గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌: తెలంగాణకు చెందిన శ్రీను సహా 16 మంది మావోయిస్టుల మృతి

  • 22 ఏప్రిల్ 2018
స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ Image copyright DIBYANGSHU SARKAR/AFP/Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసు బలగాలకూ, మావోయిస్టులకూ మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ఐజీ శరద్ షేలార్, ఎస్‌పీ అభినవ్ దేశ్‌ముఖ్ తెలిపారు.

యాంటీ నక్సల్ ఆపరేషన్స్ ప్రత్యేక ఐజీ శరద్ షేలార్ బీబీసీతో మాట్లాడుతూ, "మొత్తం 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. మా ప్రత్యేక పోలీసు దళానికి చెందిన సీ-60 కమాండోలు ఈ ఆపరేషన్ నిర్వహించారు" అని చెప్పారు.

భామ్రాగఢ్ తాలూకా, తాడిగాం అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంపై భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తుండగా, ఆదివారం ఉదయం మావోయిస్టులతో ఎన్‌కౌంటర్ జరిగినట్టు పోలీసులు కథనం.

అనేక గంటల పాటు జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు 16 మంది మావోయిస్టుల శవాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఎదురు కాల్పుల్లో కొందరు పోలీసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయని గడ్చిరోలి జిల్లా ఎస్‌పీ అభినవ్ దేశ్‌ముఖ్ బీబీసీకి తెలిపారు.

ఘటనాస్థలం నుంచి కొన్ని ఆయుధాలను, మావోయిస్టు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఆయన చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

మృతులలో ఒకరు తెలంగాణవాసి శ్రీను

ఎన్‌కౌంటర్ స్థలంలో కనిపించిన నెత్తుటి మరకలను బట్టి చూస్తే మరి కొంత మంది మావోయిస్టులు చనిపోయి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. అధికారులు సెర్చ్ ఆపరేషన్ మరింత తీవ్రతరం చేశారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కమాండర్లు సాయినాథ్, శ్రీనులు మృతి చెందినట్టు సమాచారం. వీరిని స్థానికుల ద్వారా గుర్తించామని, అయితే అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉందని ఎస్‌పీ అభినవ్ చెప్పారు.

శ్రీను తెలంగాణకు చెందినవాడనీ, ఆయనపై 85కి పైగా కేసులున్నాయని అభినవ్ చెప్పారు.

పోలీసులు దీనిని తాము సాధించిన పెద్ద విజయంగా భావిస్తున్నారు. గడ్చిరోలి జిల్లాలో అనేక ఏళ్లుగా పోలీసులకూ, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరుగుతున్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందడం ఇదే మొదటిసారి.

మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో కూడా ఆదివారం పోలీసులకూ, మావోయిస్టులకు ఎన్‌కౌంటర్ జరిగినట్టు సమాచారం. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)