సర్రే జట్టు తరఫున కౌంటీ క్రికెట్‌లో ఆడనున్న విరాట్

  • 3 మే 2018
విరాట్ Image copyright Michael Dodge/GettyImages

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వచ్చే జూన్ నెలలో సర్రే టీంలో సభ్యుడిగా ఆడతాడని ఆ క్రికెట్ క్లబ్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆ నెలంతా ఆయన సర్రే పోటీ పడే మ్యాచుల్లో పాల్గొంటారని ఆ జట్టు తెలిపింది.

29 ఏళ్ల విరాట్ ఈసారి కౌంటీల్లో పాల్గొనబోతున్న నాల్గవ భారతీయ క్రికెటర్. చేతేశ్వర్ పుజారా ప్రస్తుతం యార్క్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకోగా, సీమర్లు ఇషాంత్ శర్మ, వరుణ్ అరోన్‌లు ససెక్స్, లీసెస్టర్‌షైర్ జట్ల తరఫున ఆడనున్నారు.

2017లో కోహ్లి ప్రతిష్ఠాత్మక ఐసీసీ వరల్డ్ క్రికెటర్ ఆఫ్ ఇయర్ - సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ గెల్చుకున్నారు. అంతర్జాతీయ పోటీల్లో మూడు ఫార్మాట్లలో కలిపి ఆయన సగటు 50 పరుగులకన్నా ఎక్కువ ఉంది.

2011లో తొలి టెస్ట్ ఆడిన విరాట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా 53.40 సగటుతో ఇప్పటి వరకు మొత్తం 5554 పరుగులు సాధించాడు. ఇక వన్డేల్లో అతడి యావరేజ్ 58.10 కాగా, ఇప్పటి వరకు సాధించిన మొత్తం పరుగుల సంఖ్య 9588.

Image copyright Getty Images

2014-15లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కోహ్లి మొత్తం 34 టెస్ట్ మ్యాచ్‌లకు నేతృత్వం వహించగా 21 మ్యాచ్‌లలో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

2017లో కోహ్లి విజ్డెన్ లీడింగ్ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. ఐసీసీ టెస్ట్ జట్టు, వన్డే జట్టుకు కూడా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

సర్రే క్లబ్ తరఫున సంతకం చేశాక విరాట్ కోహ్లి మాట్లాడుతూ, "కౌంటీ క్రికెట్ ఆడాలన్నది నా చిరకాల వాంఛ. 2018 సీజన్‌లో నాకు ఈ అవకాశం కల్పించినందుకు అలెక్ స్టీవర్ట్‌కూ, సర్రే జట్టుకూ ధన్యవాదాలు. నేను త్వరలోనే కియా ఓవల్ (సర్రే జట్టు పురిటిగడ్డ) చేరుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాను" అని చెప్పారు.

మరోవైపు, క్రికెట్ ప్రపంచంలో బాగా పేరుగాంచిన వ్యక్తి జూన్ నెలలో తమ జట్టులో ఆడబోతున్నందుకు ఉత్సాహంగా ఉందంటూ సర్రే జట్టు డైరెక్టర్ అలెక్ స్టీవర్ట్ పేర్కొన్నారు.

"విరాట్‌ పక్కన ఆడటం, ఆయనతో కలిసి శిక్షణలో పాల్గొనడం మా కుర్రాళ్లకు ఓ గొప్ప అనుభవంగా ఉండబోతోంది. ఆయన నుంచి మా వాళ్లు నేర్చుకునేందుకు ఇది మంచి అవకాశం" అని స్టీవర్ట్ అన్నారు.

"కౌంటీ క్రికెట్ భవిష్యత్తు గురించి బాగా చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో విరాట్ వంటి ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ పోటీల్లో పాల్గొనడం ద్వారా దీనికి మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. దీంతో ప్రతి కౌంటీకి ప్రయోజనం కలుగుతుంది" అని స్టీవర్ట్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)