హెచ్1బీ వీసాలపై ట్రంప్ నిర్ణయంతో అమెరికాలోని భారతీయ మహిళల్లో కలవరం

  • 4 మే 2018
ప్రియా చంద్రశేఖరన్ Image copyright BBC/IramAbbasi

‘‘ఇక నన్ను ఇంటి దగ్గరే ఉండమని చెప్తారేమో. మళ్లీ డిప్రెషన్‌ రోజుల్లోకి వెళ్లిపోతానని చాలా భయంగా ఉంది. నా భర్త రోజంతా ఉద్యోగంలో ఉంటాడు. నేను రోజంతా చేయటానికి ఏమీ ఉండదు. నా భర్త కోసం ఎదురు చూస్తూ దిగులుగా గడపాల్సి వస్తుంది’’ అని ప్రియా చంద్రశేఖరన్ బీబీసీకి చెప్పారు.

ఆమె ఉద్యోగ జీవితం ఇప్పుడు ప్రమాదంలో పడింది. కారణం.. అమెరికాలో హెచ్1బి వీసాదారుల భార్యలు/భర్తలు ఉద్యోగం చేసుకోవటానికి అనుమతులను రద్దు చేయనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించటమే.

ప్రియా చంద్రశేఖరన్ దిల్లీ నుంచి వచ్చారు. తండ్రి చనిపోయాక , 19 ఏళ్ల వయసు నుంచే ఉద్యోగం చేయటం మొదలుపెట్టారు. గత రెండేళ్లుగా ఆమె వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటిల్‌ నగరంలో సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ (సీపీఏ)గా పనిచేస్తున్నారు.

దిల్లీలో ఆమె 19 ఏళ్లకే స్వతంత్రంగా పనిచేయటం ప్రారంభించారు. తన భర్తతో కలిసివుండటం కోసం 2010లో అమెరికా రావడానికి తన ఉజ్వల కెరీర్‌ను వదులుకోవటం ఆమెను చాలా బాధించింది.

ఐదేళ్ల పాటు ఏ పనీ చేయకుండా ఇంట్లో కూర్చున్నారు. ఒక బిడ్డను కూడా కన్నారు. అయితే 2015లో బరాక్ ఒబామా ప్రవేశపెట్టిన కొత్త విధానంతో ఆమె ఉద్యోగం చేయటానికి అనుమతి లభించింది.

Image copyright BBC/IramAbbasi

కొంత డబ్బు, సమయం వెచ్చించి సీపీఏ విద్యాభ్యాసం పూర్తిచేశాక 2016లో ఆమెకు ఒక ఉద్యోగం దొరికింది. ప్రియా దంపతులు ఆ ఏడాదే ఒక ఇల్లు కూడా కొనుక్కోగలిగారు. ఆదాయం తగినంత ఉండటంతో మరో బిడ్డను కనాలని 2017లో నిర్ణయించుకున్నారు.

కానీ.. ఆమె ప్రణాళిక, ఆదాయం అన్నీ ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి.

‘‘మా ప్రయాణం సంతోషంగా సాగుతోందని మేమనుకున్నాం. కానీ.. సముద్రంలో మా నౌక ఇకపై సాఫీగా సాగదని ఇప్పుడు తెలిసింది. నా ఉద్యోగ అనుమతి పోయిందంటే.. నాకు మళ్లీ గడ్డుకాలమే’’ అని ప్రియా చెప్పారు.

ఒబామా ప్రభుత్వం 2015లో అమలులోకి తెచ్చిన హెచ్-4 ఈఏడీ రూల్‌ లక్ష్యం.. ఉన్నతస్థాయి నైపుణ్యాలున్న విదేశీయులు, వారి కుటుంబాలు అమెరికాలోనే ఉండేలా చూడటం. అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతించే ‘గ్రీన్ కార్డ్’ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి.. అది అందటంలో చాలా జాప్యం జరుగుతున్న నేపథ్యంలో.. వారి భార్య/భర్తలు ఉద్యోగాలు చేసుకోవటానికి ఈ రూల్ అమలులోకి తెచ్చారు.

ఈ ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) కార్డునే ‘వర్క్ పర్మిట్‌’గా వ్యవరిస్తుంటారు. దీనిద్వారా.. అమెరికా పౌరులు కాని వారు ఆ దేశంలో ఉద్యోగం చేయటానికి తాత్కాలిక అనుమతి లభిస్తుంది. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ఈ పత్రాన్ని జారీ చేస్తుంది.

‘గ్రీన్ కార్డ్’ అని వ్యవహరించే పర్మనెంట్ రెసిడెంట్ కార్డు ద్వారా అమెరికాలో శాశ్వత నివాసానికి, ఉద్యోగం చేయటానికి అనుమతి లభిస్తుంది.

Image copyright Getty Images

యూఎస్‌సీఐఎస్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్నా అమెరికా సెనెటర్ చక్ గ్రాస్లీకి రాసిన లేఖలో.. ''ఉద్యోగ అనుమతులకు అర్హులైన విదేశీయుల (జాబితా) నుంచి హెచ్-4పై ఆధారపడ్డ జీవితభాగస్వాములను తొలగించడం కోసం నిబంధనలను మార్చటానికి మేం ప్రణాళికలు రూపొందిస్తున్నాం. తద్వారా.. ఇలాంటి అనుమతులు ఇచ్చిన 2015 తుది నిబంధనను రద్దు చేస్తాం'' అని పేర్కొన్నారు.

ఒబామా హయాం నాటి ఈ రూల్‌ను రద్దు చేయాలన్న నిర్ణయం.. ఉద్యోగ అనుమతులున్న 70,000 మందికి పైగా గల హెచ్-4 వీసాదారులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. హెచ్1బి వీసాదారుల భార్యలు/భర్తలకు హెచ్-4 ఈఏడీ జారీచేస్తారు. ఇటువంటి వారిలో అత్యధికులు (కనీసం 93 శాతం మంది) భారతదేశానికి చెందిన ఉన్నత విద్యావంతులైన మహిళలే ఉన్నారు.

ఈ రద్దు నిర్ణయం జూన్‌లో అమలులోకి వస్తుందని భావిస్తున్నారు. ఇది అమలైతే.. తమ భర్తలను అనుసరిస్తూ అమెరికా వచ్చిన వేలాది మంది భారతీయ మహిళలు.. వారికి తగిన నైపుణ్య అర్హతలు ఉన్నా, మార్కెట్‌లో డిమాండ్ ఉన్నా.. ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుంది.

అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్.. అమెరికన్ల ఉద్యోగాలు కాపాడేందుకు వలసలపై వేటు వేస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ చర్య వల్ల ప్రభావితమయ్యే వేలాది మంది భారతీయ మహిళల్లో రేణుకా శివరంజన్ ఒకరు. ముంబైకి చెందిన ఆమె 2003లో ఎల్1 వీసాతో టెక్ పరిశ్రమలో పనిచేయటానికి అమెరికా వచ్చారు. అప్పటి నుంచీ ఇక్కడే నివసిస్తున్నారు.

Image copyright Getty Images

ఆమెకు 2006లో పెళ్లయింది. 2007లో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఆ జంట గుర్తించారు. ఆ సమయంలో వారిద్దరూ అమెరికాలో వేర్వేరు నగరాల్లో నివసిస్తున్నారు.

తాను గర్భిణిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండటం కన్నా భర్తతో కలిసి ఉండటం మంచిదని భావించిన ఆమె ఆయన దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

అంటే.. ఆమె తనకు ఇష్టమైన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ ఉద్యోగం వదులుకుంటే ఎల్1 వీసా కూడా వదులుకోవాలి. (ఎల్1 వీసా కింద వచ్చేవారు.. ఏ సంస్థలో ఉద్యోగానికి వచ్చారో ఆ సంస్థ ఉద్యోగంలోనే ఉండాలి. ఉద్యోగం మారటానికి వీలులేదు.) ఫలితంగా ఆమె హెచ్-4 స్పౌజ్ వీసాతో భర్తతో కలిసి నివసిస్తున్నారు.

‘‘హెచ్4 వీసా మీద ఉద్యోగం చేయటానికి నాకు అనుమతిలేదు. నేను ఉద్యోగం చేస్తున్నపుడు నాకున్న గుర్తింపును, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కోల్పోతానని ఆ సమయంలో నాకు అర్థం కాలేదు. తెలిసిన తర్వాత చాలా కుంగిపోయాను. నాలోని సృజనాత్మకతను సజీవంగా ఉంచుకోవటానికి ఏదో ఒకటి చేస్తుండేదానిని. బ్లాగ్‌లు రాయటం మొదలుపెట్టాను. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. లోకల్ కమ్యూనిటీ కాలేజీలో ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరాను. తద్వారా కొత్త గుర్తింపు లభించింది. జీవితానికి ఓ అర్థం దొరికింది’’ అని రేణుక వివరించారు.

ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్న కాలిఫోర్నియాలోని ఫ్రెమాంట్ నగరంలో 2015లో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు. ఆమె పిల్లలిద్దరికీ - ఒకరి వయసు ఆరేళ్లు, మరొకరి వయసు పదేళ్లు - సాకర్ అంటే చాలా ఇష్టం. లోకల్ సాకర్ క్లబ్‌లో శిక్షణ కూడా పొందుతున్నారు.

Image copyright Getty Images

ఆమె ఇప్పుడు బే ఏరియాలో సొంతగా ఫ్యామిలీ చైల్డ్ కేర్ బిజినెస్ నడుపుతున్నారు. ఆమె వ్యాపారం విస్తరించేకొద్దీ ఆమెకు మరింత విశాలమైన స్థలం అవసరమైంది. దీంతో వారు 2016 మొదట్లో పెద్ద ఇల్లు కొన్నారు. ఆమె ఇప్పుడు 16 మంది పిల్లలకు సేవలు అందిస్తున్నారు. ముగ్గురు టీచర్లను ఉద్యోగులుగా పెట్టుకున్నారు.

‘‘నా బిజినెస్‌ నా కుటుంబానికి ఉపయోగపడుతోంది. ఇంటి కోసం చేసిన అప్పు కట్టటానికి దోహదపడుతుంది. అమెరికా పౌరులైన మా పిల్లలకు నాణ్యమైన జీవితాన్ని అందించేందుకు వీలుకల్పిస్తుంది. ఇండియాలో రిటైరైన మా తల్లిదండ్రులు, అత్తమామలకు కూడా సాయం అందించగలుగుతున్నాం. నా ఈ ఆదాయాన్ని కోల్పోతే.. ఇంటి అప్పు కట్టటం చాలా కష్టమవుతుంది. ఇంటి అప్పు కట్టాలా? పిల్లల సాకర్ శిక్షణ కొనసాగించాలా? అనేది నిర్ణయించుకోవాల్సి వస్తుంది’’ అని ఆమె చెప్పారు.

‘‘ఇది నా ఒక్కదాని మీదే కాదు.. నా ప్రోగ్రామ్ మీద ఆధారపడి ఉన్న 16 మంది పిల్లలు, వారి కుటుంబాల మీద కూడా ప్రభావం చూపుతుంది. ఈ కుటుంబాలన్నీ వారి పిల్లల సంరక్షణ కోసం ప్రత్యామ్నాయాలను వెదుక్కోవాల్సి వస్తుంది. నా ప్రోగ్రామ్‌లో పనిచేస్తున్న ముగ్గురు టీచర్లు వారి ఉద్యోగాలు కోల్పోతారు...’’ అని రేణుక వివరించారు.

Image copyright Getty Images

ట్రంప్ సర్కారు నిర్ణయం హెచ్1బి వీసాదారులకు ఆశ్చర్యం కలిగించలేదు. 2017 ఏప్రిల్‌లో ‘బై అమెరికన్ - హైర్ అమెరికన్’ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (అమెరికావే కొను - అమెరికా వారినే నియమించు ఉత్తర్వు) జారీ అయినప్పటి నుంచీ హెచ్1బి ప్రపంచం చాలా మారిపోయింది. ఆ క్రమంలోనే ఈ నిర్ణయం మరో సమ్మెట దెబ్బ.

ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మానవ హక్కుల కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు. ఈ విధానాన్ని ఉపసంహరించుకునేలా ట్రంప్ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటం కోసం భాగస్వాములు, విధాన రూపకర్తలతో చర్చలు జరుపుతున్నారు.

‘‘ఇంటికి సాయం చేస్తున్న హెచ్-4 స్పౌజ్ గల లక్షకు పైగా కుటుంబాలకు ఇది గొడ్డలి పెట్టు అవుతుంది. మహిళలు తీవ్రంగా దెబ్బతింటారు. హెచ్1బి వీసాదారుల్లో భారతీయులే అధికంగా ఉన్నారు. కాబట్టి భారతీయ కుటుంబాలకు ఈ దెబ్బ వినాశకరమే అవుతుంది’’ అని వాషింగ్టన్ డీసీలో గల హిందూ అమెరికన్ ఫౌండేషన్ డైరెక్టర్ జే కన్సారా పేర్కొన్నారు.

‘‘అమెరికాలో ఇటువంటి ఉన్నతస్థాయి నైపుణ్యాలు గల కార్మికుల కొరత ఉన్న నేపథ్యంలో టెక్ పరిశ్రమ కూడా ప్రభావితమవుతుంది. ఉన్నత నైపుణ్యాలు గల ఉద్యోగులు, వారి కుటుంబాలను ఆకర్షించటం ఆ రంగంలోని వారికి కష్టమవుతుంది. దానివల్ల అంతర్జాతీయంగా అమెరికా పోటీ శక్తిని తగ్గుతుంది. పెట్టుబడులకు, ఉన్నత నైపుణ్యం గల వలసదారులకు ఇతర దేశాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి’’ అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

Image copyright Getty Images

అయితే.. హెచ్-4 ఈఏడీ విధానాన్ని రద్దు చేయటం వల్ల.. హెచ్-4 స్పౌజ్ ‘లీగల్ ఇమిగ్రేషన్ స్టేటస్’ (చట్టబద్ధ వలస హోదా)లో మార్పు ఉండదు. కానీ వారు అమెరికాలో ఉద్యోగం చేయటానికి ఇక అనుమతి ఉండదు. ఈ నిర్ణయం వల్ల వేరే అంశాలు.. వారి ఆర్థిక, సామాజిక పరిస్థితి, గృహ ఆదాయం, మహిళలపై మానసిక - భావోద్వేగ ప్రభావం, అది వారి కుటుంబాలపై చూపే ప్రభావం వంటివి మారవచ్చు.

భవిష్యత్తు అయోమయం కావటంతో రేణుక రాత్రిళ్లు నిద్రపోలేకపోతున్నారు.

‘‘నా హెచ్4 ఈఏడీని రద్దు చేస్తే.. నేను ఇప్పుడు వ్యాపారవేత్త స్థాయి నుంచి మళ్లీ భర్తపై ఆధారపడిన మహిళగా చీకటి రోజుల్లోకి వెళ్లిపోతానని ఆందోళనగా ఉంది. మళ్లీ కుంగిపోతానని భయంగా ఉంది. నా వ్యాపారం కోసం గత కొన్నేళ్లుగా నేను వెచ్చించిన సమయం, శ్రమ, డబ్బు అంతా వృధా అవుతుంది. గ్రీన్ కార్డు జారీకి బ్యాక్‌లాగ్ జాబితా చాలా భారీగా ఉంది. నేను మళ్లీ ఎప్పుడు పని చేయగలననేది తెలియదు. 2023 నాటికి ఆ అవకాశం రావచ్చని ప్రస్తుత అంచనాలు చెప్తున్నాయి. అప్పుడు మళ్లీ మొదటి నుంచీ ఆరంభించి జీవితాన్ని నిర్మించుకునే శక్తి, ఉత్సాహం నాకు ఉండవని ఆందోళనగా ఉంది. అయినా అప్పటి వరకూ నేనేం చేయాలి?’’ అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

రఫేల్ వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు: "ఒప్పందంపై విచారణలో కోర్టు జోక్యం అవసరం లేదు... డీల్ కేటాయింపులో పక్షపాతం కనిపించట్లేదు"

మంకీ డస్ట్: బ్రిటన్‌ పట్టణ ప్రాంతాలలో జనానికి పిచ్చెక్కిస్తున్న చీప్ డ్రగ్

ట్రంప్‌కు సెనేట్‌లో చుక్కెదురు: సౌదీకి అమెరికా సైనిక సాయం ఆపేయాలని తీర్మానం

ఒక భార్య, ఇద్దరు భర్తలు... ఆమె జీవితమే ఒక సినిమా

ప్రెస్ రివ్యూ: 'మోదీ ఆ ముగ్గురినీ నా మీదకు ఎగదోస్తున్నారు': చంద్రబాబు

హిందుత్వ అజెండా గురి తప్పిందా.. అందుకే బీజేపీ ఓడిందా...

థెరెసా మే: విశ్వాస పరీక్షలో నెగ్గిన బ్రిటన్ ప్రధాని

'జాత్యహంకార' గాంధీ విగ్రహాన్ని తొలగించిన ఘనా యూనివర్శిటీ