అధ్యయనం : ఆర్కిటిక్‌ మంచు పొరల్లో ప్లాస్టిక్..!

  • 25 ఏప్రిల్ 2018
ఆర్కిటిక్ సముద్రంలోని మంచు పొరలు Image copyright ALFRED WEGENER INSTITUTE/ R.STEIN

ఆర్కిటిక్ సముద్రంలో మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు గతంలో ఎన్నడూ లేనంతగా పేరుకుపోయాయి.

ఆర్కిటిక్ సముద్రంలో ఏర్పడిన మంచు పొరల్లో శాస్త్రవేత్తలు ఈ మైక్రో ప్లాస్టిక్‌ను గుర్తించారు. గతంలో కంటే రెండు,మూడు రెట్లు అధికంగా ప్లాస్టిక్ ఉందని వారు చెబుతున్నారు.

ఈ మంచు కరిగిపోయాక, అందులోని ప్లాస్టిక్ తిరిగి నీటిలో కలిసిపోయి, సముద్ర జీవులపై దుష్ప్రభావం చూపిస్తుందని జర్మన్ శాస్త్రవేత్తలు తెలిపారు.

వీరి పరిశోధనల్లో మొత్తం 17 రకాల ప్లాస్టిక్ అవశేషాలు బయటపడ్డాయి. ఈ మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు 5 మిల్లీమీటర్ల పొడవు ఉండి, ఆహారంతోపాటు సముద్ర జీవుల పొట్టలోకి సులభంగా చేరే అవకాశం ఉంది.

పెద్ద సైజు ప్లాస్టిక్ వస్తువులను పగులగొట్టి సముద్రంలో పారవేయడంతోపాటు, ఆరోగ్య, సౌందర్య సాధనాలు, ఉత్పత్తుల నుంచి కూడా పెద్దమొత్తంలో ప్లాస్టిక్ అవశేషాలు సముద్రంలో కలుస్తున్నాయి.

పసిఫిక్ సముద్రంలో టన్నులకొద్దీ పేరుకుపోతున్న చెత్త లేదా స్థానికంగా జరుగుతున్న చేపల వేట, నౌకాయాన కాలుష్యం ఆర్కిటిక్‌లో ప్లాస్టిక్‌ అవశేషాలకు కారణాలై ఉండొచ్చు.

Image copyright ALFRED WEGENER INSTITUTE/ T.VANKANN

ఆర్కిటిక్‌లో ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన యూకా పీకెన్ మాట్లాడుతూ..

''ఈ ప్లాస్టిక్ చాలా చిన్న సైజులో ఉండడంతో, సముద్ర జీవుల పొట్టల్లోకి సులభంగా వెళ్లగలదు. సముద్ర జీవులు, మనుషులపై దీని ప్రభావం ఏ మేర ఉంటుందో కచ్చితంగా చెప్పలేం'' అన్నారు.

వెంట్రుక కంటే చిన్న సైజులో..

2014 వసంత రుతువులో, 2015 వేసవి కాలాల్లో ఆర్కిటిక్‌లోని మంచు గడ్డలను సేకరించి, ప్లాస్టిక్‌ అవశేషాల గురించిన కచ్చితమైన ఆధారాల కోసం అధ్యయనాలు జరిపారు.

''ఒక లీటర్ మంచులో 12,000 అవశేషాలను గుర్తించాం. ఇవి మనిషి వెంట్రుక వ్యాసంలో 1/6 వంతు ఉన్నాయి'' అని మరో పరిశోధకుడు తెలిపారు.

సముద్రపు మంచు పొరల్లో మొత్తం 17 రకాల ప్లాస్టిక్ అవశేషాలను పరిశోధకులు గుర్తించారు. వీటిలో పాలిథిన్ సంచులు, పాలీప్రొపైలీన్, పెయింట్లు, నైలాన్, పాలిస్టర్, సిగరెట్ల పీకల తయారీలో వాడే సెల్యులోస్ అసిటేట్ అవశేషాలున్నట్లు తెలిపారు.

''పసిఫిక్ సముద్రంలో టన్నులకొద్దీ పేరుకుపోతున్న చెత్తా చెదారం ఈ వైపుకు కొట్టుకువచ్చి ఉంటుంది. లేదా.. ఈ ప్రాంతంలో పెరుగుతున్న చేపలవేట, నౌకాయానం కూడా కారణం అయ్యుండొచ్చు'' అని ఆయన వివరించారు.

Image copyright ALFRED WEGENER INSTITUTE/ M.FERNANDEZ

ఈ మంచు కరిగితే?..

మైక్రో ప్లాస్టిక్ అవశేషాలున్న మంచుపొరలు.. సముద్రంలోని వివిధ ప్రాంతాలకు రవాణ చేస్తాయి.

''వాతావరణ మార్పుల వల్ల మంచుపొరలు కరగడంతో ఆ ప్లాస్టిక్ అవశేషాలు సముద్ర వాతావరణంలో కలిసిపోతాయి'' అని ప్రముఖ శాస్త్రవేత్త డా.పెన్నీ లిండా తెలిపారు.

''సేకరించిన అన్ని శ్యాంపిళ్లలో మైక్రో ప్లాస్టిక్ అవశేషాలున్నాయి. ప్రపంచంలోని సముద్ర ఉపరితల నీటిలో అంతటా మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు వ్యాపించి ఉన్నాయి. ఇందుకు ఏ ప్రాంతమూ మినహాయింపు కాదు'' అని బ్రిటీష్ అంటార్కిటిక్ సర్వే శాస్త్రవేత్త జరామీ విల్కిన్సన్ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఏటా 80 లక్షల టన్నుల ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తోందని పరిశోధకుల అంచనా. అలా సముద్రంలో కలిశాక, మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు సుదూరంలోని పోలార్ ప్రాంతానికి, సముద్రం అట్టడుగుకు చేరుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు