ఉత్తర కొరియా ఇకపై అణు, క్షిపణి పరీక్షలు నిర్వహించదు: కిమ్ జోంగ్- ఉన్

  • 21 ఏప్రిల్ 2018
పేలుతున్న క్షిపణి Image copyright EPA

అణు పరీక్షలను, క్షిపణి పరీక్షలను తక్షణమే నిలిపివేస్తున్నామని ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్- ఉన్ ప్రకటించారు.

"ఏప్రిల్ 21 నుంచి ఉత్తర కొరియా అణు పరీక్షలను, ఖండాంతర క్షిపణుల పరీక్షలను నిలిపివేస్తోంది" అని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

దేశ ఆర్థికాభివృద్ధి సాధన, కొరియా ద్వీపకల్పంలో శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో ఉత్తర కొరియా ఈ నిర్ణయం తీసుకుందని ఆ దేశ అధికారిక మీడియా సంస్థ తెలిపింది.

వచ్చే వారం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయ్- ఇన్‌తో కిమ్ సమావేశం కానున్నారు.

అలాగే జూన్‌లోగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోనూ కిమ్ భేటీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలా జరిగితే అది ప్రస్తుత అమెరికా, ఉత్తర కొరియా నేతల మధ్య తొలి సమావేశం అవుతుంది.

కిమ్ ప్రకటన పట్ల ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. "ఉత్తర కొరియాకు, ప్రపంచానికి ఇది శుభవార్త. గొప్ప పరిణామం" అని ట్వీట్ చేశారు.

అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా అంగీకరిస్తే ఆ దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుందని ట్రంప్ గురువారం అన్నారు.

ఉత్తర కొరియా 'అర్ధవంతమైన నిర్ణయం' తీసుకుందని దక్షిణ కొరియా అధ్యక్షుడి అధికార ప్రతినిధి తెలిపారు.

"దక్షిణ - ఉత్తర కొరియాల సదస్సు, ఉత్తర కొరియా - అమెరికా సదస్సు విజయవంతం కావడానికి సానుకూల వాతావవరణం ఏర్పడేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది" అని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం అభిప్రాయపడింది.

Image copyright Getty Images

కీలక పరిణామం

దక్షిణ కొరియా రాజధాని సోల్ నుంచి బీబీసీ ప్రతినిధి లారా బికర్ విశ్లేషణ

ఉత్తర కొరియా తాజా నిర్ణయాన్ని 6 బుల్లెట్ పాయింట్ల రూపంలో ఆ దేశ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. అది చాలా కీలకమైన ప్రకటన.

కావాల్సిన అణ్వాయుధాలను సమకూర్చుకున్నామని ఇకనుంచి అణు, క్షిపణి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని కిమ్ అంటున్నారు.

తాము సాధించిన అణ్వాయుధ సంపత్తి పట్ల చాలా సంతృప్తిగా ఉందంటూ నూతన సంవత్సరం ప్రసంగంలో ఆయన చెప్పారు. తాజా ప్రకటనతో అదే విషయాన్ని పునరుద్ఘాటించారు.

ఇప్పటికే ఉత్తర కొరియా ఆరు సార్లు అణు పరీక్షలు నిర్వహించింది. ఇక ఆ ఆయుధాల సామర్థ్యాలను పెంచాల్సిన అవసరం లేదని ఆ దేశం భావించి ఉండొచ్చు.

అయితే అంతర్జాతీయ సమాజం డిమాండ్ చేసిన అణు నిరాయుధీకరణకు ఆ దేశం అంగీకరించినట్టు ఏమీ కాదు.

అణు పరీక్షలను నిలిపివేస్తున్నామని మాత్రమే ఉత్తర కొరియా ప్రకటించింది, కానీ ఆ ఆయుధాలను పూర్తిగా దూరంపెడతామన్న హామీ మాత్రం ఇవ్వలేదు.

గతంలో ఇలాంటి ప్రతిజ్ఞలు చేసి తర్వాత మాటమార్చింది. అయినా సరే తాజా ప్రకటన చాలా కీలకమైనదే.


Image copyright Reuters
చిత్రం శీర్షిక ఉత్తర కొరియా సైన్యంతో ఆ దేశ పాలకుడు కిమ్

ఉత్తర కొరియా జరిపిన ప్రధాన క్షిపణి పరీక్షలు

అణు పరీక్షలపై ఐక్యరాజ్య సమితి సహా, అంతర్జాతీయ సంస్థలు, వివిధ దేశాలు విధించిన ఆంక్షలను ఉత్తర కొరియా అనేకసార్లు ధిక్కరిస్తూ వచ్చింది.

  • 2016 నవంబర్ 30: ఉత్తర కొరియా చైనాకు విలువైన బొగ్గును ఎగుమతి చేస్తుంది. నూతన అమ్మకాల పరిమితుల విధానం కింద యూఎన్ ఈ ఎగుమతులను 60 శాతానికి కుదించింది. అట్లాగే రాగి, నికెల్, సిల్వర్, జింక్ సహా విగ్రహాల అమ్మకాలపై కూడా నిషేధం విధించింది.
  • ఉత్తర కొరియా స్పందన: భారీ న్యూక్లియర్ వార్‌హెడ్‌ను మోసుకుపోగల బాలిస్టిక్ రాకెట్‌ను ఉత్తర కొరియా 2017 మే 14న ప్రయోగించింది. దీనిని నూతనంగా అభివృద్ధి చేశామని అది పేర్కొంది.
  • 2017 జూన్ 2: నాలుగు సంస్థలపై, 14 మంది అధికారులపై యూఎన్ ప్రయాణ ఆంక్షలు విధించింది. ఆంక్షలు విధించిన వారిలో ఉత్తర కొరియా విదేశీ గూఢచార విభాగపు అధిపతి కూడా ఉన్నారు.
  • ఉత్తర కొరియా స్పందన: జులై 4న తమ తొలి ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష విజయవంతమైందని ఉత్తర కొరియా ప్రకటించింది.
  • 2017 ఆగస్టు 6: బొగ్గు, ఖనిజాలు, ముడి పదార్థాల ఎగుమతులపై యూఎన్ ఆంక్షలు విధించింది. దీని వల్ల ఉత్తర కొరియా ఎగుమతి రంగానికి బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.
  • ఉత్తర కొరియా స్పందన: సెప్టెంబర్ 3న తాము హైడ్రోజెన్ బాంబును పరీక్షించామని ఉత్తర కొరియా ప్రకటించింది. దానిని లాంగ్ రేంజ్ మిస్సైల్‌ ద్వారా ప్రయోగించగలుగుతామని చెప్పింది.

1950-53 కొరియా యుద్ధం ముగిసిన తర్వాత కూడా సాంకేతికంగా ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది.

అయితే ఇటీవల జరిగిన శీతాకాల ఒలింపిక్స్ క్రీడల సందర్భంగా ఆ దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెరిగింది.

ఇరువైపుల నుంచీ సానుకూల సందేశాలు వెలువడ్డాయి. ఆ పరిణామాల కారణంగానే తాజా ప్రకటన వచ్చింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఉ.కొరియాతో యుద్ధం వస్తే పరిణామాలు ఎలా ఉండొచ్చనే అంశంపై అమెరికా నిపుణులు ఇద్దరు బీబీసీతో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)