కేంబ్రిడ్జ్ అనలటికా మూసివేత!

  • 3 మే 2018
లండన్ ఆఫీస్‌లో కేంబ్రిడ్జ్ పేరును తొలగించిన ఆ సంస్థ Image copyright Reuters
చిత్రం శీర్షిక లండన్ ఆఫీస్‌లో కేంబ్రిడ్జ్ పేరును తొలగించిన ఆ సంస్థ

ఇటీవల ఫేస్‌బుక్ డేటా కుంభకోణం వ్యవహారంలో కేంద్రబిందువైన కేంబ్రిడ్జ్ అనలిటికా మూతబడింది.

రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ నాయకుల కోసం ఈ సంస్థ ఫేస్‌బుక్ యూజర్ల డేటాను దుర్వినియోగం చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది.

ఫేస్‌బుక్ చెబుతున్న వివరాల మేరకు.. 8.7 కోట్ల మందికి సంబంధించిన వివరాలను కేంబ్రిడ్జ్ అనలిటికా ఓ క్విజ్ యాప్ ద్వారా సేకరించి.. దాన్ని రాజకీయ సలహా సంస్థకు చేరవేసినట్లు ఆరోపణు వచ్చాయి.

దీన్ని తీవ్రంగా పరిగణించిన ఫేస్‌బుక్ ఈ అంశంపై దర్యాప్తును కొనసాగిస్తోంది.

‘‘ఈ వివాదంలో అసలు ఖచ్చితంగా ఏం జరిగిందో తెలుసుకునేందుకు తాజా పరిణామం అడ్డురాదు. ఇలాంటివి మళ్లీ జరుగకుండా సరైన చర్యలు తీసుకుంటాం...’’ అని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి తెలిపారు.

సంబంధిత సంస్థలు, అధికారులతో కలిసి ఈ దర్యాప్తును కొనసాగిస్తున్నామని చెప్పారు.

Image copyright Getty Images

కేంబ్రిడ్జ్‌ అనలిటికాపై వచ్చిన ఆరోపణలేంటి?

డొనాల్డ్ ట్రంప్‌ను అమెరికా అధ్యక్షుడిని చేసిన 2016 ఎన్నికలను, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని తీర్పు ఇచ్చిన ప్రజాభిప్రాయ సేకరణను.. ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’ అనే సంస్థ ఫేస్‌బుక్ యూజర్ల సమాచారాన్ని వినియోగించుకుని ‘ప్రభావితం చేసింద’న్న బలమైన ఆరోపణలు వచ్చాయి.

ఈ సంస్థలో భాగంగా ఉన్న భారతీయ సంస్థ ఎస్‌సీఎల్ ఇండియా కూడా 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ‘మిషన్ 272 ప్లస్’కు సాయం చేశామని చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా తమ క్లైంట్ల జాబితాలో ఉన్నట్లు వెబ్‌సైట్‌లో పేర్కొంది.

రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ కేంబ్రిడ్జ్ ఎనలిటికా.. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు 5 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల వ్యక్తిగత వివరాలను వాడుకుందన్న ఆరోపణలను ఎదుర్కొంటోంది.

ఈ ఆరోపణల నేపథ్యంలో కేంబ్రిడ్జ్ అనలిటికా సీఈవో అలెగ్జాండర్ నిక్స్‌ను మార్చిలో సస్పెండ్ చేశారు.

ఈ సంస్థకు అమెరికాలోని బిలియనీర్ రాబర్ట్ మెర్స్ పెట్టబడులు సమకూర్చారు.

గార్డియన్ పత్రిక చెబుతున్న ప్రకారం ఆయన ఈ సంస్థలో 1.5 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టారు.

Image copyright Getty Images

వివాదం టైమ్‌లైన్ ఇదీ...

మార్చి 17: కేంబ్రిడ్జ్ అనలిటికా 5 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల డేటాను దుర్వినియోగం చేసిందని పేర్కొంటూ ఆ సంస్థ మాజీ ఉద్యోగి క్రిస్టోఫర్ వెల్లడించిన వివరాలను ద అబ్జర్వర్, న్యూయార్క్ టైమ్స్‌ పత్రికలు ప్రచురించాయి.

మార్చి 23: ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన బ్రిటన్‌.. కేంబ్రిడ్జ్ కార్యాలయంలో సోదాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.

మార్చి 27: క్రిస్టోఫర్ బ్రిటన్ ఎంపీల కమిటీ ముందు హాజరయ్యారు.

ఏప్రిల్ 4: 8.7 కోట్ల మంది డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా దుర్వినియోగం చేసిందని ఫేస్‌బుక్ ఆరోపించింది.

ఏప్రిల్ 10: ఈ వ్యవహారంలో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌‌బర్గ్‌ని అమెరికా చట్ట సభ ప్రశ్నించింది.

ఏప్రిల్ 17: బ్రిటిష్ ఎంపీల ముందు హాజరుకావడానికి అలెగ్జాండర్ నిక్స్ నిరాకరించారు.

ఏప్రిల్ 26: పలు ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోవడంతో బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ జుకర్‌బర్గ్‌కి తమ ముందు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది.

మే 2: కేంబ్రిడ్జ్ అనలిటికా మూతపడింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.