'ఆడదానివి... ఆటో నడుపుతావా?' అని హేళన చేశారు!

  • 23 ఏప్రిల్ 2018
మహిళా ఆటోడ్రైవర్ Image copyright Shyam mohan

ఆటోలు నడపడమంటే 'మగవారు చేసే పని' అనుకునే రోజుల్లో.. ఆటో డ్రైవర్‌గా మారి తన కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కించిన ఓ మహిళ కథ ఇది.

ఉదయం 9 గంటలు, అది హైదరాబాద్‌లోని నిజాంపేట, బాచుపల్లి రహదారి. అటూ ఇటూ వాహనాలు దూసుకుపోతున్నాయి.

నెలలు నిండిన ఒక మహిళ రోడ్డు దాటడానికి చాలా అవస్థలు పడుతోంది. అంతలోనే అక్కడికి వచ్చిన ఒక మహిళ ఆమె చేతిని అందుకొని జాగ్రత్తగా రోడ్డు దాటించి, తన ఆటోలో కూర్చోబెట్టుకొని ఆసుపత్రి ముందు ఆపింది.

ఆ మానవి పేరు వెన్నపూస నారాయణమ్మ. వృత్తి ఆటో డ్రైవింగ్.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఈ లేడీ ఆటో డ్రైవర్.. పోకిరీలు కనిపిస్తే భరతం పడతారు!

బాచుపల్లి సమీపంలోని రాజీవ్‌గాంధీ నగర్‌ ఇరుకు గల్లీలో ఒక చిన్న రేకుల షెడ్డులో ఉంటున్న నారాయణమ్మను బీబీసీ పలకరించింది. తన ఆటుపోట్ల జీవితాన్ని 'ఆటో' ఎలా మలుపు తిప్పిందో ఆమె ఇలా వివరించారు.

''మాది కడప జిల్లా బుజ్జాయిపల్లి గ్రామం. ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను చదువుకోలేదు. మా కుటుంబ పరిస్థితుల వల్ల నాకు టీనేజ్‌లోనే పెళ్లి చేశారు. 35 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ నగరానికి వలస వచ్చాం. నా భర్త ఓ ప్రైవేట్‌ కంపెనీలో కార్మికుడు. ఆయనకు వచ్చే జీతం చాలా తక్కువ. నాకు ఎక్కడా పని దొరకలేదు. ఇద్దరు పిల్లలను చదివించడం, కుటుంబాన్ని పోషించడం చానా కష్టం అయ్యేది. ఇలా బతకడం కష్టమని మళ్లీ వెనక్కు పోదామని అనుకుంటున్న సమయంలో ఆటో నడపడంపై ఆసక్తి కలిగింది. ప్రయాణికులతో ఎలా మెలగాలో, వారి నుంచి సమస్యలు వచ్చినపుడు ఎలా ఎదుర్కోవాలో ఓ అవగాహన వచ్చింది. వెంటనే ఆటో నడపడం మొదలుపెట్టాను. పన్నెండేళ్ల నుంచి నడుపుతున్నాను.''

హైదరాబాద్‌లో మగవాళ్లు తప్ప ఆడవారు ఆటోలు నడపకపోవడం గమనించి, స్వయంగా తనకు తానే ఆటో డ్రైవింగ్‌ నేర్చుకున్నారు నారాయణమ్మ. ఆ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు.

రాత్రి 11 గంటల దాకా..

''నేను ఆటో నడుపుతుంటే రోడ్డు మీద అందరూ వింతగా చూస్తారు. కానీ, ప్రయాణికుల వల్ల నాకు ఎన్నడూ ఇబ్బంది కలగలేదు. మగ ఆటో డ్రైవర్‌లు కూడా నాతో చాలా గౌరవంగా ఉంటారు. ఈ పనిలో మహిళగా నేను ఎలాంటి వివక్ష ఎదుర్కోలేదు. మన పరిధిలో మనం ఉంటే అందరూ మనతో మంచిగా ఉంటారు. ఉదయం 5 గంటలకే లేచి నా భర్త సాయంతో వంట పనులు పూర్తి చేసుకుని ఆటో స్టార్ట్ చేస్తా. రాత్రి 11 గంటల వరకు నడుపుతా. చిన్న పిల్లలను, నెలలు నిండిన వారిని, వృద్ధులను ఉచితంగానే ఆసుపత్రుల దగ్గరకు తీసుకెళ్తాను. ఎక్కడైనా పోకిరీలు అమ్మాయిలను ఇబ్బంది పెడితే వారికి బుద్ధి చెప్పి పోలీసులకు అప్పచెబుతా'' అని నారాయణమ్మ వివరించారు.

Image copyright Shyam mohan

పిల్లల ఉన్నత చదువులు

ఆటో నడపటం వృత్తిగా ఎంచుకున్నాక నారాయణమ్మ కుటుంబం కష్టాల నుంచి గట్టెక్కింది.

రోజుకు రూ.700 నుండి రూ.1,200 వరకు ఆదాయం వస్తోందని ఆమె చెప్పారు. ఇద్దరు బిడ్డలను చదివిస్తున్నారు. మానిష్‌ ఇంజినీరింగ్, మౌనిక ఎం ఫార్మసీ చదువుతున్నారు. బాచుపల్లిలో సొంతంగా ఇల్లు కూడా కట్టుకున్నారు.

ఉచితంగా డ్రైవింగ్‌ నేర్పిస్తా

''భయం అనే దాన్ని పక్కన పెట్టి కొంచెం ఆత్మవిశ్వాసం పెంచుకుంటే మహిళలకు ఆటోడ్రైవింగ్‌ ఎంతో సురక్షితం. లాభదాయకం. ఈ రంగంలోకి రావాలనుకునేవారికి నేను ఉచితంగానే డ్రైవింగ్‌ నేర్పుతాను. వాదా ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటికే నలుగురు అమ్మాయిలకు నేర్పించాను. మరింత మందికి నేర్పించడానికి స్వయంగా శిక్షణా కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నా'' అని నారాయణమ్మ చెబుతున్నారు.

ఆపదలో ఉన్నవారికి ఆమె తన వంతు సాయం అందిస్తున్నారు.

తన ఆటోలో వికాలాంగులు, వృద్ధులు, పరీక్షలకు వెళ్లే విద్యార్ధులకు ఒక్క రూపాయి కూడా తీసుకోరు. అంతే కాదు, ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే ఉచితంగా, వెంటనే ఆసుపత్రికి చేరుస్తూ ఆమె మానవీయతను చాటుతున్నారని స్థానికులంటున్నారు.

Image copyright Shyam mohan

'తనకు భయం తెలియదు'

''ఆమెలో మానసిక స్థైర్యం ఎక్కువ. మా పెళ్లయిన కొత్తలో ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదురైనా ఆమె ధైర్యంగా నిలబడింది. 'ఆడదానివి' ఆటో నడుపుతావా? అని ఎందరో హేళన చేశారు. అయినా లెక్క చేయకుండా తను అనుకున్న పనిలో ముందుకు సాగింది. అందుకే తను ఆటో నడుపుతానంటే నేను కాదనలేదు. ఇపుడు హైదరాబాద్‌లో ఏ మూలకైనా వెళ్లగలదు. తన తోటి మహిళలకు అండగా ఉంటుంది. ప్రయాణికులు ఎంత ఇస్తే అంతే తీసుకుంటుంది తప్ప ఎక్కువ వసూలు చేయదు. నిజాయితీగా బతకడంలో ఉండే ఆనందం మాకు తెలిసింది. నేను విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ వైండింగ్‌ పనులు చేస్తాను. మా ఇద్దరి శ్రమతో కుటుంబం సాఫీగా సాగిపోతోంది'' అంటారు నారాయణమ్మ భర్త బాల చెన్నారెడ్డి.

Image copyright Shyam mohan
చిత్రం శీర్షిక భర్త బాల చెన్నారెడ్డితో నారాయణమ్మ

సురక్షితంగా ఆసుపత్రికి...

''నాకు నెలలు నిండాయి. తరచూ అసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. నారాయణమ్మ ఆటోలోనే వెళ్తాను. నాలాంటి గర్భిణీలను ఆమె ఉచితంగానే ఆటోలో తీసుకెళ్తారు'' అని చెప్పారు నిజాంపేటకు చెందిన మమత.

ఆమె ఎంతో స్ఫూర్తి

''ఇంట్లోంచి అడుగు బయట పెట్టేందుకే కొందరు మహిళలు భయపడుతుంటారు. కానీ నారాయణమ్మ ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఆటో నడపడం గొప్ప విషయం. పురుషుల కంటే ధైర్యంగా హైదరాబాద్‌ రోడ్ల మీద సురక్షితంగా ఆమె ఆటో నడుపుతారు. మహిళలు డ్రైవింగ్‌ ఫీల్డ్‌లోకి రావడానికి ఆమె జీవితమే స్ఫూర్తి'' అంటున్నారు ఆమె తోటి ఆటో డ్రైవర్‌ ఓబులేసు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)