‘బిన్ లాడెన్ బాడీగార్డు’కు జర్మనీలో జీవన భృతి

  • 25 ఏప్రిల్ 2018
సామి ఎ Image copyright FUNKE FOTO SERVICES

అల్ ఖైదాకు చెందిన ఒసామా బిన్ లాడెన్‌కు బాడీగార్డుగా ఉన్నారని చెబుతున్న ఓ టునీసియన్ వ్యక్తి ఇప్పుడు జర్మనీలో జీవన భృతి అందుకుంటున్నారు.

ఈయన 1997 నుంచి నెలకు 1168 యూరోలు అంటే రూ.94,800 చొప్పున తీసుకుంటున్నారు.

సామి ఎ అనే వ్యక్తికి సంబంధించిన ఈ వివరాలను జర్మనీ ప్రభుత్వం వెల్లడించింది.

భద్రతా కారణాల దృష్ట్యా ఇతని పూర్తి పేరు, ఇతర వివరాలను మాత్రం బయటపెట్టలేదు.

జీహాదీతో సంబంధాలపై అధికారులు ప్రశ్నించగా వాటిని అతను తోసిపుచ్చారు.

బిన్ లాడెన్‌ నేతృత్వంలోని అల్ ఖైదా 2001లో 9/11 న్యూయార్క్ ట్విన్ టవర్స్‌పై దాడులకు పాల్పడింది.

దీంతో 2011లో లాడెన్‌ను అమెరికా దళాలు పాకిస్తాన్‌లో కాల్చి చంపాయి.

Image copyright AFP

కొందరు సాక్షులు చెబుతున్న వివరాల మేరకు సామి ఎ అఫ్ఘానిస్తాన్‌లో బిన్ లాడెన్‌కు బాడీగార్డ్‌గా ఉన్నారు.

2000వ సంవత్సరంలో కొన్ని నెలల పాటు ఈయన లాడెన్ వద్ద పని చేశారని చెబుతున్నారు.

2006లోనూ సామిని జీహాదిస్ట్ ఆరోపణలపై విచారించారు. అయితే దీనికి సంబంధించి ఆయనపై ఎలాంటి అభియోగాలూ నమోదు కాలేదు.

ఈయన పశ్చిమ జర్మనీలోని బోహుమ్ అనే ప్రాంతంలో జర్మనీకి చెందిన భార్య, నలుగురు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు.

1999లో తాత్కాలిక నివాస అనుమతి పొందిన సామి టెక్నాలజీకి సంబంధించి పలు కోర్సులు చేశారు. 2005లో ఈ ప్రాంతానికి వచ్చారు.

అయితే ఈయన గతంలో శరణార్థిగా ఉంటానని కోరగా.. భద్రతా కారణాల రీత్యా జర్మనీ ప్రభుత్వం తిరస్కరించింది.

దీంతో రోజూ స్థానిక పోలీసు స్టేషన్‌లో హాజరవుతుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)