ఉత్తర - దక్షిణ కొరియాలు ఎలా మాట్లాడుకుంటాయో ఊహించగలరా?

  • 25 ఏప్రిల్ 2018
ఉత్తర కొరియా Image copyright Getty Images

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌లు ఏప్రిల్ 27న కలుసుకోనున్నారు. ఆ రెండు దేశాలు అధికారికంగా సంభాషించుకోవడం చాలా తక్కువ. అందుకే వీళ్లిద్దరి చర్చలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

నిజానికి రెండు కొరియా దేశాల మధ్య సమాచార మార్పిడి విషయంలో ఎన్ని ఆంక్షలు ఉన్నా, గతంలోనూ అవి రకరకాల పద్ధతుల్లో చెప్పదలచుకున్న విషయాన్ని అవతలివాళ్లకు తెలిసేలా చేసేవి.

ఈ క్రమంలో తమ సమాచారాన్ని అవతలివాళ్లకు తెలిపేందుకు కొన్ని చిత్రమైన పద్ధతులను అనుసరించేవి.

బెలూన్లు

రెండు కొరియా దేశాల ప్రజలు తమ సమాచారాన్ని అవతలివాళ్లకు చేరవేసేందుకు ఎయిర్ బెలూన్లనే సాధనంగా వాడుకునేవారు. ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చినవాళ్లు, ఆ దేశాన్ని వ్యతిరేకించే సంఘాలు తమ నినాదాలను బ్యానర్లపై రాసి వాటిని ఎయిర్ బెలూన్లకు కట్టేవి.

ఆ బెలూన్లు ఉత్తర కొరియా భూభాగంలో పడేలా వదిలేవి. ఎక్కువగా దక్షిణ కొరియా వాసులే ఈ పద్ధతిని పాటించేవారు. 2015లో ఇలా ఎయిర్ బెలూన్లు తమ భూభాగంలోకి ప్రవేశించినప్పుడు ‘యుద్ధం ప్రకటించింది’ అంటూ దక్షిణ కొరియాను ఉద్దేశిస్తూ ఉత్తర కొరియా ప్రభుత్వ వెబ్‌సైట్ పేర్కొంది.

ఒక పక్క ఈ చర్యలను ఉత్తర కొరియా విమర్శిస్తున్నా, ఆ దేశస్థులు కూడా దక్షిణ కొరియాకు బెలూన్ల ద్వారా సందేశాలను పంపిస్తారు.

Image copyright Ed Jones/AFP/Getty Images

రేడియోలు

ఉత్తర కొరియా ప్రభుత్వం రేడియో తరంగాల ద్వారా స్వదేశంతో పాటు ఇతర దేశాలకు కూడా సందేశాలను పంపుతుంది. తమ దేశంలో కేవలం ప్రభుత్వం నుంచి అందే ఫ్రీక్వెన్సీలు మాత్రమే ప్రసారమయ్యేలా ఉత్తర కొరియా పరిమితులు విధించింది.

బయటి దేశాల నుంచి వచ్చే దాదాపు అన్ని సిగ్నళ్లను ప్రభుత్వం బ్లాక్ చేస్తుంది. కానీ విదేశీ ప్రసారాలను సైతం సంగ్రహించగలిగే శక్తిమంతమైన రేడియోలు ఉన్నవారు మాత్రం రహస్యంగా ఆ ప్రసారాలనూ వింటారు.

దక్షిణ కొరియాకు చెందిన ‘కొరియన్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టం’, బీబీసీ కొరియన్, రేడియో ఫ్రీ ఏషియా, వాయిస్ ఆఫ్ అమెరికాస్ కొరియన్ సర్వీస్ లాంటి కొన్ని విదేశీ స్టేషన్ల ప్రసారాలను ఉత్తర కొరియన్లు రహస్యంగా వింటారు.

ఉత్తర కొరియా నుంచి పారిపోయి దక్షిణ కొరియా వెళ్లిన కొందరు వ్యక్తులు ‘ఫ్రీ నార్త్ కొరియా రేడియో’, ‘నార్త్ కొరియా రిఫార్మ్ రేడియో’ లాంటి స్టేషన్లను నడుపుతున్నారు.

ఇతర దేశాలకు తాను చెప్పదలచుకున్న విషయాల్ని మాత్రమే చెప్పడానికి ‘వాయిస్ ఆఫ్ కొరియా’ అనే తన అధికారిక రేడియో స్టేషన్‌ను ఉత్తర కొరియా ఉపయోగిస్తుంది.

ఉత్తర కొరియాలో టెలివిజన్ ప్రసారాలపైన అనేక ఆంక్షలున్నాయి. అయినప్పటికీ స్మగ్లింగ్ ద్వారా దేశంలోకి దక్షిణ కొరియాకు చెందిన టీవీ షోలు, సినిమాలు ప్రవేశిస్తాయి.

Image copyright Korea Pool-Donga Daily via Getty Images

లౌడ్‌స్పీకర్ల ప్రచారం

తమ గొప్పలు చెప్పడానికి, ఎదుటివాళ్ల రాజకీయ, సామాజిక వ్యవస్థలను విమర్శించడానికీ తమ సరిహద్దులో భారీ లౌడ్ స్పీకర్లను వినియోగించిన చరిత్ర రెండు కొరియా దేశాలకూ ఉంది.

దక్షిణ కొరియా భూభాగంలో అమర్చిన లౌడ్ స్పీకర్లు ఎక్కువగా తమ ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ ఉత్తర కొరియా మానవ హక్కుల రికార్డును ఎండగడతాయి. పెద్ద శబ్దాలతో సంగీతాన్ని కూడా ప్రసారం చేస్తూ ఉత్తర కొరియా సైనికుల దృష్టిని ఆకర్షిస్తాయి.

ఉత్తర కొరియా లౌడ్ స్పీకర్లు తమ ప్రభుత్వ సందేశాలను వినిపిస్తూనే, దక్షిణ కొరియాతో పాటు అమెరికా లాంటి దేశాల చర్యలను ఖండిస్తాయి.

కానీ ఇటీవలే రెండు దేశాలు తమ స్పీకర్ శబ్దాల తీవ్రతతో పాటు ప్రసారాలనూ తగ్గించాయి.

Image copyright South Korean Unification Ministry via Getty Images

సరిహద్దులో సమాచార మార్పిడి

రెండు కొరియా దేశాలూ పరస్పర అంగీకారంతో పన్ముంజోమ్ అనే ప్రాంతంలో ఓ సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. రెండేళ్ల పాటు దీని సేవలు నిలిచిపోయిన అనంతరం 2018లోనే ఈ హాట్‌లైన్ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి.

1971లో ఉత్తర కొరియా-దక్షిణ కొరియాకు చెందిన రెడ్ క్రాస్ సంస్థలు సంభాషించుకునేందుకు తొలి డైరెక్ట్ టెలిఫోన్ సేవలను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అలాంటి దాదాపు 33 ఇంటర్ కొరియన్ టెలిఫోన్ లైన్లు పనిచేస్తున్నాయి.

ఒక కంప్యూటర్ తెర, ఫ్యాక్స్ మెషీన్ అనుసంధానించిన ఫోన్ ద్వారా రెండు దేశాల అధికారులు సాధారణంగా రోజూ రెండు సార్లు సంభాషించుకుంటారు.

2016లో దక్షిణ కొరియా ‘జాయింట్ ఇంటర్ కొరియన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌’ను మూసేయడంతో ఉత్తర కొరియా ఈ హాట్‌లైన్‌ను డిస్కనెక్ట్ చేసింది. 2018 జనవరిలో దీన్ని పునరుద్ధరించడంతో రెండు దేశాల మధ్య తిరిగి చర్చలు మొదలయ్యాయి. అవే దక్షిణ కొరియా నిర్వహించిన వింటర్ ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియా కూడా పాల్గొనేందుకు బాటలు వేశాయి.

మరీ నేరుగా మాట్లాడాలనుకుంటే సరిహద్దు వెంబడి సైనికుల చెవినపడేలా గట్టిగా తమ సందేశాన్ని వినిపిస్తారు. ఇటీవల యునైటెడ్ నేషన్స్ కమాండ్‌కు చెందిన అధికారి ఒకరు తన సందేశాన్ని దక్షిణ కొరియా సరిహద్దులో నిలబడి, ఉత్తర కొరియా సైనికులకు వినబడేలా అరిచి చెప్పారు.

Image copyright STR/AFP/Getty Images

లీడర్స్ స్పెషల్

‘ఇంటర్ కొరియన్ సమ్మిట్’ జరగనున్న నేపథ్యంలో తొలిసారిగా రెండు దేశాల నాయకుల మధ్య డైరెక్ట్ హాట్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. దక్షిణ కొరియా రాజధాని సోల్‌లోని అధ్యక్ష కార్యాలయం నుంచి ఉత్తర కొరియా స్టేట్ ఎఫైర్స్ కమిషన్‌కు నేరుగా ఈ హాట్‌లైన్ సేవలు అందుతాయి.

ఇలా నేరుగా మాట్లాడుకోవడం ద్వారా అపోహలు దూరమై మెరుగైన సంబంధాలు ఏర్పడతాయని దక్షిణ కొరియా అధికారులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)