పంజాబ్ గ్రామానికి లేఖ రాసిన పాకిస్తాన్ చిన్నారి. ఎందుకంటే..

  • 1 మే 2018
అకీదత్ నవీద్ Image copyright Aqeedat Naveed/BBC

సాధారణంగా చెడు వేగంగా వ్యాపిస్తుందంటారు. కానీ మంచి పనులకూ ఆ శక్తి ఉందని పంజాబ్‌లోని ఓ గ్రామం గురించి బీబీసీ ప్రచురించిన ఓ కథనం నిరూపించింది.

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన పంజాబ్‌లోని మూమ్ అనే గ్రామం గురించి బీబీసీ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ గ్రామంలో ముస్లింలు మసీదు నిర్మించుకోవడం కోసం హిందువులు, సిక్కులు సాయం చేస్తున్నారు. మసీదు నిర్మాణం కోసం ఆ ఊళ్లోని ఓ హిందూ దేవాలయ యాజమాన్యం 900 చదరపు అడుగుల స్థలాన్ని విరాళంగా ఇచ్చింది.

దీనికి సంబంధించి బీబీసీ ప్రచురించిన కథనం పాకిస్తాన్‌కు చెందిన అకీదత్ నవీద్ అనే ఓ విద్యార్థిని దృష్టికెళ్లింది. మూమ్ గ్రామంలో వెల్లివిరిసిన మతసామరస్యం ఆ చిన్నారిని ఆకర్షించింది. దాంతో ఆ కథనాన్ని చదివి ఊరుకోకుండా, ఆ గ్రామస్తులను అభినందించాలని అకీదత్ నిర్ణయించుకుంది.

వెంటనే ఆ గ్రామానికి చెందిన భరత్ రామ్, నజీమ్ రాజాలతో పాటు ఇతర గ్రామస్తులనూ అభినందిస్తూ లేఖ రాసింది. ముస్లింలు, హిందువులు, సిక్కులు సోదర భావంతో మెలగడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొంది.

చిత్రం శీర్షిక అకీదత్ రాసిన లేఖ

అక్కడ నిర్మిస్తున్న మసీదుకు ‘అమన్ మసీద్’ (శాంతి మసీద్) అనే పేరు పెట్టాలని కూడా ఆ అమ్మాయి సూచించింది.

‘మిమ్మల్ని రియల్ హీరోస్ ఆఫ్ ఇండియా అని పిలవాలనుంది. మీరు ఈ ఉత్తరం చదివితే, మీ ఐక్యతనూ, సోదర భావాన్నీ చూసి మీరు గర్వపడొచ్చు’ అని అకీదత్ తన లేఖలో రాసింది.

పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఉన్న నేషనల్‌ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అకీదత్ తండ్రి అహ్మద్ నవీద్ ఆ లేఖను బీబీసీతో పంచుకున్నారు. ఆ అమ్మాయిని అంతలా కదిలించిన ఆ కథనాన్ని మీరూ చదవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు