అణు పరీక్షల కేంద్రాన్ని మూసేయనున్న ఉత్తర కొరియా

  • 29 ఏప్రిల్ 2018
అణు పరీక్షల కేంద్రం Image copyright Reuters

ఉత్తర కొరియా అణు పరీక్షల కేంద్రాన్ని వచ్చే నెలలో మూసి వేస్తారని దక్షిణ కొరియా వెల్లడించింది.

ఈ మేరకు దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ మూసివేత ప్రక్రియ ప్రజల సమక్షంలో జరుగుతుందని దక్షిణ కొరియా అధికార ప్రతినిధి వెల్లడించారు.

మూసివేతను సందర్శించేందుకు దక్షిణ కొరియా, అమెరికాలకు చెందిన నిపుణులకు ఆహ్వానం అందిందని వివరించారు.

శుక్రవారం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌లు తమ ప్రాంతంలో అణు ఆయుధాలకు స్వస్తి పలికేందుకు వీలుగా ఓ ఒప్పందంపై సంతకం చేశారు.

‘‘ఈ సందర్భంగా గతవారం జరిగిన సదస్సులో.. మేలో తమ దేశంలోని అణు పరీక్షల కేంద్రాన్ని మూసేస్తామని కిమ్ వెల్లడించారు..’’ అని దక్షిణ కొరియా అధికార ప్రతినిధి యూన్ యంగ్ వెల్లడించారు.

పారదర్శకత కోసం ఈ ప్రక్రియనంతా అంతర్జాతీయ సమాజం, అమెరికాకు వివరిస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు చెప్పినట్లు యూన్ యంగ్ వివరించారు.

అంతేకాదు, తమ టైమ్ జోన్‌ను మార్చుకునేందుకు కూడా ఉత్తర కొరియా అంగీకరించింది. ప్రస్తుతం దక్షిణ కొరియా-ఉత్తర కొరియాల మధ్య సమయంలో అరగంట వ్యత్యాసం ఉంటోంది.

అయితే, ఉత్తరకొరియా ఇప్పటి వరకు ఈ విషయాలపై బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Image copyright RODONG SINMUN

అణు పరీక్షల కేంద్రం ఎక్కడుంది?

ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతంలో పర్వతాల మధ్య 'ఫంగీ రీ' అణు పరీక్షల కేంద్రం ఉంది.

ఉత్తర కొరియా అణు పరిశోధనలకు అత్యంత ముఖ్యమైన కేంద్రం ఇదే.

'ఫంగీ రీ' అణు కేంద్రం సమీపంలోని మాంటాప్‌ పర్వతం కింద తవ్విన సొరంగాల్లో అణు పరీక్షలు నిర్వహించేవారు.

2006 నుంచి ఇక్కడ ఆరు అణు పరీక్షలు నిర్వహించారు.

2017 సెప్టెంబర్‌లో చివరి అణు పరీక్ష నిర్వహించినప్పుడు, భూప్రకంపనలు వచ్చాయి

ఈ ప్రభావంతో మాంటాప్‌ పర్వతం లోపలి భాగం కొద్దిగా కూలిపోయినట్లు భూకంప శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఉపగ్రహ ఛాయాచిత్రాలు, ఈ ప్రదేశంలో పరికరాల తరలింపు ఆధారంగా ఈ విషయాలను అంచనా వేస్తున్నారు.


మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionచూడండి.. కిమ్ దక్షిణ కొరియాలో అడుగుపెట్టిన చరిత్రాత్మక ఘట్టం

విశ్వాసం కలిగించే చర్యలు

బీబీసీ కొరియా ప్రతినిధి లూరా బికర్ విశ్లేషణ

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ తీసుకున్న మరో కీలక నిర్ణయం ఇది.

'ఫంగీ రీ' అణు కేంద్రాన్ని మూసివేస్తామని కిమ్ ఇదివరకే ప్రకటించారు. ఇది మరింత పారదర్శకంగా ఉండేందుకు ప్రజల సమక్షంలోనే దీన్ని మూసివేయాలని తాజాగా ఆయన నిర్ణయించారు. దీనికి అమెరికా సహా అంతర్జాతీయ నిపుణులు, మీడియాను కూడా ఆహ్వానిస్తున్నారు.

ట్రంప్-కిమ్ భేటికి ఇలాంటి చర్యలు మరింత దోహదం చేస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)