ఇరాన్‌లో బయటపడిన మమ్మీ పహ్లవీ రాజవంశ స్థాపకుడిదేనా?

  • 26 ఏప్రిల్ 2018
మానవ కళేబరం Image copyright TASNIM

ఇరాన్ రాజధాని తెహరాన్‌కు సమీపంలో ఓ మానవ కళేబరం (మమ్మీ) బయట పడింది. ఈ కళేబరం పహ్లవీ రాజవంశ స్థాపకుడు రెజా షాది అయ్యుంటుందని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

షహర్-ఎ-రేలో ఓ ప్రార్థనా మందిరాన్ని నిర్మిస్తున్న సమయంలో సోమవారంనాడు ఈ కళేబరం బయటపడింది. ఇందుకు సంబంధించిన వార్తలు ఫోటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేయడంతో ఇది రెజా షా పహ్లవీ కళేబరమేనా అన్న చర్చ మొదలైంది.

వాస్తవానికి రెజా షా సమాధి కూడా షహర్-ఎ-రేలోనే ఉండేది. కానీ 1979 విప్లవం తర్వాత ఆయన సమాధిని ధ్వంసం చేశారు. కానీ ఆ కళేబరాన్ని మాత్రం కనుగొనలేకపోయారు.

ఈ మానవ కళేబరం తన తాత గారిది కావడానికే ఎక్కువ అవకాశాలున్నాయని రెజా షా మనవడు అన్నారు.

Image copyright Getty Images

'రాజ కుటుంబీకులు విశ్వసించే వైద్యుల చేత ఆ కళేబరానికి పరీక్షలు నిర్వహించి, పద్దతి ప్రకారం ఇరాన్‌లోనే మళ్లీ ఖననం చేయాలి' అని షా మనవడు ట్విటర్‌లో ఇరాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

''ఆధునిక ఇరాన్ పితామహుడిగా లేదా రాజుగా కాకున్నా.. కనీసం ఓ సాధారణ సైనికుడిగా, ఓ దేశ భక్తుడిగానైనా భావించి షా సమాధిని ఓ స్మారక చిహ్నంగా నిర్మించాలి'' అంటూ షా మనవడు ఓ లేఖను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

ఎవరీ రెజా షా పహ్లవీ?

ఇరాన్‌లో 1921 సైనిక తిరుగుబాటుకు రెజా షా నాయకత్వం వహించారు. 1925లో పహ్లవీ రాజవంశాన్ని స్థాపించారు. ఈ వంశం ఇరాన్‌ను 50 ఏళ్లకు పైగా పాలించింది.

ఇరాన్‌లో చాలా ఆధునిక సంస్కరణలు తెచ్చాడని రెజా షాకు పేరుంది. కానీ మత సంబంధమైన దాడులు, మానవ హక్కుల ఉల్లంఘన అంశాల్లో రెజా షా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు.

తర్వాతి కాలంలో సింహాసనాన్ని తన కొడుక్కు అప్పగించాలంటూ బ్రిటన్, రష్యా దేశాలు రెజా షాపై ఒత్తిడి తెచ్చాయి. ఈ నేపథ్యంలో పదవీచ్యుతుడై, దక్షిణాఫ్రికాలో ఉంటూ 1944లో రెజా షా మరణించారు.

రెజా షా శవాన్ని మొదట ఈజిప్ట్‌లో ఖననం చేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఆ కళేబరాన్ని ఇరాన్‌కు తరలించారు.

అయితే ఇరాన్‌లో రెజా షా కుమారుడు, పహ్లవీ రాజవంశ వారసుడు అయిన మొహమ్మద్ రెజా షాకు వ్యతిరేకంగా 1979లో ఓ తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు అనంతరం, రెజా షా సమాధిని కొందరు ధ్వంసం చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు