ప్రపంచంలో మొదటిసారిగా పురుషాంగం, బీజకోశ మార్పిడి.. విజయవంతమైన ఆపరేషన్

  • 24 ఏప్రిల్ 2018
పురుషాంగం, బీజకోశ మార్పిడి Image copyright iStock

అమెరికా డాక్టర్లు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పురుషాంగం, బీజకోశాలను విజయవంతంగా మార్పిడి చేశారు. మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ వైద్యులు అఫ్ఘానిస్తాన్‌లో బాంబుదాడిలో గాయపడిన ఒక సైనికుడికి ఈ ఆపరేషన్ నిర్వహించారు.

భూమిలో పాతిపెట్టిన బాంబుపై కాలు వేయడంతో అతనికి ఈ ప్రమాదం జరిగింది.

జబ్బుపడిన ఒక వ్యక్తి నుంచి పురుషాంగాన్ని, బీజకోశాన్ని సేకరించి, సైనికుడికి అమర్చారు.

ఆపరేషన్ విజయవంతంగా ముగియడంతో ఆ సైనికుడు తన లైంగిక కార్యకలాపాలు ఎప్పటిలాగే నిర్వహించుకోవచ్చని వైద్యులు తెలిపారు.

మార్చి 26న నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 11 మంది సర్జన్లు పాల్గొన్నారు. ఆపరేషన్‌కు 14 గంటల సమయం పట్టింది.

అయితే నైతిక కారణాల రీత్యా ఈ ఆపరేషన్‌లో కేవలం బీజకోశాన్ని మాత్రమే మార్చామని, వృషణాలను కాదని వైద్యులు వెల్లడించారు.

Image copyright JOHNS HOPKINS MEDICINE
చిత్రం శీర్షిక జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో సర్జన్ల బృందం

యుద్ధం వల్ల కనిపించని గాయాలు తగులుతుంటాయని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఆండ్రూ లీ అన్నారు. యుద్ధంలో గాయపడుతున్న సైనికుల కుటుంబ సభ్యుల బాధలు విన్న అనంతరం తమకు ఈ ఆలోచన వచ్చినట్లు వెల్లడించారు.

ఇదే టీమ్‌కు చెందిన డాక్టర్ రిక్ రెడెట్, ఈ మార్పిడితో ఆ సైనికుడు తన మూత్రసంబంధిత, లైంగిక కార్యకలాపాలు సాధారణంగా నిర్వహించుకోవచ్చని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఆపరేషన్లను ఇతర పేషెంట్లకూ చేస్తామని తెలిపారు.

ఈ సైనికుడు పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 12 నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.

ఆపరేషన్ అనంతరం, తన పేరును వెల్లడించడానికి ఇష్టపడని సైనికుడు, తనకు మెలకువ వచ్చాక తన శరీరంలో అంతా సక్రమంగా ఉన్నట్లు అనిపిస్తోందని అన్నారు.

వైద్య పరిభాషలో ఈ ఆపరేషన్‌ను 'వాస్కులరైజ్డ్ కాంపోజిట్ అలోట్రాన్స్‌ప్లాంటేషన్' అని పేర్కొంటారు. దీనిలో చర్మం, ఎముక, కండరాలు, రక్తనాళాలను మార్పిడి చేస్తారు.

అమెరికాలో మొట్టమొదటి పురుషాంగ మార్పిడి 2016లో మసచూసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో నిర్వహించగా, 2014లో దక్షిణాఫ్రికా సర్జన్లు ప్రపంచంలో మొట్టమొదటి పురుషాంగ మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)