అభిప్రాయం: సీపీఎం సభలు పూర్వ వైభవానికి దారులు వేస్తాయా?

  • ఎ.పి. విఠల్
  • మార్క్సిస్టు విశ్లేషకులు

ఒకానొక సభలో కమ్యూనిస్టు నేత ఈఎంఎస్ నంబూద్రిపాద్ తన సహజ, హాస్య, వ్యంగ్య ధోరణిలో కార్యవర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘‘నానాటికీ సామ్రాజ్యవాదంతో పెనవేసుకుంటున్న, మన భారత గుత్త పెట్టుబడిదారీ నేతృత్వాన కొనసాగుతున్న ఈ పెట్టుబడిదారీ భూస్వామ్య రాజ్యాన్ని కూల్చి, దాని స్థానంలో కార్మికవర్గ నాయకత్వాన, కార్మిక-కర్షక ఐక్యత పునాదిగా, ఇతర మధ్యతరగతి మేధావి వర్గాలను కలుపుకుని, జనతా ప్రజాస్వామ్య రాజ్యాన్ని స్థాపించడం’ అనే మాటలతో ఆరంభించకుండా మీరెవరైనా ఒక తీర్మానం రాయగలరా?’’ అని ప్రశ్నించారు.

నాటి శ్రోతలలో ఆంధ్రప్రదేశ్ నుండి కన్వీనింగ్ కమిటీ సభ్యునిగా ఉన్న నేను, నా పక్కనే ఉన్న కర్ణాటక కమిటీ సభ్యుడు (కామ్రేడ్ రామిరెడ్డి అనుకుంటాను) వైపు తిరిగి నవ్వుతూ, 'నువ్వు రాయగలవా?' అని ప్రశ్నించాను. దానికి అతను నవ్వుతూ తల అడ్డంగా ఊపాడు.

అదీ కమ్యూనిస్టు పడికట్టు పదాల ప్రభావం!

పొత్తుల సమస్య కొత్తదేం కాదు..

అఖిల భారత సీపీఎం 22వ మహాసభల గురించి రాద్దామని కూర్చున్నపుడు ఆ మాటలు గుర్తుకు వచ్చాయి. మహాసభలో ఏ అంశాల మీద ఎంత విపులంగా చర్చలు జరిగాయో తెలీదు కానీ, ప్రధానంగా బయటకు వచ్చింది మాత్రం 2019 ఎన్నికలలో బీజేపీని ఓడించడం అత్యంత ఆవశ్యకం అని తీర్మానించిన విషయం. అయితే కాంగ్రెస్ పార్టీని కూడా ఈ రాజకీయ పోరాటంలో కలుపుకోవచ్చా, కూడదా అన్నది ప్రధాన సమస్య. 'కలుపుకోవచ్చు' అనే వారికి ప్రస్తుత సీపీఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధాన ప్రతిపాదకుడు కాగా, 'కూడదు' అనే వారి తరఫున ఇంతకు మునుపు కార్యదర్శిగా ఉండిన ప్రకాశ్ కరాత్ ప్రధాన ప్రతినిధి అని మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

నిజానికి ఈ అంశంలో, చర్చలో కొత్తదనమేమీ లేదు. సుమారు 4 దశాబ్దాల క్రితం ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని విధించిన తదనంతరం జలంధర్‌లో నిర్వహించిన 10వ మహాసభలో ఆ చర్చ చాలా తీవ్రంగానే జరిగింది. ఆ మహాసభల్లో నేనూ ప్రతినిధినే. నాడు ఇందిరా కాంగ్రెస్‌ను ఓడించేందుకు, జనసంఘ్ ప్రధాన భాగస్వామిగా ఉండిన జనతా పార్టీతో ఒప్పందం చేసుకోవచ్చా, వద్దా? అన్న చర్చ జరిగింది.

సీపీఎం సంస్థాపక కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య 'వద్దు' అని వాదించగా, మిగతా పొలిట్‌బ్యూరో సభ్యులందరూ చేసుకోవచ్చంటూ వాదించారు. చివరకు ఇప్పటిలాగే, ఓటింగ్ లేకుండానే ఒక రాజీ ప్రతిపాదనను ఆమోదించారు.

తీర్మానం ఏదైనా నిజానికి చర్చ జరగాల్సింది - ఈ నలభై సంవత్సరాల ప్రయాణంలో సీపీఎం బలపడిందా, బలహీనపడిందా? 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ మహాసభ తీర్మానం నేటికీ ఆమోదనీయమా, కాదా? అన్నదానిపై.

బలపడ్డట్టా? బలహీనపడ్డట్టా?

గోర్బచేవ్ 'గ్లాస్‌నోస్త్', 'పెరిస్త్రోయికా'లను - భౌతిక, వాస్తవిక పరిస్థితిని సరిగ్గా అంచనా వేయడం, తదనుగుణంగా చేసుకోవాల్సిన మార్పులు అని అభివర్ణించారు.

గోర్బచేవ్ అంటేనే సోవియట్ విచ్ఛిన్నకుడు అనో, స్టాలిన్ అంటేనే నియంత అనో ప్రచారం చేసే వాళ్ల సంగతి వేరు. కానీ నేటి భౌతిక, వాస్తవిక పరిస్థితిని గ్రహించగలగడం తొలి ప్రాధాన్యత.

మన తొలి పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నేత, ఐక్య కమ్యూనిస్టు పార్టీ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య. కానీ ప్రస్తుతం లోక్‌సభలో కేవలం 10 మంది కమ్యూనిస్టు సభ్యులున్నారు. నిజానికి 1955లో ఆంధ్ర రాష్ట్రంలో సుందరయ్య ముఖ్యమంత్రిగా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడుతుందన్న వాతావరణం నెలకొంది.

కానీ నేడు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీల పరిస్థితిని ప్రశ్నిస్తే, ''బలహీనపడ్డామని ఎవరన్నారు? నేటికీ ప్రజలతో కలిసి పోరాడుతున్నాం. ఎన్నికలు, ఓట్లు, సీట్లు - ఇవే లెక్కా? ఏమైనా ఇది తాత్కాలికమే'' అనే సమాధానం వారి నుంచి వస్తుంది.

నిజంగా కమ్యూనిస్టులు ఎప్పుడైనా సునిశిత ఆత్మవిమర్శ చేసుకుని, సృజనాత్మక పద్ధతుల్లో మార్క్సిజాన్ని మన దేశానికి అన్వయించే ప్రయత్నం చేశారా? ఎన్నికలే సర్వస్వం కాకున్నా, ఎన్నికలు ప్రజాస్వామ్యానికి గీటురాళ్లు కాదా? కమ్యూనిస్టుల పోరాటాల వల్ల ప్రజలలో పెరుగుతున్న చైతన్యం పరిమాణాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఉంటోందా?

హిందుత్వ భావజాలంపై గురి పెట్టారా?

ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఈలోపు ఏ విధమైన ప్రజా ఉద్యమాలు చేయాలి? మన ప్రజా జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్న పాలకుల ఆర్థిక విధానాలను ఎలా ఎదుర్కోవాలి? వైవిధ్యభరితమైన, సుసంపన్నమైన సంస్కృతీ సాంప్రదాయాలు కలిగిన భారతదేశాన్ని అఖండ హిందూ భారతదేశంగా మార్చే దుర్మార్గాన్ని ఎలా అడ్డుకోవాలి? ప్రజా, సాంస్కృతిక ఉద్యమాలను ఎలా నిర్మించాలి? ఇలాంటి అంశాలకు కమ్యూనిస్టులు తగిన ప్రాధాన్యతను ఇచ్చి చర్చించాలి.

మహాసభల్లో ఇంకా చర్చించి తీరాల్సిన అనేక అంశాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు.

ఉదాహరణకు, 'సామాజిక న్యాయం' అంశం. ఈ విషయమై అసలే చర్చించలేదని కాదు. కానీ తెలంగాణ సీపీఎం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిర్వహించిన పాదయాత్ర కమ్యూనిస్టులు ఆ అంశంపై నిర్వహించిన తొలి పాదయాత్ర అని చెప్పక తప్పదు. వామపక్షాలలో ఒక గుణాత్మక మార్పుకు నాంది పలికిన ఆ పాదయాత్ర ముగింపు సందర్భంగా, పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం 'లాల్-నీల్' (వామపక్ష, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, గిరిజన, మైనారిటీ, మహిళా, ఇత్యాదుల అస్తిత్వ, ఆత్మగౌరవ, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక పోరాటం) అని పిలుపునిచ్చారు. నూటికి 80 మందికి పైగా ఉన్న సామాన్య ప్రజల, సంస్థల ఐక్యతకు ఆ నినాదం ఓ చిహ్నం.

ఆర్థిక పునాది మారితే, సామాజిక సమస్యలు వాటంతటవే పురిష్కారం అవుతాయని మన దేశ కమ్యూనిస్టులు భావించి వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆ క్రమంలో శతాబ్దాల తరబడి కొనసాగుతున్న వర్ణవ్యవస్థ లాంటి సమస్యలపై చేపట్టాల్సిన ఉద్యమాలు వెనుకబాట పట్టాయి. వర్ణవ్యవస్థపై పోరాటం చేస్తే అది వర్గపోరాటాన్ని బలహీనపరుస్తుందనే భయంతో ఆ ఉద్యమాలకే కమ్యూనిస్టులు ప్రాధాన్యం ఇవ్వడం తగ్గించేశారు. ఫలితంగా సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా పోరాడాల్సిన ప్రజానీకం క్రమేపీ కమ్యూనిస్టు పార్టీలకు దూరమయ్యారు.

నిజానికి నేడు దేశంలో 30కి పైగా కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. ఇవి ఇలా చీలిపోవడానికి వర్గ పోరాటం ఏ రీతిలో చేయాలన్నదే ప్రధాన కారణం కాదా?

ఇటీవలి కాలంలో ఈ పరిస్థితిలో కొంత మార్పు వస్తోంది. అయిత అది సరిపోదు. తెలంగాణ సీపీఎం 100కి పైగా సంఘాలతో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజా సంఘాల వేదిక తరహాలో బహుజన, వామపక్ష సంఘటనలు దేశవ్యాపితంగా ఏర్పాటు కావడం అత్యావశ్యకం.

కుల ఆధిపత్యం చర్చకు వచ్చిందా?

అగ్రవర్ణ, ఆధిపత్య కులాల పెత్తనం కొనసాగుతున్న ఈ దశలో దానిపై ఈ మహాసభల్లో తగిన రీతిలో చర్చ జరిగినట్లు కనిపించడం లేదు.

అలాగే భారతదేశం 'వివిధ జాతుల సముదాయం' అన్న ప్రాథమిక, భౌతిక వాస్తవికతను స్వాతంత్ర్యానికి పూర్వమే (1942-43 ఉమ్మడి సీపీఐ తీర్మానం) అంగీకరించినా ఆ అంశానికి క్రమేపీ కమ్యూనిస్టు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోతూ వస్తోంది.

నేడు 'భారతదేశం వివిధ జాతుల సముదాయం' అనడాన్నే దేశద్రోహంగా చిత్రిస్తున్నారు. ఈ స్థితిలో ఆ విషయానికి తగిన ప్రాధాన్యతనివ్వాలి. వివిధ జాతుల ప్రత్యేకతలను ప్రతిబింబించే పార్టీగా నిలవాల్సిన కమ్యూనిస్టు పార్టీలు ఈనాడు తమ బలహీనత కారణంగా వాస్తవికతను తగిన రీతిలో ప్రతిబింబించలేకపోతున్నాయి.

రవీంద్రనాథ్ ఠాగూర్ 'పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ' అని రాసిన విషయాన్ని మనం మర్చిపోకూడదు.

ఐక్యతా రాగంలో అపశృతి ఎక్కడ?

ఇక కమ్యూనిస్టుల ఐక్యత గురించి - ఈ అంశంపై కేవలం సీపీఐ అగ్రనేత సురవరం సుధాకరరెడ్డి మాత్రం అప్పుడప్పుడూ ప్రస్తావిస్తున్నారు. సుమారు దశాబ్దం క్రితం నాటి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు సీపీఐ రాష్ట్ర మహాసభలో ''వచ్చే రాష్ట్ర మహాసభలను విడివిడిగా జరపం. విలీనమై ఒకే కమ్యూనిస్టు పార్టీగా జరుపుతాం'' అని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఆ తర్వాత ఆ ప్రయత్నాలు ఏమయ్యాయో తెలీదు.

ఈ 22వ మహాసభలకు ముందు ''మహాసభల్లో విలీనం చర్చనీయాంశం కాదు'' అని చెప్పారు.

''ప్రపంచ కార్మికులారా ఏకం కండి'' అన్న మార్క్స్.. కార్మికవర్గ విజయ రహస్యం దాని ఐక్యతలోనే ఉందని అన్నారు.

సీపీఎం, సీపీఐ విషయంలో సైద్ధాంతికంగా, ఆచరణీయ అంశాలలో ఏమేం విభేదాలున్నాయో, ఆయా పార్టీల నేతలకే తెలుసు.

కానీ సాధారణ ప్రజానీకం మాత్రం 'కమ్యూనిస్టులు చీలిపోయి చెడిపోయారు కానీ లేకుంటే వారిదే రాజ్యం' అంటుంటారు. అందులో వాస్తవం లేకపోలేదు. అయినా ఈ సభల్లో ఆ దిశగా ప్రయత్నం జరిగినట్లు కనిపించడం లేదు.

చివరగా, ఇన్ని ముక్కలైనా ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీలు తమ శక్తికి మించి ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తున్నాయి.

అలాగే ఈ పార్టీలలో విభేదాలను, మావోయిస్టులు చేసే పోరాటాన్ని పాలకవర్గాలు ఎంత విమర్శించినా, వారి నిస్వార్థాన్ని మాత్రం ఎవరూ వేలెత్తి చూపలేరు.

దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఇంకా ఉందంటే, ఎర్రజెండా పట్టుకున్న లక్షలాది మంది కార్యకర్తలే కారణం. అదే అంకిత భావంతో తమ పొరబాట్లను సరిదిద్దుకుంటూ, కమ్యూనిస్టులు పునర్వైభవాన్ని పొందుతారని ఆశిస్తున్నా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)