నేపాల్: ఈసారి ఎవరెస్టు అధిరోహకుల్లో మహిళలే ఎక్కువ!

  • 21 ఏప్రిల్ 2018
మహిళ Image copyright PURNIMA SHRESTHA

ఈ సీజన్‌లో రికార్డు సంఖ్యలో నేపాలీ మహిళలు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తున్నారని అధికారులు బీబీసీకి తెలిపారు.

అందుకోసం ప్రస్తుతం నేపాల్‌కు చెందిన 15 మంది మహిళలు సిద్ధమవుతుండగా, కేవలం ఐదుగురు పురుషులు మాత్రమే వెళ్తున్నారు.

గతంలో అత్యధికంగా 10 మంది నేపాలీ మహిళలు 2008లో ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు. వారిలో అందరూ శిఖరాన్ని చేరుకున్నారు.

లింగ వివక్ష, పర్యావరణానికి సంబంధించిన సమస్యలను ప్రపంచం దృష్టిని తీసుకెళ్లాలన్న ఆలోచనతో చాలామంది మహిళా అధిరోహకులు ఉన్నారు.

"మా బృందం రెండు ప్రధాన సందేశాలను ఇవ్వనుంది. అందులో ప్రధానమైనది మహిళల అక్రమ రవాణా, రెండోది బుద్ధుడు నేపాల్‌లోనే జన్మించారని ప్రపంచానికి గుర్తుచేయడం" అని ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌లో ఉన్న షర్మిళా లామా బీబీసీకి చెప్పారు.

Image copyright PURNIMA SHRESTHA

మహిళల అక్రమ రవాణా అనేది నేపాల్‌లో ఆందోళన కలిగించే సమస్యగా మారింది.

ఉద్యోగాలు ఇప్పిస్తాంటూ నమ్మించి గ్రామీణ ప్రాంతాల యువతులను దుండగులు ఇతర దేశాలకు తరలిస్తున్నారు. అక్కడ వారిని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు.

2015 భూకంపానికి ప్రభావితమైన కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఆగడాలు అధికంగా సాగుతున్నాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

‘‘బుద్ధుడు భారత్‌లో జన్మించారని కొందరు ప్రపంచానికి అబద్ధాలు చెబుతున్నారు. అందుకే బుద్ధుడి జన్మస్థలం నేపాల్ అని చాటిచెప్పాలని అనుకుంటున్నాం" అని షర్మిళ తెలిపారు.

"ఇక్కడి వాతావరణ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. అయినా త్వరలోనే ప్రయాణం ప్రారంభించబోతున్నాం" అని ఆమె వెల్లడించారు.

Image copyright SHARMILA SYANGTAN

ఈ బృందంలో పూర్ణిమా శ్రేష్ఠ అనే ఫొటో జర్నలిస్టు కూడా ఉన్నారు.

ఎవరెస్టు శిఖరం పైన ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తానని ఆమె చెబుతున్నారు.

"నేను ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్తున్నాను అని అంటే అందరూ జోకులు వేయడం ప్రారంభించారు. మీరు ఆ శిఖరం పైకి ప్రయాణం ప్రారంభిస్తే, మేము కూడా పర్వతారోహకులం అయినట్టే.. అంటూ హేళనగా మాట్లాడారు" అని పూర్ణిమ వివరించారు.

అయితే, ఇక వెనక్కి తగ్గేది లేదని, వారి మాటల తర్వాత తనలో పట్టుదల మరింత పెరిగిందని ఆమె అంటున్నారు.

ఈ పర్వతారోహకుల బృందంలో ఐదుగురు పాత్రికేయులు ఉన్నారు.

"మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపిస్తూ, వారిలో స్ఫైూర్తిని నింపాలన్న ఆలోచనతో వెళ్తున్నాం. సామాజిక, పర్యావరణ సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఎవరెస్టు శిఖరం మీది నుంచి ప్రత్యక్ష ప్రసారాలు చేస్తాం" అని పాత్రికేయులు రోషా బాస్నెట్ తెలిపారు.

Image copyright PURNIMA SHRESTHA

ఇంట్లో చెప్పకుండా పర్వతం ఎక్కేశా!

"గతేడాది మా ఇంట్లో ఎవరికీ చెప్పకుండానే వెళ్లి ఓ భారీ పర్వతాన్ని అధిరోహించాను. అది విజయవంతమైన తర్వాత మా వాళ్లకు చెప్పాను. అందుకే ఈ సారి ఎవరెస్టును అధిరోహించేందుకు అనుమతించారు" బృందంలోని మరో సభ్యురాలు కల్పనా మహార్జన్ వివరించారు.

ఎవరెస్టును ఎక్కువ సార్లు అధిరోహించిన రికార్డు కూడా నేపాలీ మహిళ పేరిటనే ఉంది.

ఇక్కడి షెప్రా సముదాయానికి చెందిన లక్పా షెప్రా అనే పర్వతారోహకురాలు 8 సార్లు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి గతేడాది ఆ రికార్డును సొంతం చేసుకున్నారు.

Image copyright SHARMILA LAMA

ఇవీ రికార్డులు..

హిమాలయ పర్వతాల్లో సాహస యాత్రల వివరాలను క్రోడీకరించే 'ది హిమాలయన్ డేటాబేస్' సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం 1998 నుంచి 2017 వరకు 918 మంది(44 మంది నేపాలీలు) మహిళలు ఎవరెస్టును అధిరోహించేందుకు ప్రయత్నించారు.

వారిలో 494 మంది(35 మంది నేపాలీలు) విజయవంతంగా శిఖరం పైకి చేరుకున్నారు.

3,195 పురుషులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. అందులో 135 మంది నేపాల్‌కి చెందిన వారు ఉన్నారు.

ఎవరెస్టును అధిరోహించే సాహస యాత్ర ఇటీవలే ప్రారంభమైంది. మే ఆఖరులో ముగియనుంది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు