మోదీ-జిన్‌పింగ్‌ల భేటీ కోసం వుహాన్ నగరాన్నే ఎందుకు ఎంపిక చేశారు?

  • 27 ఏప్రిల్ 2018
మోదీ-షీ జిన్‌పింగ్ Image copyright Getty Images

భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య సమావేశం కోసం రాజధాని బీజింగ్‌ నగరానికి బదులు చైనాలోని ఓ మధ్య రకం నగరాన్ని ఎంపిక చేయడం దౌత్యపరంగా చూస్తే ప్రాముఖ్యం కలిగిన అంశం.

ఇది స్థానిక చైనా మీడియా అభిప్రాయం.

చైనా మధ్య భాగంలో ఉండే హుబెయి ప్రావిన్స్ రాజధాని వుహాన్‌లో ఏప్రిల్ 27-28 తేదీలలో నరేంద్ర మోదీ, షీ జిన్‌పింగ్ భేటీ అవుతున్నారు.

వుహాన్ నగరం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య కార్యకలాపాలకు ఒక ముఖ్య కేంద్రంగా ఎదుగుతోందనడానికి ఇది సంకేతం అని వుహాన్ నుంచి ప్రచురితమయ్యే 'ద చాంగ్‌జియాంగ్ డైలీ' పేర్కొంది.

దౌత్యనీతికి కొత్త కేంద్రంగా ఎదుగుతున్న వుహాన్

గత సంవత్సర కాలంలో ఈ నగరం ఇద్దరు విదేశీ నేతలకు స్వాగతం పలికిందని ఈ దినపత్రిక తన ఏప్రిల్ 23 నాటి కథనంలో తెలిపింది.

2018 జనవరి 31న చైనాకు వచ్చిన బ్రిటన్ ప్రధానమంత్రి థెరీసా మే కూడా తన పర్యటనను వుహాన్ నుంచే ప్రారంభించారు. అంతకు ముందు 2017 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ ప్రధానమంత్రి బర్నార్డ్ కెజేనువే కూడా ఈ నగరానికే వచ్చారు.

Image copyright Dan Kitwood/Getty Images
చిత్రం శీర్షిక వుహాన్ నగరం

ఈ నగరం చైనా మధ్యప్రాంతంలో అతి పెద్ద నగరం కావడం, ప్రపంచంలోనే అతి ఎక్కువ సంఖ్యలో కాలేజీ విద్యార్థులున్న నగరం కావడం వల్ల బ్రిటన్‌కు చెందిన రాజకీయ, ఆర్థిక నిపుణుల దృష్టి వుహాన్ పట్టణాభివృద్ధిపై ఉన్నట్టు ఆ పత్రిక కథనం తెలిపింది.

చైనా మధ్య భాగంలో మొదటి విదేశీ దౌత్య కార్యాలయం కూడా ఈ నగరంలోనే ఏర్పాటైంది. ఫ్రాన్స్ 1998లో తన దౌత్య కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఫ్రాన్స్, చైనాలు కలిసి తయారు చేసిన ఇకో-సిటీ కూడా ఇదే.

వుహాన్‌ను ఎంపిక చేయడం వెనుక దౌత్యపరమైన, వ్యూహాత్మక కారణాలున్నాయని మిగతా మీడియా కథనాలు పేర్కొన్నాయి.

అసాధారణ చర్యలు

బీజింగ్‌తో పోల్చినపుడు కొంత ప్రశాంతంగా ఉండే వుహాన్‌ను సంభాషణలకు వేదికగా ఎంపిక చేయడానికి కారణం ఈ పర్యటన విషయమై భారత్‌లో మోదీ విమర్శకులు వెలిబుచ్చుతున్న అసంతృప్తిని తగ్గించడం అని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే 'గ్లోబల్ టైమ్స్' పత్రిక ఏప్రిల్ 23న సంపాదకీయంలో పేర్కొంది.

మోదీని కలవడం కోసం జిన్‌పింగ్ ఒక రాష్ట్రానికి వెళ్లడాన్ని కూడా అసాధరణ చర్యగానే చూస్తారు. ప్రొటోకాల్‌కు భిన్నంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని సుహృద్భావానికీ, ఈ భేటీకి ఉన్న ప్రాముఖ్యానికి సంకేతంగా కూడా చూస్తారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బ్రిటన్ ప్రధాని థెరిసా మే కూడా ఈ సంవత్సరం ఆరంభంలో వుహాన్‌కు వచ్చారు

ఈ భేటీ 1988లో చైనా మాజీ నేత డెంగ్ షియావోపింగ్, రాజీవ్ గాంధీల మధ్య జరిగిన భేటీ లాగే చరిత్రాత్మకంగా నిలుస్తుందని పత్రిక అభిప్రాయపడింది. 1988 నాటి సమావేశం భారత్, చైనాల మధ్య సంబంధాల భవిష్యత్తు దిశను నిర్దేశించింది.

భారత తొలి ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ కూడా 1954లో వుహాన్ నగరానికి వచ్చినట్టు ఐ జెన్‌దావో అనే న్యూస్ వెబ్‌సైట్ ఓ వార్తను ప్రచురించిందని రాజకీయ విశ్లేషకుడు జెన్‌హావో వీచాట్‌‌పై ఒక పోస్ట్ రాశారు. రెండు దేశాలూ శాంతియుతంగా కలిసిమెలిసి ఉంటామంటూ నెహ్రూ, డెంగ్‌లు పంచశీల సూత్రాలపై సంతకం చేసింది వుహాన్ నగరంలోనే అని ఆ వార్తను బట్టి తెలుస్తోంది.

అందుకే వుహాన్ ఎంపిక మోదీ, జిన్‌పింగ్‌ల భేటీకి ప్రాముఖ్యాన్ని తెచ్చిపెడుతోంది. ప్రత్యేకించి ఇరు దేశాల మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాల్లో మరో మార్పును ఈ ఎంపిక సూచిస్తోంది.

2015లో మోదీ బీజింగ్‌లో పర్యటించి వెళ్లిన తర్వాత చైనా నేత ఎవరూ భారత్‌ పర్యటనకు రాకపోయినప్పటికీ మోదీ మళ్లీ చైనాకు వస్తున్నందున ఆయనకు గౌరవప్రదంగా ఉండేలా చూడడానికి కూడా ఈ నగరాన్ని ఎంపిక చేసినట్టు జాన్‌హావో వెబ్‌సైట్‌ను ఉటంకిస్తూ ఆయన రాశారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కాలేజీ విద్యార్థుల సంఖ్య రీత్యా చూస్తే ప్రపంచంలో అతి పెద్ద నగరం వుహానే

చైనా విదేశాంగ శాఖ స్పందన

అయితే, చైనా విదేశాంగశాఖ మాత్రం దీనిపై ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.

విదేశాంగశాఖ ప్రతినిధి లూ కాంగ్ ఏప్రిల్ 23న ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, రెండు దేశాలను సంప్రదించిన తర్వాతే ఈ సమావేశానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇద్దరు నేతలూ వివిధ అంశాలపై గంభీరంగా చర్చించేందుకు అనువైన వాతావరణం ఉండేలా చూడడమే దీని ఉద్దేశమని ఆయనన్నారు.

చైనా మధ్య ప్రాంతంలో వుహాన్ అతి పెద్ద నగరం అయినందువల్లనే కాకుండా, ఈ నగరంలో భారత్-చైనా సంబంధాలకు చరిత్రాత్మక ప్రాధాన్యత ఉన్నందువల్ల కూడా దీనిని వేదికగా ఎంపిక చేశామని విదేశాంగశాఖ ఉపమంత్రి కోంగ్ షువాన్యే విలేఖరులతో చెప్పారని ద పేపర్ అనే వెబ్‌సైట్ రాసింది.

మోదీ చైనాలో ఆగ్నేయ, వాయువ్య ప్రాంతాల్లోని నగరాలను ఇదివరకే పర్యటించారు కానీ మధ్య చైనాకు ఆయన ఇప్పటి వరకూ రాలేదని కూడా కోంగ్ అన్నారు.

"మోదీ చైనాను మరింత బాగా అర్థం చేసుకునేందుకు ఈ పర్యటన తోడ్పడుతుంది" అని కోంగ్ అభిప్రాయపడ్డారు.

(ప్రపంచవ్యాప్తంగా టీవీ, రేడియో, వెబ్, ప్రింట్ మాధ్యమాల్లో ప్రసారమయ్యే వార్తలను బీబీసీ మానిటరింగ్ రిపోర్ట్ చేస్తుంది, విశ్లేషిస్తుంది. బీబీసీ మానిటరింగ్ వార్తలను మీరు ట్విటర్, ఫేస్‌బుక్‌పై కూడా చదవొచ్చు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)