అమెరికా చట్టసభలో 'జాతీయవాదాన్ని' తూర్పారబట్టిన ఫ్రాన్స్ అధ్యక్షుడు

  • 26 ఏప్రిల్ 2018
ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ Image copyright Getty Images

"వేరుగా ఉండిపోవటం, ఎవరినైనా ఒంటరిని చేసెయ్యటం లేదా జాతీయవాదం... ఇవి మనలోని భయాలను దూరం చేసుకునేందుకు తాత్కాలిక ప్రత్యామ్నాయం కావొచ్చు. కానీ ప్రపంచం కోసం మన తలుపుల్ని మూసెయ్యటం వల్ల మనం ప్రపంచాన్ని ముందుకు సాగకుండా అడ్డుకోలేం. ఇది మన పౌరులలో భయాలను దూరం చేయదు సరికదా, వారి భయాలను మరింత పెంచుతుంది. మనం అతివాద తరహా జాతీయవాద ఉన్మాదంతో ప్రపంచం కనే కలలకు నష్టం చేకూర్చగూడదు."

పై మాటలు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌ అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో మాట్లాడినవి. ప్రస్తుతం ఆయన మూడు రోజుల పర్యటనపై అమెరికాలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగిన మేక్రాన్ చివరకు తన మనసులోని మాటను స్పష్టం చేశారు.

జాతీయవాదం, వేర్పాటువాదం - ఈ రెంటి నుంచి తలెత్తే విధానాలు ప్రపంచ పురోగతికే ప్రమాదకరం అని మేక్రాన్ అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన దేశం కోసం రూపొందించిన అజెండాను మేక్రాన్ ప్రసంగం స్వల్పంగా దెబ్బతీసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరు దేశాల అధినేతల మధ్య బంధం గట్టిగానే ఉంది కానీ, మేక్రాన్ ప్రసంగాన్ని బట్టి చూస్తే ఆయన అంతర్జాతీయ వ్యాపారం, ఇరాన్, పర్యావరణం వంటి అంశాలపై అమెరికా అధ్యక్షుడితో ఏకీభవించడం లేదని అర్థమవుతోంది.

Image copyright Getty Images

మేక్రాన్ ప్రసంగించడం కోసం కాంగ్రెస్‌లో అడుగుపెట్టినపుడు సభ్యులంతా లేచి నిలబడి మూడు నిమిషాల పాటు చప్పట్లు చరిచారు.

మొట్టమొదట ఆయన అమెరికాతో తమ అవిచ్ఛిన్న సంబంధం గురించి ప్రస్తావించారు. స్వాతంత్ర్యం, సహనశీలత, సమానత్వపు హక్కుల గురించి మాట్లాడారు.

మేక్రాన్ ఇంకా ఏమేం అన్నారు?

50 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో.. అమెరికా మళ్లీ పారిస్ వాతావారణ మార్పు ఒప్పందాన్ని చేపడుతుందన్న విశ్వాసం తనకుందని అన్నారు. అట్లాగే, ఇరాన్‌తో 2015లో చేసుకున్న అణు ఒప్పందాన్ని ఫ్రాన్స్ ఉల్లంఘించబోదని కూడా అన్నారు.

ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిందన్న విషయం తెలిసిందే. అట్లాగే ఇరాన్‌తో చేసుకున్న అణు ఒప్పందాన్ని రద్దు చేస్తానంటూ ట్రంప్ బెదిరిస్తున్నారన్న విషయం కూడా విదితమే.

"ఈ ఒప్పందంతో భయాలన్నీ దూరం కాలేదనేది వాస్తవం. ఈ భయాలు సరైనవే. కానీ ఒక నిర్దిష్టమైన ప్రత్యామ్నాయం ఏదీ లేకుండా ఒప్పందాన్ని ఇలా మధ్యలో వదిలెయ్యకూడదు" అని మేక్రాన్ అన్నారు.

Image copyright Getty Images

అనంతరం ఆయన పారిస్ ఒప్పందాన్ని సమర్థిస్తూ, పర్యావరణం అంశాన్ని తన ప్రసంగంలో లేవనెత్తారు.

"మనం మన భూగోళాన్ని ఇలా నాశనం చేస్తూ పోతుంటే, మన పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడవేస్తుంటే.. అసలు మన జీవితాలకు అర్థం ఏముంది? మరో భూగోళం ఏదీ మనకోసం లేదన్న విషయాన్ని ముందుగా గుర్తించాలి! భవిష్యత్తులో మనందరం ఒకే ఒక్క వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనందరం ఉంటున్నది ఈ భూమి పైనే అని గుర్తుంచుకోండి" అని మేక్రాన్ తెలిపారు.

"అమెరికా మళ్లీ ఏదో ఒక రోజున పారిస్ ఒప్పందంలో భాగమవుతుందన్న విశ్వాసం నాకుంది."

వ్యాపార సంబంధాల గురించి మాట్లాడుతూ, వాణిజ్య యుద్ధాలు పరిష్కారం కాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు అన్నారు. వీటితో.. ఉద్యోగాలు పోవడం, ధరలు పెరగటం తప్ప ఒరిగేదేమీ లేదన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ద్వారానే దీనికి పరిష్కారం వెతకాలని ఆయన అభిప్రాయపడ్డారు. మనమే నిబంధనలు రాసుకున్నప్పుడు వాటిని అమలు చేయాల్సింది కూడా మనమే కదా అని అయన వ్యాఖ్యానించారు.

యూరప్, చైనా నుంచి జరిగే దిగుమతులపై ఇటీవలే ట్రంప్ కొత్త సుంకాలు విధించారు. ఎందుకంటే ఇతర దేశాలు అనుసరిస్తున్న తప్పుడు వాణిజ్య విధానాలతో తమ దేశం నష్టపోతోందని ట్రంప్ భావిస్తున్నారు. వాణిజ్య యుద్ధాలు మంచివనీ, వీటిని గెలవడం కూడా సులువని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇక జాతీయ వాదం గురించి మేక్రాన్, "వ్యక్తిగతంగా నాకు.. ఫ్రాన్స్ అన్నింటికన్నా శక్తిమంతమైన దేశంగా కావాలని గానీ, లేదా జాతీయవాదం పట్ల గానీ నాకు భ్రమలు లేవు" అని చెప్పారు.

Image copyright Getty Images

మేక్రాన్ ప్రసంగంపై కాంగ్రెస్ స్పందన

డెమొక్రటిక్ పార్టీ సీనియర్ పార్లమెంటేరియన్ ఆడమ్ స్కీఫ్ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ, మేక్రాన్ తాను ఊహించినదానికన్నా తీవ్రంగా, సూటిగా ట్రంప్‌ను వ్యతిరేకించారని అన్నారు.

మరోవైపు, మేక్రాన్ ప్రసంగం 'ట్రంప్‌ వాదాని"కి పూర్తిగా విరుద్ధమైందని రిపబ్లికన్ పార్టీకి చెందిన జెఫ్ ఫ్లేక్ అన్నారు.

అయితే ఆయన ప్రసంగంలో భిన్నాభిప్రాయాలేవీ లేవని మరో రిపబ్లికన్ నేత కెవిన్ మెక్‌కార్తీ అన్నారు.

"తాను స్వతంత్రమైన, నిజమైన వాణిజ్యం జరగాలని కోరుకుంటున్నట్టు మేక్రాన్ అన్నారు. ట్రంప్ కోరుకుంటున్నది కూడా ఇదే" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)