కల్లలవుతున్న అమెరికా కలలు: ‘స్పౌజ్’ వీసాదారులపై ట్రంప్ వేటు!

  • 24 ఏప్రిల్ 2018
న్యూయార్క్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ Image copyright Getty Images

అమెరికాలో హెచ్1బి వీసా మీద పనిచేస్తున్న వృత్తి నిపుణుల జీవిత భాగస్వాములకు ఇచ్చే స్పౌజ్ వీసా అనుమతులను రద్దు చేయాలని డొనాల్డ్ ట్రంప్ సర్కారు ప్రణాళిక రూపొందించింది.

అమెరికా అంతర్గత భద్రత విభాగం డైరెక్టర్ ఎల్ ఫ్రాన్సిస్ సిస్నా.. అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) జ్యుడీషియరీ కమిటీ చైర్మన్‌కు ఏప్రిల్ 4వ తేదీతో రాసిన లేఖలో ఈ విషయాన్ని వివరించారు.

ఈ ప్రణాళిక అమలులోకి వస్తే అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. దీంతో వీరందరిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Image copyright Getty Images

హెచ్1బి వీసా మీద అమెరికాలో పనిచేసే వృత్తినిపుణుల జీవిత భాగస్వాములు హెచ్-4 వీసా కింద అమెరికాలో నివసించడానికి వస్తారు. ఆ వీసాతో వచ్చిన వారు.. అదే వీసా హోదాతో అమెరికాలో పనిచేయటానికి 2015కు ముందు అనుమతి ఉండేది కాదు.

అయితే.. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నపుడు 2015లో హెచ్1బి వీసాదారుల జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయటానికి అనుమతులు (ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ - ఈఏడీ) ఇవ్వడాన్ని ప్రారంభించారు.

అమెరికాలో శాశ్వత నివాసాన్నిచ్చే ‘గ్రీన్ కార్డ్’ కోసం దరఖాస్తు చేసుకున్న హెచ్1బి వీసాదారుల జీవిత భాగస్వాములకు మాత్రమే ఇలా పనిచేసేందుకు ఈఏడీ లభిస్తుంది.

ఈఏడీ విధానం అమలులోకి తెచ్చిన 2015 నుంచి ఇప్పటివరకూ సుమారు 1.05 లక్షల మంది హెచ్-4 వీసాదారులు అమెరికాలో పనిచేయటానికి అనుమతి పొందినట్లు అంచనా. వారిలో అత్యధికులు భారతీయులే కాగా.. ఆ తర్వాతి స్థానంలో చైనా వారు ఉన్నారని అంచనా.

Image copyright Getty Images

అయితే.. ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే ముందుగా అందుబాటులో ఉండాలని వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హెచ్1బి వీసా విధానంలో పలు సంస్కరణలు చేపడుతున్నారు.

అందులో భాగంగా హెచ్-4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగాలు చేయటానికి ఇచ్చే అనుమతులను రద్దు చేయాలనీ ఆయన ప్రభుత్వం భావిస్తోంది.

నిజానికి.. హెచ్-4 వీసాదారులకు ఈఏడీల జారీని రద్దు చేస్తామని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) 2017 సెప్టెంబర్ లోనే ప్రకటించింది.

2018 ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన ప్రకటన జారీ చేస్తామని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ నాడు పేర్కొంది. అయితే.. ఆ నిర్ణయాన్ని ఇప్పటివరకూ వాయిదా వేసింది.

Image copyright Getty Images

తాజాగా సెనేట్ జ్యుడీషియరీ కమిటీకి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ డైరెక్టర్ రాసిన లేఖలో.. ‘‘ఉద్యోగ అనుమతులకు అర్హులైన విదేశీయుల (జాబితా) నుంచి హెచ్-4పై ఆధారపడ్డ జీవితభాగస్వాములను తొలగించడం కోసం నిబంధనలను మార్చటానికి మేం ప్రణాళికలు రూపొందిస్తున్నాం. తద్వారా.. ఇలాంటి అనుమతులు ఇచ్చిన 2015 తుది నిబంధనను రద్దు చేస్తాం’’ అని పేర్కొన్నారు.

ఈ ప్రణాళికను 2018 జూన్ నుంచి అమలులోకి తెచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

అదే జరిగితే.. అమెరికాలో హెచ్-4 వీసాతో ఉద్యోగాలు చేస్తున్న 70,000 మందికి పైగా భారతీయుల (హెచ్1బి వీసాదారుల జీవితభాగస్వాములు) భవిష్యత్తు అయోమయంగా మారుతుందని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. వీరిలో 95 శాతం మంది మహిళలే ఉన్నారు.

ఈ అనుమతులను రద్దు చేయాలన్న ప్రణాళికను ఉపసంహరించుకోవాలంటూ అమెరికాలో ‘‘సేవ్ హెచ్4ఈఏడీ’’ ఉద్యమం కూడా సాగుతోంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)