#CrossingDivides: ప్రజల మధ్య పెరుగుతున్న విభజనలు.. పదేళ్లలో ఎక్కువయ్యాయి

  • 24 ఏప్రిల్ 2018
మనుషుల మధ్య విభజనలను సూచించే గ్రాఫిక్ ఇమేజ్ Image copyright Getty Images

యూరోపియన్లు చాలా మంది తమ దేశాల్లో ప్రజల మధ్య విభజన రేఖలు పదేళ్ల కిందటి కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారని బీబీసీ తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.

ఆన్‌లైన్‌లో 27 దేశాల్లో నిర్వహించిన ఈ ఇప్సాస్ మోరి పోల్‌‌లో పాల్గొన్న వారిలో.. 66 శాతం మంది యూరోపియన్లు తమ దేశాల్లో విభజన మరింతగా పెరిగిందని నమ్ముతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పోల్చి చూస్తే.. ఇలా భావిస్తున్న వారు యూరోపియన్లే అధికంగా ఉన్నారు. అలాగే తమ సమాజాల్లో సహనం తగ్గిందని భావిస్తున్నవారి సంఖ్య 47 శాతంగా ఉంది.

ఈ సర్వేలో స్పందించిన 19,428 మందిలో 44 శాతం మంది.. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు ప్రధాన కారణం రాజకీయాలేనని అభిప్రాయపడ్డారు.

బ్రిటన్ పౌరుల్లో సగం మంది.. దేశ పౌరులకు, వలసవచ్చిన వారికి మధ్య విభజన ఉందని పేర్కొన్నారు.

బ్రిటన్‌లో సామాజిక విభజనకు ఇదే ప్రధాన కారణమని జనం ఎక్కువగా పరిగణిస్తున్నారు. ఆ తర్వాతి వరుసలో.. మత విభేదాలు (47 శాతం మంది), జాతీయత (41 శాతం మంది), రాజకీయ అభిప్రాయాలు (40 శాతం మంది) ఉన్నాయి.


ఈ సర్వే ప్రపంచ వ్యాప్త ఫలితాలను చూస్తే.. సర్వేలో పాల్గొన్న వారిలో నాలుగింట మూడు వంతుల మంది తమ సమాజంలో విభజనలు ఉన్నాయని అంగీకరిస్తున్నారు. వారిలో మూడింట ఒక వంతు మంది ఆ 'విభజనలు తీవ్రంగా ఉన్నాయం'టున్నారు.

ఈ విభజనలు ఇంకా పెరుగుతున్నాయని కూడా చాలా మంది భావిస్తున్నారు. తమ దేశంలో ప్రజల మధ్య విభేదాలు పదేళ్ల కిందటి కన్నా ఇప్పుడు తీవ్రంగా ఉన్నాయని మెజారిటీ జనం అభిప్రాయపడుతున్నారు. నాటికన్నా నేడు తక్కువగా ఉన్నాయని భావించే వారు కేవలం 16 శాతం మంది మాత్రమే ఉన్నారు.


ఐరోపా ముఖచిత్రం

ఈ సర్వేలో 11 యూరప్ దేశాలు - బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, హంగరీ, ఇటలీ, పోలండ్, రష్యా, స్పెయిన్, స్వీడన్, సెర్బియా, బ్రిటన్ - నుంచి సమాచారం సేకరించారు.

విభజన దృక్కోణం సెర్బియాలో చాలా బలంగా ఉంది. సర్వేలో పాల్గొన్న ఆ దేశస్తుల్లో 93 శాతం మంది తమ సమాజంలో చాలా ఎక్కువగా లేదా నిజంగా విభజనలు ఉన్నాయని చెప్తున్నారు.

''యూరప్ మొత్తం ఇదే వైఖరి కనిపిస్తోంది. సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురిలో ముగ్గురు తమ సమాజంలో ఎక్కువగానో, ఓ మోస్తరుగానో విభజనలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు'' అని ఈ సర్వేను పర్యవేక్షించిన ఇప్సాస్ మోరి ప్రతినిధి గ్లెన్ గాట్‌ఫ్రీడ్ పేర్కొన్నారు.


ఈ విభజనలు ఇంకా ఎక్కువగా పెరిగాయని యూరప్ వాసులు భావిస్తున్నట్లు కనిపిస్తోందని గాట్‌ఫ్రీడ్ చెప్పారు.

''ఇది.. రాజకీయ వాతావరణంతో పాటు యూరప్ ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో మితవాదం వైపు మొగ్గు పెరగటానికి ప్రతిఫలనం కావచ్చు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

బ్రిటన్‌లో లాగానే జర్మనీ, ఫ్రాన్స్‌ ప్రజలు (సర్వేలో పాల్గొన్న వారు) కూడా.. స్వదేశీయులు - వలసల మధ్య విభజన ఎక్కువగా ఉందని గుర్తిస్తున్నారు.

అయినా.. సామాజిక విభజనలకు సంబంధించి మరింత సంప్రదాయ భావనలు కూడా కొనసాగుతున్నాయని గాట్‌ఫ్రీడ్ పేర్కొన్నారు.

''వర్గం, ఆదాయం ఆధారంగా ఉద్రిక్తతలు ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు.. బ్రిటన్‌లో మూడో వంతు మంది.. ధనికులు - పేదల మధ్య ఉద్రిక్తత ఉందని భావిస్తున్నారు. అలాగే హంగరీలో వలసదారులతో పోలిస్తే.. ధినికులు - పేదల మధ్య ఉద్రిక్తత ఉందని చెప్పే వారు ఎక్కువగా ఉన్నారు'' అని ఆయన తెలిపారు.


సెర్బియా: ఉన్నవాళ్లు - లేనివాళ్లు

డేజన్ అనస్తాసియెవిక్, బీబీసీ సెర్బియన్ సర్వీస్

సెర్బియా జనాభాలో 80 శాతం మంది క్రిస్టియన్ ఆర్థొడాక్స్ సెర్బియన్లు. కాబట్టి ఇక్కడ జాతిపరమైన లేదా మత పరమైన విభజనలు తీవ్రంగా ఉండే అవకాశం లేదు.

కానీ.. గత ఏడాది గినీ అసమానతల గణాంకాల ప్రకారం.. ఆదాయ అసమానతలు యూరప్ దేశాల్లో సెర్బియాలోనే రికార్డు స్థాయిలో ఉన్నాయి.

జనాభాలో పావు శాతం మంది ఇంకా దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నారు. ఐదు శాతంగా ఉన్న నిరుపేదలకన్నా.. 20 శాతంగా ఉన్న అత్యంత ధనికులు 10 రెట్లు ఎక్కువగా ఆర్జిస్తున్నారు. పేదలు, ధనికులు మధ్య అంతరం గత ఐదేళ్లలో ఇంకా పెరిగింది.

రాజకీయంగా.. 2008లో సెర్బియా నుంచి విడిపోయిన కొసావో విషయంలో తీవ్ర విభజనలు ఉన్నాయి. సెర్బియాను ఈయూలో చేర్చుకోవటానికి.. కొసావో స్వాతంత్ర్యాన్ని అంగీకరించటం (ఆ దేశాన్ని లాంఛనంగా గుర్తించకుండానే) అనేది ఒక ముందస్తు షరతుగా విధించారు.

కానీ.. సెర్బియన్లలో అత్యధికులు ఈయూ సభ్యత్వం కోరుకుంటున్నప్పటికీ.. కొసావో కూడా తమ దేశంలో మళ్లీ కలవాలని కోరుకుంటున్నారు. కాబట్టి దీనిపై చర్చ ఎప్పుడూ వేడివేడిగానే ఉంటుంది.


లాటిన్ అమెరికాలో శత్రుత్వాలు

లాటిన్ అమెరికాలో సర్వే చేసిన - అర్జెంటీనా, బ్రెజిల్, మెక్సికో, చిలీ, పెరూ - దేశాల్లో కనీసం మూడు వంతుల మంది.. భారీ విభజనలు ఉన్నాయని భావిస్తున్నారు. అందులో ఎక్కువగా రాజకీయ విభజనలు, ధనికులు - పేదల మధ్య విభజనలు ఉన్నాయని చెప్తున్నారు.

ఉద్రిక్తతల భావన అర్జెంటీనాలో అత్యధికంగా ఉంది. సర్వేలో పాల్గొన్న వారిలో 92 శాతం మంది తమ దేశంలో విభజనలు ''ఎక్కువగా'' లేదా ''నిజంగా'' ఉన్నాయని చెప్తున్నారు. ఇది గత పదేళ్లలో ఇంకా ముదిరిపోయిందని దాదాపు 40 శాతం మంది అభిప్రాయం.

ఈ విభజనలకు ప్రాతిపదిక రాజకీయ అభిప్రాయాలని 70 శాతం మంది అర్జెంటీనా వాసులు చెప్తున్నారు.

''ఇది చాలా చాలా అధికం. ఈ సర్వేలో మలేసియాను మినహాయిస్తే.. రాజకీయ విభేదాలు చాలా తీవ్రంగా ఉన్నాయని భావించే దేశాల్లో అర్జెంటీనా అగ్రస్థానంలో ఉంటుంది'' అంటారు గాట్‌ఫ్రీడ్.

యూరప్‌ కన్నా అధికంగా లాటిన్ అమెరికాలోనే రాజకీయ విభేదాలు ఎక్కువగా ఉన్నాయని ఈ సర్వే చెప్తోంది. ఇక్కడ సగంకన్నా ఎక్కువ మంది విభజనకు అదే ప్రధాన కారణమని చెప్తున్నారు.

అయితే.. గత దశాబ్ద కాలంలో విభజనలు పెరిగాయని 68 శాతం మంది యూరోపియన్లు భావిస్తుంటే.. లాటిన్ అమెరికాలో అలా అనుకుంటున్న వారి సంఖ్య తక్కువగా 59 శాతంగా ఉంది.


సమాజంలో ఉద్రిక్తత

విభజనలపై దృక్కోణాలు.. అంతర్జాతీయం

  • 44% మంది.. భిన్న రాజకీయ అభిప్రాయాలు ఉన్న వారి మధ్య చాలా ఎక్కువగా ఉందని భావిస్తున్నారు

  • 36% ధనికులు, పేదల మధ్య

  • 30% తమ దేశంలో పుట్టిన వారు, వలస వచ్చిన వారి మధ్య

  • 27% వేర్వేరు మత బృందాల మధ్య

  • 25% వేర్వేరు జాతీయుల మధ్య

  • 11% మంది.. వృద్ధులు, యువకుల మధ్య / పురుషులు, మహిళల మధ్య ఉందని భావిస్తున్నారు

Getty

అర్జెంటీనాలో రాజకీయ రణం

అర్జెంటీనాలో 2003-15 మధ్య వామపక్ష కిర్ష్నర్ ప్రభుత్వాల కింద పెరుగుతూ వచ్చిన తీవ్ర విభజనలకు ముగింపు పలుకుతాననే నినాదంతో మౌరీసియో మాక్రి 2015 ఎన్నికల్లో పోటీచేసి అధ్యక్షుడిగా గెలిచారు.

అయినా.. అర్జెంటీనా పౌరుల నిత్యజీవిత భాగంగా మారిపోయి.. మీడియాలో పదే పదే ప్రస్తావనకు వచ్చే ఈ 'విభజన'.. మాక్రి మితవా హయాంలో తగ్గకపోగా ఇంకా తీవ్రమైంది. దేశ ప్రజల్లో 40 శాతం మంది పదేళ్ల కిందటి కన్నా ఇప్పుడు ఈ విభజన ఇంకా ఎక్కువగా ఉందని తాజా సర్వేలో పేర్కొనటమే ఇందుకు నిదర్శనం.

''ఈ 'విభజన' ఇటీవలి పరిణామమని జనం ఎలా భావిస్తారనేది ఆసక్తికరమైన అంశమ''ని యూనివర్సిటీ ఆఫ్ బ్యూనోస్ ఎయిర్స్ సోషియాలజిస్ట్ మార్టిన్ జెండ్లర్ చెప్తారు.

''నిజానికి చాలా దేశాల్లో కన్నా తీవ్రంగా అనాదిగా ఉన్న అనేక ద్వంద్వీభావనలు, వైరాల మీద ఈ దేశం నిర్మితమైంది. ఇన్నాళ్లుగా వారు ఆ వైరాలను పునర్విచించుకోవటం, పున:ప్రతిష్టించుకోవటం చేస్తున్నారు. కానీ ఆ వైరాలన్నీ ప్రధానంగా ప్రజాకర్షణ - దానికి వ్యతిరేకతల చుట్టూనే తిరుగుతున్నాయి'' అని ఆయన పేర్కొన్నారు.


విస్తృతంగా చూస్తే ప్రపంచంలో సహనం ఎక్కువే?

ఈ సర్వే కొన్ని సానుకూల వైఖరులను కూడా గుర్తించిందని గాట్‌ఫ్రీడ్ చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రజల మధ్య విభేదాల కన్నా సారూప్యాలే ఎక్కువగా ఉన్నాయని.. సర్వేలో పాల్గొన్న వారిలో మూడింట రెండు వంతుల మంది అంగీకరించారు.

''విభిన్న నేపథ్యాలు, సంస్కృతులు, అభిప్రాయాలు గల వారితో కలయిక ఘర్షణకు దారితీస్తుందని కొద్ది మంది జనం భావిస్తున్నారు'' అని గాట్‌ఫ్రీడ్ తెలిపారు.

అటువంటి కలయికలు కొన్నిసార్లు అపార్థాలకు దారితీస్తాయని, కానీ వీటిని సాధారణంగా అధిగమించవచ్చునని మూడో వంతు మంది అభిప్రాపయడ్డారు. అయితే.. అటువంటి కలయికలు వాస్తవంగా పరస్పర అవగాహన మెరుగుపడటానికి, గౌరవం పెరగటానికి దోహదపడతాయని 40 శాతం మంది విశ్వసిస్తున్నారు.

కెనడా ప్రజల్లో సుమారు 74 శాతం మంది.. విభిన్న అభిప్రాయాలు గల వారి విషయంలో తమ సమాజం ఎక్కువగా లేదంటే వాస్తవంగా సహనంగా ఉంటుందని పేర్కొన్నారు. అలా భావించే వారి సంఖ్య చైనాలో 65 శాతంగాను, మలేసియాలో 64 శాతంగానూ ఉన్నట్లు సర్వే చెప్తోంది.

Image copyright MIREKP

'సామరస్య' చైనా?

యువెన్ వు, బీబీసీ చైనీస్ సర్వీస్

ఇతర దేశాల్లో రాజకీయ, మత, లింగ విభేదాల విషయంలో భీకర చర్చలు జరుగుతుంటే.. చైనాలో అసమ్మతి పట్ల సహనం కనిపించదు.

మీడియా మీద రాజ్య నియంత్రణ భారీగా ఉండటం.. అర్థవంతమైన, బహిరంగ రాజకీయ చర్చను నిరోధిస్తోంది. దీని ఫలితంగా.. సామాజిక విభజనలు అధికంగా మరుగునపడిపోతుంటాయి. ఇప్సాస్ సర్వేలో పాల్గొన్న చైనా ప్రజల్లో కేవలం 7 శాతం మంది మాత్రమే తమ సమాజంలో ''విభజనలు ఎక్కువగా ఉన్నాయ''ని పేర్కొన్నారు.

మాజీ అధ్యక్షుడు హు జింటావో ''సామరస్య సమాజా''న్ని.. చట్టాన్ని పాటిస్తూ, ప్రజలు పరస్పరం విశ్వసించుకునే సమన్యాయ సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ నినాదం అన్నిచోట్లా కనిపించింది. వినిపించింది. కానీ సోషల్ మీడియాలో తమ పోస్టులు ప్రమాదకరంగా ఉన్నాయని భావిస్తూ సెన్సార్ అధికారులు తొలగించటాన్ని జనం చూసినపుడు.. ''నా పోస్టుని సామరస్యం చేశారు'' అని వ్యాఖ్యానిస్తారు.

అయినా.. చైనాలో ఆదాయ అసమానతలు అధిక స్థాయిలో ఉన్నాయని ఆ దేశ జిని సూచికను నాయకత్వం గుర్తిస్తుంది. దేశాన్ని పునరుత్తేజితం చేయటానికి అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ''చైనీస్ డ్రీమ్'' నిస్సందేహంగా ఎంతోమంది చైనా ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. కానీ అది నిజంగా అందరికీ ఫలితాలనివ్వలేదు.


డాటా జర్నలిజం: విలియం దహల్‌గ్రీన్, బీబీసీ విజువల్ జర్నలిజం


మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)