సెక్స్ ఎడిక్షన్: ‘రోజుకి ఐదుసార్లు కూడా సరిపోయేది కాదు’

  • 4 మే 2018
రెబెకా

సెక్స్ ఎడిక్షన్ గురించి నిపుణులు ఒక్కొక్కరూ ఒక్కో మాట చెబుతారు. కానీ ఆ సమస్య బారిన పడ్డవాళ్లు మాత్రం దానివల్ల తమ జీవితాలు నాశనమయ్యాయని అంటారు.

అలా శృంగారానికి బానిసలైన వాళ్లు దాని గురించి బయటికి చెప్పుకోలేరు. అలాగని కోరికలను అదుపులోనూ ఉంచుకోలేరు.

గతంలో రెబెకా బార్కర్ అనే మహిళ కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ‘సెక్స్ ఎడిక్షన్’ తన జీవితాన్ని నాశనం చేసిందనీ, ఆత్మీయులను దూరం చేసిందనీ ఆమె చెబుతున్నారు.

‘సెక్స్ కోసం నా భాగస్వామిని నిత్యం వేధించేదాన్ని. ఒక దశలో రోజులో ఐదుసార్లు సెక్స్ చేసినా కూడా సరిపోయేదు కాదు.

ఉదయం లేవగానే నాకు మొదట గుర్తొచ్చేది అదే. ఎంత ప్రయత్నించినా ఆ ఆలోచనలు నా నుంచి దూరమయ్యేవి కాదు. ఏ పని చేసినా అదే గుర్తొచ్చేది. నా శరీరం మొత్తం దాన్నే కావాలని కోరుకుంటున్నట్లు అనిపించేది. ఓ రకంగా అది నాలో డిప్రెషన్‌కు దారితీసింది.

శృంగారంలో పాల్గొన్న కాసేపటికే మళ్లీ ఆ ఆలోచనలు మొదలయ్యేవి. సిగ్గుతో ఇంట్లోంచి బయటకు కూడా వచ్చేదాన్ని కాదు. బయట కూడా అవే ఆలోచనలు వస్తాయేమోనని భయమేసేది.

నా మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయన్నది ఎదుటివాళ్లకు తెలిసే అవకాశం లేకపోయినా, మనుషుల మధ్య ఉండటం కాస్త అసౌకర్యంగా అనిపించేది’ అంటూ తన గతానుభవాలను వివరిస్తారు రెబెకా.

Image copyright Rebecca
చిత్రం శీర్షిక గతంలో రెబెకా కూడా సెక్స్ ఎడిక్షన్ బాధితురాలే

ఈ సమస్య కారణంగా రెబెకాకూ, ఆమె భాగస్వామికీ మధ్య దూరం పెరిగిపోయింది. మొదట్లో ఆమె భాగస్వామి కూడా రెబెకా సాన్నిహిత్యాన్ని ఆస్వాదించేవాడు. కానీ రానురానూ అది మితిమీరుతున్న భావన అతడిలో పెరిగిపోయింది.

కొన్నాళ్ల తరవాత అతడిలో అనుమానాలు మొదలయ్యాయి. రెబెకాకు వేరే వ్యక్తితో సంబంధం ఉందనీ, తప్పు చేసిన భావనను దూరం చేసుకునేందుకు ఆమె పదేపదే సెక్స్‌ను కోరుకుంటోందనీ అతడు భావించేవాడు.

ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు రెబెకా కొన్నాళ్లు తన తల్లి దగ్గరకు వెళ్లిపోయారు.

"నేను కాస్త కుదుటపడేవరకూ మా అమ్మ దగ్గర ఉంటానని చెప్పాను. తను కూడా సరేనన్నాడు. కానీ ఆ తరవాత అతడు మళ్లీ నా దగ్గరకు రాలేదు. మా బంధం అక్కడితో తెగిపోయింది. కొన్నాళ్లు సైకియాట్రిస్ట్ దగ్గర చికిత్స తీసుకున్నా. డాక్టర్ తరచూ నా మందులు మార్చేవారే తప్ప సరైన పరిష్కారం సూచించేవారు కాదు."

చివరికి నేనే నా జీవనశైలిలో అనేక మార్పులు చేసుకున్నా. ఆ డిప్రెషన్‌ నుంచీ, కోరికల నుంచీ బయటపడటానికి చాలా ప్రయత్నాలు చేశా. రకరకాల వ్యాపకాలను పెంచుకున్నా. అవన్నీ ఫలించడంతో క్రమంగా నా సమస్య దూరమైంది’ అని తాను సెక్స్ ఎడిక్షన్ నుంచి బయటపడ్డ విధానాన్ని రెబెకా వివరించారు.

గ్రాహం (పేరు మార్చాం) అనే మరో వ్యక్తి కూడా గతంలో తాను శృంగారానికి బానిసగా మారిన తీరును గుర్తు చేసుకున్నారు. తన కోరికలను తీర్చుకోవడానికి వందలాది సెక్స్ వర్కర్లతో శృంగారంలో పాల్గొన్నట్లు, తన భార్యను మోసం చేసినందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నట్లు ఆయన చెప్పారు.

‘అదొక భయంకరమైన అనుభవం. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేవరకూ అదే ధ్యాస. ఆ స్థితి జీవితాన్ని నాశనం చేస్తుంది’ అని ఆయన అన్నారు.

Image copyright Getty Images

తన కోరికలు తీర్చుకోవడానికి ఎన్నో ఏళ్ల పాటు లక్షల రూపాయలను ఖర్చు చేసినట్టు ఆయన చెప్పారు.

‘‘ఈ సమస్య వల్ల అనేక అక్రమ సంబంధాలు పెట్టుకోవాల్సి వచ్చింది. ఒకరితో సంబంధం పెట్టుకోగానే మరొకరు కావాలనిపించేది. ఇది కూడా మద్యానికి బానిసగా మారడం లాంటిదే. ‘ఇంకెప్పుడూ ఈ పని చేయకూడదు’ అని చాలాసార్లు అనుకునేవాణ్ణి. కానీ కథ మళ్లీ మొదటికొచ్చేది’’ అంటారాయన.

కానీ ఓసారి అతడి భార్యకు విషయం తెలిసి ఆరా తీయడం మొదలుపెట్టాక గ్రాహంకు మారక తప్పలేదు.

‘సెక్స్ ఎడిక్ట్స్ ఎనానిమస్’ (సా) అనే సంస్థ సాయంతో తన సమస్యను దూరం చేసుకున్నట్లు గ్రాహం చెబుతారు.

‘నా భార్యకు విషయం తెలీడం మంచిదనే అనిపించింది. అలాగైనా నా అలవాటు మారుతుందనే ఆశ కలిగింది. ‘సా’లో నాలాంటి వాళ్లను చాలామందిని చూశాక నాకు కాస్త ఊరట లభించింది. ఇలాంటి సమస్యతో బాధపడేవారికి నేను చెప్పేది ఒక్కటే.. సాయం చేయడానికి చాలామంది ఉన్నారు, ముందు మారాలన్న ప్రయత్నం మీలో మొదలవ్వాలి’ అంటారు గ్రాహం.

Image copyright Getty Images

సెక్స్ ఎడిక్షన్ అంటే ఏంటి?

  • ‘రిలేట్’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వచణం ప్రకారం.. నియంత్రించుకోలేని శృంగార కోరికలు ‘సెక్స్ ఎడిక్షన్’ పరిధిలోకి వస్తాయి.
  • గత ఐదేళ్లలో తమ దగ్గర సేవలందించే సెక్స్ థెరపిస్టుల సంఖ్య రెట్టింపైందని ‘ది అసోసియేషన్ ఫర్ ది ట్రీట్‌మెంట్ ఆఫ్ సెక్స్ ఎడిక్షన్ అండ్ కంపల్సివిటీ’ అనే సంస్థ చెబుతోంది.
  • శృంగారానికి బానిసలుగా మారిన వారికి సాయపడేందుకు యూకేలో ఓ వెబ్‌సైట్ పనిచేస్తోంది. 2013నుంచి ఆ వెబ్‌సైట్లో 21,058మంది తమకు సాయపడాలని కోరగా అందులో 91శాతం మంది మగవాళ్లే ఉన్నారు.
  • ఆ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న వాళ్లలో 31శాతం మంది 26-35మధ్య వయసువాళ్లే.
  • మే 2019లో ‘కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్ డిజార్డర్’ను కూడా ఇతర వ్యాధుల జాబితాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేరుస్తుందని ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)