పోర్న్ స్టార్‌ నోరు మూయించడానికి ట్రంప్ లక్షా 30 వేల డాలర్లు చెల్లించారు: ట్రంప్ న్యాయవాది

  • 3 మే 2018
ట్రంప్ Image copyright Reuters

పోర్న్ స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌కూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మధ్య 'అఫైర్' విషయంలో కొనసాగుతున్న వివాదం ఓ కీలక మలుపు తీసుకుంది. ట్రంప్ లీగల్ టీంలోని ఓ న్యాయవాదే ఆయనకు వ్యతిరేకంగా సంచలన ప్రకటన చేశారు.

స్టార్మీ డేనియల్స్‌కు చెల్లించారని చెబుతున్న లక్షా 30 వేల డాలర్లు మరెవరివో కాదనీ, ట్రంప్ తరఫున ఇచ్చినవేననీ న్యాయవాది రూడీ గియూలియానీ చెప్పారు.

ఆ పోర్న్ స్టార్‌కు మొదట మైకేల్ కోహెన్ డబ్బు చెల్లించారనీ, ఆ తర్వాత ట్రంప్ ఆయనకు ఆ డబ్బు చెల్లించారని న్యూయార్క్ మాజీ మేయర్ గియూలియానీ తెలిపారు.

తనకు ఈ చెల్లింపుల వ్యవహారం గురించి ఏమీ తెలియదని ట్రంప్ చెబుతూ వస్తున్నారు. అయితే ఆ పోర్న్ స్టార్‌తో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమేనని ఆయన ఇటీవలే అంగీకరించారు.

ట్రంప్‌తో తన శృంగార వ్యవహారాల గురించి ఎక్కడా నోరు మెదపకుండా ఉండటానికి గాను తనకు డబ్బు చెల్లించినట్టు స్టార్మీ డేనియల్స్ చెబుతున్నారు.

ట్రంప్ లీగల్ టీం సభ్యుడైన గియూలియానీ ఇటీవలే ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ, "ఆయన ఒక లీగల్ ఫర్మ్ ద్వారా ఆమెకు డబ్బు పంపించారు. ఆ తర్వాత ట్రంప్ ఆ డబ్బు ఆయనకు చెల్లించారు" అని చెప్పారు.

చాలా నెలల తర్వాత ట్రంప్ ఈ డబ్బు చెల్లించారని కూడా ఆయన చెప్పారు.

Image copyright Reuters

మరి ఈ చెల్లింపు గురించి ట్రంప్‌కు సమాచారం ఉందా?

ఈ చెల్లింపు సక్రమంగా జరిగిందనీ, ఈ డబ్బు ఎన్నికల ప్రచారానికి నిర్దేశించిన ఫండ్ లోంచి తీసింది కాదని కూడా గియూలియానీ అన్నారు.

గియూలియానీ చేసిన ఈ సంచలన ప్రకటన తర్వాత అమెరికాలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటుందని స్టార్మీ డేనియల్స్ తరఫు న్యాయవాది మైకేల్ ఎవేనాటీ అన్నారు.

లక్షా 30 వేల డాలర్ల చెల్లింపు విషయంలో ట్రంప్ అమెరికా ప్రజలకు అబద్ధం చెప్పారని మేం నెల రోజుల క్రితమే చెప్పాం. ట్రంప్‌కు ఈ చెల్లింపు వ్యవహారం గురించి పూర్తిగా తెలుసు" అని ఆయన అన్నారు.

ట్రంప్ తరఫు న్యాయవాది మైకేల్ కోహెన్ మొదట అసలు ఆమెకు ఎలాంటి చెల్లింపూ చేయలేదని అన్నారు. ఆ తర్వాత ఆయన 2016లో తన వ్యక్తిగత ఫండ్‌లోంచి రహస్యంగా డేనియల్స్‌కు డబ్బు చెల్లించినట్టు అంగీకరించారు.

అయితే ఈ చెల్లింపు వ్యవహారం గురించి ట్రంప్‌కు సమాచారం లేదని కోహెన్ చెప్పుకొచ్చారు.

Image copyright Reuters

ఈ చెల్లింపు వ్యవహారం గురించి ట్రంప్‌కు గానీ, ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమ నిర్వాహకులకు గానీ ఏమీ తెలియదని 'ద న్యూయార్క్ టైమ్స్‌'కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కోహెన్ అన్నారు. తనకు ఆ డబ్బు ఎవరూ వాపస్ చేయలేదని కూడా ఆయన చెప్పారు.

2006లో తాను ట్రంప్‌తో సెక్స్ చేశానని పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ అంటున్నారు. ఈ విషయంలో నోరు విప్పకుండా ఉండడానికి తనకు డబ్బు ముట్టినట్టు కూడా ఆమె చెబుతున్నారు.

ఈ సంవత్సరం మార్చి నెలలో స్టార్మీ డేనియల్స్ ప్రెసిడెంట్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఒక కేసు పెట్టారు. తాను నోరు మెదపకుండా ఉండడం కోసం చేసుకున్న ఒప్పందం అక్రమమనీ, ఎందుకంటే దానిపై ట్రంప్ సంతకం లేదనీ ఆమె వాదించారు.

ఆ తర్వాత కోర్టులో ట్రంప్ అఫిడవిట్‌పై సాక్ష్యం చెప్పాలనే ఆమె డిమాండ్‌ను తోసిపుచ్చారు.

స్టార్మీ డేనియల్స్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై డేనియల్స్ రెండు కోట్ల డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కూడా ట్రంప్ తరఫు న్యాయవాదులు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు