వీలవుతుంది.

మైగ్రేన్‌కు, తలనొప్పికి తేడా ఏంటి?

మైగ్రేన్ వల్ల తలనొప్పి వస్తుంది కానీ.. ఇది తలనొప్పికంటే మించిన సమస్య.

మైగ్రేన్ అన్నది ఒకసారి వస్తే.. ఎంతకాలం ఉంటుందో సరిగా చెప్పలేం. కొన్నిసార్లు గంటలతరబడి బాధించవచ్చు, కొన్నిసార్లు రోజుల తరబడి కూడా ఉండొచ్చు. ఆ సమయంలో ఓచోట కూర్చోనివ్వదు, నిద్రపోనివ్వదు, విశ్రాంతి కూడా తీసుకోనివ్వదు.

ఆ సమయంలో వాంతి వచ్చినట్లు ఉండడం, వెలుతురును చూడలేకపోవడం, కళ్ల ముందు మెరుపులు వచ్చినట్లు, చీకటి కమ్ముకున్నట్లు అనిపిస్తుంది. బ్రిటన్‌లో ప్రతి 7మందిలో ఒకరు మైగ్రేన్‌తో బాధపడుతున్నారు.

Image copyright Rachel Walls
చిత్రం శీర్షిక రేఛెల్ వాల్స్

ఈమె కొత్త మందును వాడి చూశారు..

వెస్ట్ మిడ్‌లాండ్స్‌కు చెందిన రేఛెల్ వాల్స్ వయసు 37. ఈమె గత 20 సంవత్సరాలుగా మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. ఈ ఇరవైయ్యేళ్లలో ఈమె వాడిన మందులు, చికిత్సలు సత్ఫలితాన్ని ఇవ్వలేదు.

‘‘మైగ్రేన్ సమయంలో తీవ్రమైన వెలుతురును అస్సలు భరించలేను. కొన్ని రకాల వాసనలు ఇబ్బంది పెడతాయి. కళ్లు తెరిస్తే.. కాంతిమెరుపులు, అణువులు గాల్లో తేలుతున్నట్లు కన్పిస్తాయి'' అని రేఛెల్ చెబుతున్నారు.

ఇంకా తన బాధ గురించి చెబుతూ.. ''నొప్పి భరించరానిదిగా ఉంటుంది. తలపై ఎవరో సమ్మెటతో కొట్టినట్లుంటుంది. వెలుతురును అస్సలు చూడలేను. నొప్పి తగ్గేవరకూ చీకటి గదే శరణ్యం. కొన్నిసార్లు రోజుల తరబడి నొప్పి ఉంటుంది'' అని వివరించారు.

మైగ్రేన్ సమయంలో శక్తిమంతమైన మందులనే రేఛెల్ వాడినారు. ''కానీ ఆరోగ్యానికి అవి అంత మంచిది కాదు'' అంటున్నారు.

12వారాలపాటు సాగిన ఎరెన్యుమాబ్ ప్రయోగాల్లో ఈమె కూడా పాల్గొన్నారు. ఎరెన్యుమాబ్ వాడిన తర్వాత తరచూ నొప్పి రావడం తగ్గిందని, నొప్పి వచ్చిన ప్రతిసారీ తక్కువ సమయమే ఉంటోందని చెబుతున్నారు.

''గతంలో 12-15సార్లు మైగ్రేన్ వచ్చేది. కానీ ఇప్పుడు నెలకు 6-8సార్లు మాత్రమే మైగ్రేన్ వస్తోంది. ఇదేదో మాయ అని చెప్పను కానీ నాకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. గత జూన్ నెలలో నాకు ఎరెన్యుమాబ్ ఇచ్చారు. మొదటి మూడు నెలలు గుణం కనిపించలేదు. ఆ తర్వాత అది పని చేయడం మొదలైంది'' అని రేఛెల్ వివరించారు.

''ఈ మందు 12నెలలు మాత్రమే వాడాలట. ఆ తర్వాత ఎలా ఉంటుందో తెలీదు. మళ్లీ నాకు అవసరమయ్యేలోపు 'ఎరెన్యుమాబ్'కు ఆమోదం లభిస్తుందో లేదో చూడాలి.''

Image copyright iStock

‘ఇది జీవితాలను మార్చేస్తుంది!’ : నిపుణులు

ఈ ఔషధం లక్షలాది మైగ్రేన్ బాధితుల జీవితాలను మారుస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ విషయాన్ని రుజువు చేయడానికి దీర్ఘకాలిక పరీక్షలు అవసరం. ఎరెన్యుమాబ్ ప్రయోగాలకు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ గోడ్స్‌బీ మాట్లాడుతూ..

''ఈ ఔషధాన్ని తీసుకుంటున్నవారిలో ఎవరు ఎక్కువ లాభపడుతున్నారో తెలుసుకోవడం ముఖ్యం. వీరికి ఇంతవరకూ ఎలాంటి ప్రత్యామ్నాయమూ లేదు. వీరిలో కొద్దిమందికైనా ఇది మంచి ఫలితాలనిస్తుంది'' అన్నారు.

''మైగ్రేన్‌ను నివారించే లేదా ఎదుర్కోగల ఔషధం చాలా అవసరం. మైగ్రేన్‌ను తలనొప్పి అని కొట్టిపారేస్తుంటారు. కానీ.. దీని వల్ల జీవితాలే నాశనం అవుతాయి. ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుంది'' అని 'మైగ్రేన్ యాక్షన్'కు చెందిన సైమన్ ఇవాన్స్ అన్నారు.

ఎరెన్యుమాబ్‌తోపాటు 'ఫ్రెమనెజుమాబ్' అనే మరో మైగ్రేన్ ఔషధాన్ని కూడా ఆమోదం కోసం 'అమెరికా అండ్ యూరోపియన్ డ్రగ్ రెగ్యులేటర్స్‌'కు పంపారు. త్వరలోనే నిర్ణయం వెలువడనుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)