ఐఎస్ మిలిటెంట్ల చేసిన మారణహోమం లో అనాధలుగా మిగిలిన పసి పిల్లలు.
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఇరాక్: యుద్ధం ఆ పిల్లలను అనాథలుగా మారిస్తే ఓ అమ్మ వారికి నీడనిస్తోంది!

  • 21 ఏప్రిల్ 2018

ఇరాక్‌లో యుద్ధం సృష్టించిన వినాశకర పరిస్థితుల వల్ల ఎంతో మంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయి ఆనాథలుగా మిగిలిపోతున్నారు.

ఇలాంటి పిల్లలను అధికారులు కొన్ని చోట్ల చేరదీస్తున్నారు. అయితే అధికారులు చేస్తున్న దానితో సంతృప్తి చెందలేదు సుకయినా ముహమ్మద్ అలీ అనే మహిళ.

ఆమె ఆ చిన్నారులను అక్కున చేర్చుకుంటున్నారు. "ఐఎస్ వల్ల నా జీవితం మొత్తం నాశనం అయ్యింది. నేనిపుడు బాధితుల పిల్లలకు సాయం చేస్తున్నాను" అని ఆమె అన్నారు.

సుకయినా కుటుంబం మోసుల్ నుంచి పారిపోయాక వాళ్ల ఇంటిని ఇస్లామిక్ స్టేట్ స్థానిక ప్రధాన కార్యాలయంగా మార్చుకుంది.

ఇంటి తలుపు మీద ఈ స్థిరాస్తి ఇస్లామిక స్టేట్ - 2014కు చెందినదని రాసుంది.

ఐఎస్ మిలిటెంట్లు ఇక్కడ బాంబులు తయారు చేశారు. సమీపంలోని శవాలను పూడ్చేందుకు గుంతలు తవ్వారు.

యుద్ధం మూలంగా అనాథలైన పిల్లలకు ఇప్పుడు సుకయినా అండగా నిలిచారు. ఆ పిల్లలలో ఒకరు రెండేళ్ల జన్నత్. ఆమె ఓ ఐఎస్ మిలిటెంట్ కూతురు.

వేలాది మంది ఉండే పునరావాస కేంద్రంలో జన్నత్ ఒంటరిగా తిరుగుతూ సుకయినా కంటబడింది. అలా ఆమెకు సుకయినా అమ్మ అయ్యింది.

ఈ పిల్లల తల్లిదండ్రులెవరో తెలుసుకోవడానికి సుకయినా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమె ప్రయత్నం కొందరికి ఆగ్రహం తెప్పిస్తోంది.

నాకు చాలా మంది కాల్స్ చేసి, ఈ ఐఎస్ పిల్లల ఫోటోలను ఎందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నావని ప్రశ్నిస్తున్నారు.

"ఐఎస్ మా పిల్లల్ని చంపింది, కాబట్టి వారి పిల్లల్ని ఆనాథ శరణాలయంలోనే ఉండనివ్వండి. వాళ్ల కుటుంబాలు కూడా మాలానే బాధపడాలి" అంటున్నారు.

ఐఎస్‌ వ్యతిరేకుల నుంచీ, ఐఎస్ మద్దతుదారుల నుంచీ సుకయినాకు బెదిరింపులు వస్తున్నాయి.

"ఐఎస్ భావజాలాన్ని సమర్థించే వారు ఇంకా ఉన్నారు. కొన్నిసార్లు, ప్రభుత్వంతో కలిసి వారికి వ్యతిరేకంగా ఎందుకు పని చేస్తున్నావు" అంటూ ఫేస్‌బుక్‌లో తిడుతూ మెసేజ్‌లు వస్తున్నాయి.

అయితే, సుకయినా భయపడే వ్యక్తి కాదు. అప్రమత్తంగా ఉంటూ.. పిల్లలను జాగ్రత్తగా చూసుకోగలననే నమ్మకం నాకుందని ఆమె అంటారు. అయితే, వారి కోసం ఒక ఇల్లును సమకూర్చుకోవడం ఆమె తక్షణ లక్ష్యం.