ప్రపంచం అంతమైపోతుందా? ఎవరు చెప్పారు?

  • 20 ఏప్రిల్ 2018
ఫేక్ న్యూస్ Image copyright BENCHMARK ASSESSMENT

ఈ మధ్య వాట్సాప్‌లో ఓ వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ప్రపంచంలో థర్మోన్యూక్లియర్ యుద్ధం మొదలవబోతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తుంది.

ఆ వీడియోకు బీబీసీ బ్రాండింగ్ ఉండటంతో అది నిజంగానే బీబీసీ ప్రసారం చేసిన వార్త అని చాలా మంది భావిస్తున్నారు. నిజమని నమ్ముతున్నారు. కొందరు బీబీసీని సంప్రదించి ఇది నిజమేనా అని అడిగారు కూడా.

అయితే ఇది నిజమైన వీడియో కాదు - ఇదొక నకిలీ వీడియో. ఈ వీడియోను మొదట యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. దీనిని మొదట పోస్ట్ చేసిన వారు ఇది కల్పితమని స్పష్టంగానే పేర్కొన్నారు. అయితే ఇప్పుడా అకౌంట్‌ ఉనికిలో లేదు.

ఇప్పుడీ వీడియోను జనాలు ఎలాంటి వివరణా లేకుండా వాట్సాప్‌లో పరస్పరం షేర్ చేస్తున్నారు. దాంతో చాలా మంది ఇది నిజమే కావొచ్చని నమ్ముతున్నారు.

ఇంతకూ ఈ వీడియోలో ఏముంది?

అందరికీ పరిచితమైన బీబీసీ న్యూస్ రూం షాట్‌తో ఈ వీడియో మొదలవుతుంది. గంభీర వదనంతో ఉన్న ఓ న్యూస్ ప్రెజెంటర్, "రష్యా, నాటోల మధ్య ఒక తీవ్రమైన ఘటన జరిగింది" అని ప్రకటిస్తాడు.

"ఇంకా పూర్తి వివరాలు తెలియనప్పటికీ... ఒక రష్యన్ గూఢచర్య విమానంపై నాటో బలగాలు ఓ యుద్ధనౌక నుంచి దాడులు చేసినట్టు ప్రాథమిక రిపోర్టులను బట్టి తెలుస్తోంది" అని ప్రెజెంటర్ చెబుతాడు.

పరిస్థితులు ఎంత తీవ్రంగా తయారయ్యాయంటే, రష్యన్ యుద్ధనౌక నాటో స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించింది. బ్రిటిష్ రాజకుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అందరూ తమ ఇళ్లలోనే ఉండాలంటూ ఒక అత్యవసర సందేశాన్ని ప్రసారం చేశారు. థర్మోన్యూక్లియర్ యుద్ధం మొదలైంది. జర్మనీలోని కామాంజ్ నగరం, ఫ్రాంక్‌ఫర్ట్ లోని చాలా భాగం ఇప్పటికే విధ్వంసమైపోయాయి... ఇలా సాగుతుందీ రిపోర్టు.

ఈ కల్పిత వార్తను వండి వార్చడానికి చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు కానీ ఇందులో లోపాలు కూడా చాలానే ఉన్నాయి.

ఇందులో బీబీసీ బ్రాండింగ్‌ను ఉపయోగించారు కానీ, ఇందులో వాటిని ఫాంట్, స్టైల్, లేఅవుట్ పూర్తిగా వేరుగా ఉన్నాయి.

Image copyright BENCHMARK ASSESSMENT

ఇలాంటి వీడియో ఏదైనా కనిపిస్తే ఏం చెయ్యాలి?

మీకు ఏదైనా పెద్ద మీడియా సంస్థ పేరుతో ఏదైనా వీడియో కనిపించినప్పుడు, అది నకిలీది కావొచ్చని మీకు అనిపించినట్టయితే, మొట్టమొదట మీరు చేయాల్సింది ఆ మీడియా సంస్థ వెబ్‌సైట్‌కు వెళ్లి హోమ్ పేజీని చూడడం.

ప్రస్తుత వీడియోనే తీసుకుంటే - థర్మోన్యూక్లియర్ యుద్ధం మొదలైందని బీబీసీ వార్త ప్రసారం చేసినట్టయితే, దానికి సంబంధించిన వార్త బీబీసీ వెబ్‌సైట్‌పై కూడా ఉండితీరాలి. ఇంకా వేర్వేరు సంస్థలు కూడా ఆ వార్తను ధ్రువీకరించాలి.

Image copyright Youtube
చిత్రం శీర్షిక ఈ వీడియోను అప్‌లోడ్ చేసిన యూ.

మరైతే ఈ వీడియోను ఎవరు రూపొందించారు?

నిజానికి ఈ కల్పిత వీడియోను ఒక ఐరిష్ కంపెనీ కోసం 2016లో తయారు చేశారు. ఇందులో ప్రెజెంటర్‌గా నటించిన వ్యక్తి మార్క్ రైస్.

మార్క్ రైస్ బీబీసీతో మాట్లాడుతూ, "ఇది బెంచ్‌మార్కింగ్ అసెస్‌మెంట్ గ్రూప్ అనే కంపెనీ తయారు చేసింది. తమ వినియోగదారులపై సైకోమెట్రిక్ పరీక్షలు నిర్వహించి, అత్యవసర పరిస్థితిలో వారు ఎలా ప్రతిస్పందిస్తారో తెలుసుకోవడం ఈ వీడియో ఉద్దేశం" అని చెప్పారు.

యూట్యూబ్‌లో పోస్ట్ అయిన అసలు వీడియోలో ఇది కల్పితం అనే విషయం స్పష్టంగా ఉంది. ఇది నిజమైన బీబీసీ న్యూస్ లాగా కనిపించడం లేదు కూడా. ఇది పూర్తిగా అసలైందిగా కనిపించగూడదనే దీన్ని రూపొందించిన వారి ఉద్దేశం.

"నేను ఇందులో ఒక నటుడిలా నటించాను. అంతే. దీనిని గ్రీన్ స్క్రీన్‌పై రికార్డు చేశారు. దీని నిర్మాణం, ఎడిటింగ్‌లో నా పాత్రేమీ లేదు" అని రైస్ తెలిపారు.

బీబీసీ ఏం చెబుతోంది?

రష్యాకు, నాటోకు మధ్య యుద్ధానికి సంబంధించి బీబీసీ ఓ వార్త ప్రసారం చేసినట్టుగా చూపించే ఓ వీడియోను చాలా మంది షేర్ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందంటూ బీబీసీ ప్రెస్ కార్యాలయం గరువారం ఉదయం ఓ ట్వీట్ చేసింది.

"ఈ వీడియో యూట్యూబ్ నుంచి వ్యాపించింది. ఇది కల్పితమని అందులో స్పష్టంగా పేర్కొన్నారు" అని బీబీసీ ప్రతినిధి ట్విటర్‌లో తెలిపారు.

"దీన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు ఇది కల్పితమైందని స్పష్టంగానే పేర్కొన్నారు కాన్ని దాన్ని ఇతరులు షేర్ చేస్తున్నపుడు ఈ వివరణ లేకుండా చేస్తున్నారు. అందుకే ఇలా ట్వీట్ చేయాల్సి వస్తోంది" అని ఆ ప్రకటనలో బీబీసీ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)