అఫ్ఘానిస్తాన్‌లో బీబీసీ రిపోర్టర్ హత్య

  • 30 ఏప్రిల్ 2018
అహ్మద్ షా
చిత్రం శీర్షిక అహ్మద్ షా

అఫ్ఘానిస్తాన్‌లోని ఖోస్త్ ప్రావిన్స్‌లో బీబీసీ అఫ్ఘాన్ రిపోర్టర్ అహ్మద్ షా హత్యకు గురయ్యారు.

కాబూల్‌లో సోమవారం ఉదయం జరిగిన వేర్వేరు పేలుళ్లలో ఎనిమిది మంది పాత్రికేయులు చనిపోగా.. ఖోస్త్ ప్రావిన్స్‌లో జరిగిన మరో దాడిలో బీబీసీ రిపోర్టర్ హత్యకు గురయ్యారు.

‘‘ఈ రోజు ఉదయం బీబీసీ న్యూస్ అఫ్ఘాన్ రిపోర్టర్ అహ్మద్ షా ఓ దాడిలో చనిపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం'' అని బీబీసీ వరల్డ్ సర్వీస్ డైరెక్టర్ జేమీ ఆంగస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

29 ఏళ్ల అహ్మద్ షా బీబీసీ న్యూస్ అఫ్ఘాన్ సర్వీస్‌లో ఏడాది కాలం పై నుంచి పని చేస్తున్నారు. మంచి జర్నలిస్టుగా గుర్తింపు పొందారు.

''ఆయన మరణం దిగ్భ్రాంతికరం. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, బీబీసీ న్యూస్ అఫ్ఘాన్ న్యూస్ బృందానికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాం’’ అని జేమీ పేర్కొన్నారు.

ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి అవసరమైన సాయాన్నంతా అందిస్తున్నట్లు చెప్పారు.

అహ్మద్ షాను గుర్తు తెలియని సాయుధులు కాల్చి చంపారని ఖోస్త్ పోలీస్ చీఫ్ అబ్దుల్ హసన్ బీబీసీ అఫ్ఘాన్‌కి తెలిపారు.

ఈ హత్యకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

ఈ దాడి జరిగినపుడు అహ్మద్ షా తన సైకిల్ మీద వెళుతున్నారని స్థానికులు బీబీసీకి చెప్పారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు.

సోమవారం అఫ్ఘాన్‌లో రెండు భారీ బాంబు దాడులు జరిగాయి.

కాబూల్‌లో జరిగిన దాడిలో ఎనిమిది మంది జర్నలిస్టులు, నలుగురు పోలీసు సిబ్బంది సహా 25 మంది చనిపోయారని అంతర్గత వ్యవహారాల మంత్రి అధికార ప్రతినిధి నజీబ్ డానిష్ బీబీసీకి తెలిపారు. ఆ దాడుల్లో మరో 45 మంది గాయపడ్డారు.

కాందహార్‌ ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 11 మంది స్కూలు పిల్లలు చనిపోయారు. ఇంకా చాలా మంది గాయపడ్డారు.

జర్నలిస్టులు, రిపోర్టర్లకు అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో గత ఏడాది అఫ్ఘానిస్తాన్ మూడో స్థానంలో ఉందని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ పేర్కొంది. 2017లో మూడు వేర్వేరు దాడుల్లో తొమ్మిది మంది జర్నలిస్టులు చనిపోయారు.

జూన్‌లో బీబీసీ డ్రైవర్ మొహమ్మద్ నజీర్ కాబూల్ సెంట్రల్ సక్యూర్ జోన్‌లో జరిగిన ఒక బాంబు దాడిలో చనిపోయారు.

ఆ దాడిలో 150 మందికి పైగా చనిపోగా దాదాపు 400 మంది గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)