కిమ్‌కు ఇచ్చే విందులో ఈ పదార్థంపై జపాన్‌కు అభ్యంతరమెందుకు?

  • 27 ఏప్రిల్ 2018
మ్యాంగో మూసే Image copyright Getty Images
చిత్రం శీర్షిక మ్యాంగో మూసేపై ఉంచిన మ్యాపులో వివాదాస్పద దీవులను చూపడంపై జపాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది

ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ తొలిసారి దక్షిణ కొరియాలో అడుగుపెట్టారు. ‘ఇంటర్ కొరియన్ సమ్మిట్‌’లో ఆయన పాల్గొన్నారు.

ఈ సదస్సు ముగిశాక శుక్రవారం రాత్రి దక్షిణ కొరియాలోనే భారీ విందు ఏర్పాటు చేశారు. దానికోసం ఇప్పటికే మెనూ సిద్ధం చేశారు.

కిమ్ కోసం స్విస్ బంగాళా దుంపలతో చేసిన ‘రోస్టి’తో పాటు, ఉత్తర కొరియాకు ప్రత్యేకమైన ‘కోల్డ్ నూడుల్స్’, ‘నార్త్ కొరియన్ లిక్కర్‌’ను అందిస్తారు. మూన్ జే-ఇన్ కోరికపై ఉత్తర కొరియాకు చెందిన ప్రఖ్యాత షెఫ్ ఒకరు ‘కోల్డ్ నూడుల్స్’ను సిద్ధం చేయనున్నారు.

కిమ్ గతంలో స్విట్జర్లాండ్‌లో చదువుకున్నారని చెప్పినా ఆ విషయం ఇప్పటిదాకా రూఢీ కాలేదు.

దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ కోసం ఆయన స్వస్థలమైన బూసాన్ నుంచి తెప్పిస్తున్న ఫ్లాట్ సీ ఫిష్‌ను వడ్డించనున్నారు.

Image copyright THE BLUE HOUSE
చిత్రం శీర్షిక స్విస్ బంగాళా దుంపలతో చేసిన 'రోస్టి'

దీవులపై మూడు దేశాల మధ్య వివాదం

కిమ్ బృందం కోసం ఏర్పాటు చేసిన విందులో వడ్డించే ‘మ్యాంగో మూసే’ అనే పదార్థంపై జపాన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ పదార్థం పైభాగంలో ఉంచిన కొరియా ద్వీపకల్ప మ్యాప్‌లో వివాదాస్పదమైన దీవుల్ని కూడా చూపడమే జపాన్ అభ్యంతరానికి కారణం. 1910 నుంచి 1945 వరకు కొరియా ద్వీపకల్పం జపాన్ ఆక్రమణలో ఉంది.

జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా.. మూడు దేశాలూ ఆ దీవులు తమవేనని చెబుతాయి.

గతంలోనూ దక్షిణ కొరియాలో ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన విందులు వివాదాస్పదమయ్యాయి. 2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా వచ్చినప్పుడు వడ్డించిన రొయ్యలు కూడా వార్తల్లోకెక్కాయి. దక్షిణ కొరియా, జపాన్ మధ్య వివాదంలో నలుగుతున్న దీవుల నుంచి ఆ రొయ్యల్ని తీసుకురావడమే వివాదానికి కారణమైంది.

కిమ్-మూన్ భేటీలో వాడుతున్న వాల్‌నట్ కుర్చీలపైనా ఈ వివాదాస్పద మ్యాపు ఉంది. ఈ వివాదాస్పద దీవులు ప్రస్తుతం దక్షిణ కొరియా నియంత్రణలో ఉన్నాయి.

ఈ దీవుల సముదాయాన్ని దక్షిణ కొరియా 'డోక్డో' అని, జపాన్‌ 'తాకెన్షిమా' అని వ్యవహరిస్తాయి. దీనిని 'లియాన్‌కోర్ట్ రాక్స్' అని కూడా పిలుస్తారు.

ఈ సముదాయంలో రెండు ప్రధాన దీవులు, దాదాపు 30 శిలలు ఉంటాయి. దీని విస్తీర్ణం 2.3 లక్షల చదరపు మీటర్లు. ఈ సముదాయం చుట్టూ ఉన్న జలాలు మత్స్య సంపద దృష్ట్యా విలువైనవి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)