ఫేస్‌బుక్ మోడరేటర్: చూడలేనివెన్నో అక్కడ చూడాల్సి ఉంటుంది!

  • 28 ఏప్రిల్ 2018
సారా కాట్జ్ ఫేస్‌బుక్ మోడరేటర్‌గా ఎనిమిది నెలలు పనిచేశారు
చిత్రం శీర్షిక సారా కాట్జ్ ఫేస్‌బుక్ మోడరేటర్‌గా ఎనిమిది నెలలు పనిచేశారు

ఈ కథనంలో చిన్నారులపై లైంగిక వేధింపులు, ఇతర చర్యల ప్రస్తావన చదువరులను కలతకు గురిచేయవచ్చు.

‘‘ఒక పోస్టును క్లిక్ చేసినపుడు ఏం వస్తుందో తెలియదు. చిన్నారులపై లైంగిక దాడులు, జుగుప్సాకరమైన పోర్నోగ్రఫీ, ఒళ్లు గగుర్పొడిచే హింస.. ఎన్నో దారుణాలు కనిపిస్తుంటాయి. గుండె చెదిరిపోతుంది. కొన్ని నిత్యం వెంటాడుతూ ఉంటాయి.’’

సారా కాట్జ్ తన అనుభవాలను వివరిస్తూ చెప్పిన మాటలివి. ఆమె ఫేస్‌బుక్ మోడరేటర్‌గా ఎనిమిది నెలలు పనిచేశారు.

‘‘మేం ఎటువంటి కంటెంట్ చూస్తాం, అది ఎంత దారుణంగా ఉంటుంది అనే విషయాన్ని ఆ సంస్థ ముందే చాలా స్పష్టంగా చెప్పింది.’’

2016లో కాలిఫోర్నియాలో థర్డ్ పార్టీ ఏజెన్సీ కోసం పనిచేసిన వందలాది మంది మానవ మోడరేటర్లలో సారా ఒకరు.

ఫేస్‌బుక్‌లో యూజర్లు పోస్ట్ చేసే కంటెంట్‌ను, వాటిపై వచ్చే ఫిర్యాదులను అనుక్షణం పర్యవేక్షిస్తూ సమీక్షిస్తూ వాటిని తొలగించాలా వద్దా అనేది నిర్ణయించే పని చేసే వారు మోడరేటర్లు.

ఆ ఉద్యోగంలో తన అనుభవాలను సారా బీబీసీ రేడియో 5 లైవ్ ప్రతినిధి ఎమ్మా బార్నెట్‌తో పంచుకున్నారు.

Image copyright AFP

ఈ మోడరేటర్ల కళ్లు ఎప్పుడూ కంప్యూటర్ స్క్రీన్ మీదే ఉంటాయి. చేతిలో మౌస్ నిరంతరం కదులుతుంటుంది. మామూలుగా చూస్తే కుర్చీలో కూర్చుని కదలకుండా యంత్రం లాగా పనిచేస్తున్నట్టు కనిపిస్తారు.

‘‘ఒక్కో పోస్టును సమీక్షించి దానిని తొలగించాలో లేదో నిర్ణయించటానికి ఒక్క నిమిషం కంటే ఎక్కువ సమయం కేటాయించరాదని మాకు పరిమితి విధించారు’’ అని సారా చెప్పారు.

‘‘కొన్నిసార్లు ఆ కంటెంట్‌కు సంబంధించిన అకౌంట్‌ను కూడా మేం తొలగిస్తాం.’’

‘‘మేం రోజుకు 8 గంటల్లో సగటున 8,000 పోస్టులను సమీక్షిస్తాం. అంటే.. గంటకు సుమారు 1,000 పోస్టులన్నమాట’’ అని ఆమె తెలిపారు.

కంటెంట్ సమీక్ష పనిలో ముందుగా శిక్షణ ఇచ్చినా వీరు ఉద్యోగంలోనే ఎక్కువ నేర్చుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగంలో మొదటి రోజే చాలా నేర్చుకుంటారు.

Image copyright Getty Images

పీడకలలుగా వెంటాడే దృశ్యాలు...

‘‘ఈ ఉద్యోగం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చాలా కఠోరమైనది‘’ అని సారా అభివర్ణిస్తారు.

‘‘క్లిక్ చేసిన తర్వాత ఎటువంటి చిత్రాన్నైనా చూడటానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఎటువంటి హెచ్చరికా లేకుండా ముంచుకొస్తాయి’’ అని ఆమె చెప్పారు.

అలా సమీక్షించేటపుడు కొన్ని దారుణమైన దృశ్యాలు తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తాయి. మరికొన్ని వెంటాడే పీడకలలుగా మారతాయి.

‘‘నన్ను నిరంతరం వెంటాడే కంటెంట్.. చిన్నారులపై లైంగిక దాడులు, చైల్డ్ పోర్నోగ్రఫీ’’ అని సారా వివరించారు.

‘‘ఇద్దరు పిల్లలు - అబ్బాయికి 12 ఏళ్ల వయసుంటుంది. అమ్మాయికి ఎనిమిదేళ్లో తొమ్మిదేళ్లో ఉంటాయి - ఎదురెదురుగా నిల్చుని ఉన్నారు.’’

‘‘వాళ్ల ఒంటి మీద దుస్తులు లేవు. ఒకర్నొకరు తాకుతూ ఉన్నారు. ఒక వ్యక్తి కెమెరాలో కనిపించకుండా వారికి ఏం చేయాలో చెప్తున్నట్లు అర్థమవుతుంది. అది చాలా కలత పెట్టింది. ఎందుకంటే అది నిజంగా జరిగిందని మనకు తెలుస్తుంది’’ అని ఆమె తెలిపారు.

Image copyright Getty Images

‘అనుకున్నదానికన్నా దారుణంగా ఉంటుంది...’

ఇటువంటి కంటెంట్ విషయంలో కంపెనీ ప్రతినిధులు ముందుగానే హెచ్చరిస్తారు. కానీ ‘‘హెచ్చరించటం.. ఈ దారుణ దృశ్యాలు నిజంగా చూడటం వేర్వేరు విషయాలు’’ అని సారా అంటారు.

‘‘కొంత మంది తాము తట్టుకోగలమని అనుకుంటారు. కానీ వారు తట్టుకోలేరని ఈ దృశ్యాలు చూశాక తేలిపోతుంది. పరిస్థితి వారు అనుకున్నదానికన్నా దారుణంగా ఉంటుంది’’ అని ఆమె చెప్పారు.

ఇటువంటి అశ్లీల పోస్టులు చాలా సర్క్యులేట్ అవుతూ ఉంటాయని, ఒకే విధమైన పోస్టుల్లో అసలు పోస్టు ఎక్కడి నుంచి వచ్చిందనేది కనిపెట్టటానికి చాలా కష్టపడాలని తెలిపారు.

దారుణమైన పోస్టులు చూసి కలతకు గురయ్యే తమకు గతంలో కౌన్సెలింగ్ వంటి సేవలేవీ అందుబాటులో లేవని ఆమె పేర్కొన్నారు.

‘‘అప్పుడు కౌన్సెలింగ్ సేవల వంటివేవీ లేవు. ఇప్పుడు ఉండొచ్చు.. నాకు తెలీదు’’ అన్నారు.

ఒకవేళ అప్పుడు కౌన్సెలింగ్ సర్వీస్ అందుబాటులో ఉన్నట్లయితే.. తాను కౌన్సెలింగ్ తీసుకునేదానినని సారా చెప్తారు.

Image copyright Getty Images

హింసాత్మక దృశ్యాలు...

‘‘కాలం గడిచేకొద్దీ ఈ దృశ్యాలకు అలవాటవుతాం. స్పందన తగ్గిపోతుంది. ఇది తట్టుకోవటం సులభమవుతుందని చెప్పను కానీ.. అలవాటవుతాం’’ అని ఆమె వివరించారు.

‘‘పరస్పరం ఇష్టపడ్డ పెద్దవాళ్ల మధ్య పోర్నోగ్రఫీ కూడా చాలా ఉంటుంది. అది అంతగా కలతపెట్టదు.’’

‘‘జంతువులతో లైంగిక కార్యకలాపాలు కూడా కనిపిస్తాయి. ఒక గుర్రంతో అలా చేసిన వీడియో ఒకటి సర్క్యులేట్ అయింది’’ అని జుగుప్సాకరమైన పోస్టుల గురించి సారా వివరించారు.

ఇక భయంగొలిపే రక్తసిక్త హింస దృశ్యాలు కూడా చాలా కనిపిస్తుంటాయని ఆమె చెప్పారు.

‘‘ఒక మహిళ తల పేలిపోయిన దృశ్యం ఒకటి ఉంది. ఆమె శరీరంలో సగభాగం నేలపై పడిపోయింది. మిగతా సగం ఇంకా కుర్చీలోనే ఉంది’’ అని ఒక అనుభవం గురించి తెలిపారు.

ఇలాంటి హింసాత్మక దృశ్యాల కన్నా.. పోర్నోగ్రఫీ కంటెంట్ తొలగించే విషయంలో విధివిధానాలు ఇంకా కఠినంగా ఉంటాయని సారా పేర్కొన్నారు.

Image copyright Getty Images

‘ఫేక్ న్యూస్ గురించి పెద్దగా పట్టించుకోలేదు‘

‘‘ఫేక్ న్యూస్ (బూటకపు వార్తలు) తో ఫేస్‌బుక్ నిండిపోయిందని నేనుకుంటాను. అమెరికా ఎన్నికల సమయంలో.. కనీసం నేను అక్కడ పనిచేస్తున్నపుడే.. ఇలాంటి ఫేక్ న్యూస్ మీద పర్యవేక్షణ బాగా లోపించినట్లు కనిపిస్తుంది’’ అని ఆమె చెప్పారు.

అసలు ‘ఫేక్ న్యూస్’ అనే పదం విన్నట్లు తనకు నిజంగా గుర్తులేదని అంటారామె.

‘‘ఫేస్‌బుక్‌లో యూజర్లు ఫిర్యాదు చేసిన చాలా వార్తలను నేను చూశాను. కానీ వార్తా కథనాలను పరిశీలించి వాస్తవాలు కచ్చితంగా ఉండేలా చూడాలని మేనేజ్‌మెంట్ మాకు చెప్పిన దాఖలాలు నాకు గుర్తులేవు.’’

ఈ ఉద్యోగం చాలా విసుగుపుట్టించే పని అని సారా పేర్కొన్నారు. స్పామ్ ఏమిటి, కానిదేమిటి అనేదానికి అలవాటుపడిపోతామని.. క్లిక్ చేయటమే పనిగా మారిపోతుందని చెప్తారు.

‘‘ఈ పనిని సిఫారసు చేస్తానా అంటారా? మీరు వేరే పని ఏదైనా చేయగలిగేట్లయితే.. ఈ పని మాత్రం చేయొద్దని చెప్తా’’ అని ఆమె స్పందించారు.

Image copyright AFP

ఫేస్‌బుక్ ప్రతిస్పందన...

సారా కథనాన్ని బీబీసీ.. ఫేస్‌బుక్ దృష్టికి తీసుకెళ్లింది.

‘‘ఫేస్‌బుక్‌ను సురక్షితంగా, అనువైన వాతావరణంతో ఉంచడంలో మా సమీక్షకులు కీలక పాత్ర పోషిస్తారు. ఇది చాలా సవాళ్లతో కూడిన పని కావచ్చు. వారికి సరైన మద్దతు లభించేలా చూడటానికి మేం కృషి చేస్తున్నాం’’ అని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

తమ ఉద్యోగులు, తమ భాగస్వాముల ద్వారా పనిచేసే వారందరికీ నిరంతరం శిక్షణ, కౌన్సెలింగ్, మానసిక మద్దతు అందిస్తున్నామని తెలిపారు.

‘‘వీలైనచోట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు)ను ఉపయోగిస్తున్నప్పటికీ.. ప్రస్తుతం ఫేస్‌బుక్ కంటెంట్‌ను సమీక్షించటానికి 7,000 మందికి పైగా పనిచేస్తున్నారు. వారి సంక్షేమాన్ని చూసుకోవటం మా ప్రాధాన్యం’’ అని ఆ ప్రతినిధి ఉద్ఘాటించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)