టెలిగ్రామ్‌పై ఆంక్షలు: కరెన్సీ నోట్లతో ఇరానియన్ల వినూత్న ఉద్యమం

  • 30 ఏప్రిల్ 2018
ఇరాన్ నోట్లు Image copyright TWITTER / @MOHAMMA22877029

ఇరాన్‌లో మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై ప్రభుత్వ నియంత్రణను నిరసిస్తూ ఆ దేశంలోని నెటిజన్లు వినూత్న ఉద్యమం ప్రారంభించారు. కరెన్సీ నోట్ల మీద నినాదాలు రాస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇరాన్‌లో టెలిగ్రామ్‌కు వినియోగదారులు భారీగా ఉన్నారు. దేశ జనాభాలో సగం మంది అంటే దాదాపు 4 కోట్ల మంది టెలిగ్రామ్ యాప్‌ను వినియోగిస్తున్నారు.

అయితే, దేశంలో తిరుగుబాటుదారుల ఆందోళనలకు టెలిగ్రామ్ సహకరిస్తోందని ఇరాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇటీవలే టెలిగ్రామ్‌తో పాటు, ఇన్‌స్టాగ్రామ్‌ మీద కూడా ఆంక్షలు విధించింది. వీడియోలను, ఫొటోలను షేర్ చేయడాన్ని బ్లాక్ చేసింది.

దేశంలోని టెలిగ్రామ్ యాప్ నుంచి దాని సర్వర్లకు అనుసంధానంకు సంబంధించిన అనుమతులను రద్దు చేసింది. ఆ సర్వర్లను దేశ సరిహద్దు వెలుపల ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ప్రభుత్వం నియంత్రణలోని గేట్‌వే ద్వారా మాత్రమే సమాచారం వెళ్లాలని నిబంధన పెట్టింది.

ఇప్పుడు టెలిగ్రామ్ సేవలను పూర్తిగా నిషేధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఊహాగానాలు వస్తున్నాయి.

దాంతో ఆ ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ.. నెటిజన్లు సోషల్ మీడియా ఉద్యమం ప్రారంభించారు.

Image copyright TWITTER / @N_A_R_R_A_T_O_R

కరెన్సీ నోట్లపై తమ నినాదాలను రాసి వాటి ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు.

ప్రభుత్వం దృష్టిలో పడకుండా ఉండేందుకు చాలామంది తమ పేరు బహిర్గతం చేయకుండా ఖాతాలు తెరిచి ట్వీట్లు చేస్తున్నారు.

నిజానికి ఇరాన్‌లో ట్విటర్ పైన అధికారికంగా నిషేధం ఉంది. కానీ, ప్రాక్సీ సర్వీస్, వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్(వీపీఎన్) ద్వారా చాలా మంది వినియోగిస్తున్నారు.

టెలిగ్రామ్ యాప్‌కు ప్రత్యామ్నాయంగా 'సొరౌష్' పేరుతో ఇరాన్ ప్రభుత్వం యాప్‌ను విడుదల చేసింది.

ప్రభుత్వ ఉద్యోగులు టెలిగ్రామ్‌ వాడొద్దని, 'సొరౌష్' అధికారిక యాప్‌నే వినియోగించాలని ఆదేశించింది.

ఇటీవలే రష్యా కూడా టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌ను నిషేధించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)