కాబూల్‌ ఆత్మాహుతి దాడిలో 57 మంది మృతి

  • 22 ఏప్రిల్ 2018
కాబుల్‌లో ఏప్రిల్ 22న జరిగిన పేలుడులో గాయపడిన వ్యక్తి Image copyright Reuters

అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఒక ఓటర్ నమోదు కేంద్రం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 57 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

కార్యాలయంలోకి వెళ్లేందుకు జనం గుమికూడిన సందర్భంగా జరిగిన ఈ దాడిలో మరో 119 మందికి పైగా గాయపడ్డారు.

మృతుల్లో 21 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులున్నారు.

అక్టోబర్ నెలలో ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఓటర్ల నమోదు కార్యక్రమం ఈ నెలలో మొదలైంది.

ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూప్ తన అమాఖ్ న్యూస్ ఏజెన్సీ ద్వారా ప్రకటించింది.

శరీరంపై పేలుడు పదార్థాల బెల్టును కట్టుకున్న ఆత్మాహుతి బాంబర్ ఈ దాడికి పాల్పడ్డట్టు అమాఖ్ రిపోర్టు తెలిపింది.

ఈ ఓటర్ నమోదు కేంద్రం పశ్చిమ కాబూల్‌లోని దష్తే బర్చీ ప్రాంతంలో ఉంది.

Image copyright EPA

ఎటు చూసినా రక్తపు మరకలే...

ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడిపోయిన పత్రాలపై, ఫొటోలపై రక్తం మరకలు కనిపిస్తున్నాయి.

ఎటు చూసినా వదిలేసిన బూట్లు, పగిలిపోయిన వాహనాల అద్దాలతో ఆ ప్రాంతమంతా బీభత్సంగా కనిపిస్తోంది.

మృతులలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారని ప్రత్యక్ష సాక్షి బషీర్ అహ్మద్ చెప్పారు.

ఓటర్ల నమోదు కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఈ కేంద్రాలపై ఇలాంటి దాడులు చాలానే జరిగాయి.

అఫ్ఘానిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఈ సంవత్సరం ప్రారంభంలో బీబీసీతో మాట్లాడుతూ, "తాలిబాన్, ఐఎస్ సంస్థలు రెండూ సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నాయి" అన్నారు.

ఆ విధంగా గందరగోళాన్ని సృష్టించి ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టాలన్నది వారి పథకం అని ఆయన చెప్పారు.

అఫ్ఘానిస్తాన్‌లో కేవలం 30 శాతం భూభాగంపైనే ప్రభుత్వం పూర్తి పట్టు కలిగి ఉందని బీబీసీ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.

మిగిలిన ప్రాంతంలో ఎక్కువ భాగంపై తాలిబాన్ పట్టు కలిగి ఉండగా, కొద్ది మేర ఇటీవలే వేళ్లూనుకుంటున్న ఐఎస్ పట్టులో ఉంది.

ఐఎస్ ఓ వైపు అఫ్ఘానిస్తాన్ సైనిక బలగాలతోనూ, మరోవైపు తాలిబాన్‌తోనూ పోరాడుతోంది. అలా తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవాలని అది ప్రయత్నిస్తోంది.

ఘటనను ఖండించిన అఫ్ఘాన్ అధ్యక్షుడు

ఈ హేయమైన టెర్రరిస్టు దాడిని ఖండిస్తున్నానని అఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ట్విటర్‌లో తెలిపారు.

మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.

బాధితులకు సహాయం అందించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చానని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)