మన కోసం ఆనాడు కార్ల్ మార్క్స్ చేసిన ఐదు పనులు!

  • 5 మే 2018
కార్ల్ మార్క్స్ Image copyright Getty Images

వారాంతంలో సరదాగా గడపడమంటే మీకిష్టమా?

ప్రభుత్వ రోడ్లపై డ్రైవ్‌ చేస్తే ఎలా ఉంటుంది? లేదంటే ప్రభుత్వ లైబ్రరీకి వెళ్తే ఎలా ఉంటుంది?

అన్యాయం, అసమానత్వం, దోపిడీ అంతం కావాలని కోరుకునే వారిలో మీరూ ఉన్నారా?

మీ సమాధానం అవును అయితే, మీరూ ఈ మే 5న కార్ల్ మార్క్స్ 200వ జయంతిని జరుపుకోండి.

ఎందుకంటే ఈ సమస్యలపై మొట్టమొదట పోరాటం చేసింది కార్ల్ మార్క్సే.

Image copyright Getty Images

మార్క్సిస్ట్ విప్లవ రాజకీయాలు చాలా ప్రత్యేకమైనవని 20వ శతాబ్దానికి చెందిన చాలామంది భావిస్తారు.

సామాజిక న్యాయం, సమాజంలో తీసుకురావాల్సిన మార్పులకు మార్క్స్ ఆలోచనలు చాలా అనువైనవి. ఎంతో ప్రత్యేకమైనవి.

ఆ తర్వాత కాలంలో నిరంకుశత్వం, స్వాతంత్ర్యం లేకపోవడం, సామూహిక హత్యలు వంటివి ఆయన సిద్ధాంతాలతో ముడిపడటంతో వాటిని అనుమానంతో చూస్తున్న మాట కూడా వాస్తవమే.

అయితే ఆయన ఓ మానవతావాది, ఉన్నత లక్ష్యాలున్న నాయకుడు అన్నది నిర్వివాదం. ప్రపంచాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడంలో ఆయన ఆలోచనలు, విధానాలు ఎంతో సహాయం చేశాయి.

కార్ల్‌ మార్క్స్ కొన్ని అంశాలను చక్కగా అంచనా వేశారు. కొద్దిమంది సంపన్నులు తెరపైకి వచ్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తారని, పెట్టుబడిదారీ విధానం ప్రజలను గందరగోళానికి గురిచేస్తుందని, ఆర్థిక సంక్షోభాలు ప్రజలను దాదాపు చంపేసినంత పని చేస్తాయని ఆయన హెచ్చరించారు.

కార్ల్ మార్క్స్ మనకోసం ఇంకా ఏమేం చేశారో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి. ఆయన్ను 21వ శతాబ్దంలో కూడా ప్రజలు ఎందుకు స్మరించుకోవాలో అర్థం అవుతుంది.

Image copyright Getty Images

1. పిల్లలు పనిబాట కాదు బడిబాట పట్టాలి!

ఆధునిక ప్రపంచంలో దాదాపు అందరి ఆశ, ఆకాంక్ష ఇదే. పిల్లలు ప్రయోజకులు కావాలంటే విద్య ముఖ్యమని ఇప్పుడు ప్రపంచం గుర్తిస్తోంది.

కానీ 1848లోనే కార్ల్ మార్క్స్ ఈ విషయం గుర్తించారు. పిల్లలు పలుగు, పార పట్టకూడదు. పలకా బలపం పట్టాలని ఆనాడే చెప్పారు. 'కమ్యూనిస్టు మేనిఫెస్టో' రాసేటపుడే బాల కార్మికులు ఉండరాదని ఆయన ఆకాంక్షించారు.

కానీ ఇప్పటికీ ప్రతి పది మంది బాలలలో ఒకరు కార్మికులుగానే ఉన్నారు. 2016లో అంతర్జాతీయ కార్మిక సంఘం చెప్పిన లెక్కలివి.

అయితే, కార్ల్ మార్క్స్ పోరాటం వల్ల చాలా మంది చిన్నారులు ఫ్యాక్టరీల నుంచి పాఠశాల బాట పట్టారు. అది కార్ల్ మార్క్స్ చేసిన కృషే.

"ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలందరికీ విద్య, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అనేది కార్ల్ మార్క్స్, ఏంగెల్స్‌ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలోని పది పాయింట్లలో ఒకటి" అని 'గ్రేట్ ఎకనమిస్ట్స్: హౌ దెయిర్ ఐడియాస్ కెన్ హెల్ప్ అజ్ టుడే' పుస్తక రచయిత లిండా యూహ్ అన్నారు.

పిల్లలకు చదువుకునే హక్కు గురించి చెప్పిన వారిలో మార్క్స్, ఏంగెల్స్‌లే మొదటివారు కాదు. కానీ "ప్రాథమిక విద్య తప్పనిసరి అని 19వ శతాబ్దంలో వచ్చిన చైతన్యానికి మార్క్సిజం కూడా గొంతు కలిపింది. ప్రజల్లో వచ్చిన ఈ చైతన్యంతో చిన్నారులను ఫ్యాక్టరీల్లో పనికి పంపడం మానేశారు" అని లిండా చెప్పారు.

Image copyright Getty Images

2. మీకు ఫ్రీ టైం ఉండాలి. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీరే నిర్ణయించుకోవాలి.

ఇప్పుడు మీరు రోజుకు 24 గంటలు పనిచేయడం లేదు.

వారంలో 7 రోజులూ ఫ్యాక్టరీకి / ఆఫీస్‌కి వెళ్లడం లేదు.

డ్యూటీ మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకోవచ్చు.

రిటైర్మెంట్ తర్వాత వృద్ధాప్యంలో పెన్షన్ అందుకునే వెసులుబాటు కూడా కొందరికి ఉంటుంది.

ఈ సౌకర్యాలు మీకు సంతృప్తిని కలిగిస్తున్నాయా? మీ సమాధానం అవును అయితే, మీరు తప్పకుండా కార్ల్ మార్క్స్‌కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

"రోజంతా పనిచేసేలా మీపై ఒత్తిడి తీసుకొస్తే ఇక మీకు వ్యక్తిగత సమయం అంటూ ఏదీ ఉండదు. నీ సొంత జీవితం కూడా నీ అదుపులో ఉండదు" అని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ మైక్ సావేజ్ అన్నారు.

తమ వద్ద ఉన్న ఏకైక సంపదైన శ్రమను కార్మికులు డబ్బు కోసం అమ్ముకునేలా పెట్టుబడిదారీ వ్యవస్థ ఎలా ఒత్తిడి తీసుకొస్తుందో ఆనాడే మార్క్స్ రాశారు. పెట్టుబడిదారీ వ్యవస్థ మనుగడకు అది అవసరం.

కానీ ఇందులోనూ అసమానతలు ఉండేవి. మార్క్స్ ప్రకారం కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఉండేది కాదు. శ్రమ దోపిడీ జరిగేది. కార్మికులను మనుషులుగానే చూసేవారు కాదు. ఇది వారిని ఎంతో బాధించేది.

వారికి మరిన్ని సౌకర్యాలు కావాలని మార్క్స్ ఆకాంక్షించారు. మనం స్వతంత్రంగా, సృజనాత్మకంగా ఉండాలని భావించారు. అన్నింటికంటే ముఖ్యంగా మన సమయాన్ని మనకిష్టమైనట్లు ఉపయోగించుకునే వీలు ఉండాలని ఆయన అనేవారు.

"పనే మన జీవితం కాకూడదు. మనకంటూ వ్యక్తిగత జీవితం కూడా ఉండాలి. మనకూ ఇష్టాయిష్టాలు ఉండాలి. జీవితంలో ఏం కావాలో మనమే నిర్ణయించుకోవాలి" అని మార్క్స్‌ చెప్పేవారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇదే భావన ఉందని ప్రొఫెసర్ మైక్ అన్నారు. ఈ భావనకు పురుడు పోసింది మాత్రం మార్క్సే.

Image copyright Getty Images

3. చేసే పనిలో మీకు సంతృప్తి ఉండాలి!

కార్ల్ మార్క్స్‌ ఇదే కోరుకున్నారు. మీరు చేసే పనిలో మీకు సంతృప్తి ఉండాలని చెప్పారు. కార్మికులు చేసిన పనిలో తమను తాము చూసుకుంటారు.

పని చేసే వాతావరణం మనం మరింత సృజనాత్మకంగా ఉండేందుకు వీలు కల్పించాలి. మన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి, పదును పెట్టుకునేందుకు అవకాశం ఉండాలి. అది మానవత్వం కావొచ్చు, తెలివితేటలు కావొచ్చు.

"ఒకవేళ మీరు చేసే పని మీకు నచ్చకపోతే అది ఎంతో బాధగా ఉంటుంది. పనిపై దృష్టి పెట్టలేకపోతారు. శక్తిసామర్థ్యాలు ఉన్నా వాటిని సరిగా వినియోగించుకోలేకపోతారు. ఒక రకంగా కుంగిపోతారు. క్రమంగా సమాజానికి దూరమైపోయే ప్రమాదం ఉంది"

ఈ మాటలు ఏ సిలికాన్ వ్యాలీకో చెందిన మోటివేషనల్ గురూ ఇటీవల చెప్పినవేమీ కాదు. 19వ శతాబ్దంలోనే మార్క్స్ చెప్పిన సూక్తులివి.

మనిషి ఉన్నతమైన జీవితానికి ఉద్యోగ సంతృప్తి అవసరం అని ఆలోచించిన నాటి తత్వవేత్తల్లో కార్ల్ మార్క్స్ మొదటి వరుసలో ఉంటారు.

1844లో రాసిన "ఎకనామిక్ అండ్ ఫిలసాఫిక్ మాన్యుస్క్రిప్ట్స్‌" పుస్తకంలో మార్క్స్ ఈ విషయాలను ప్రస్తావించారు.

ఫ్యాక్టరీలు, కార్యాలయాల్లో మనం చాలా సమయం పనిచేస్తూనే గడుపుతాం. ఆ పని నుంచి ఎంతో కొంత సంతోషం మనకు కలగాలి.

మీరు సృష్టించిన లేదా చేసిన పనిని చూసినప్పుడు మీకు గర్వంగా అనిపించాలి. అది మీకు ఉద్యోగంలో సంతృప్తి కలిగిస్తుంది. సంతృప్తి ఉంటే జీవితంలో సంతోషంగా ఉంటారు అని మార్క్స్ నమ్మేవారు.

క్షణాల్లో పని జరిగిపోవాలనుకునే పెట్టుబడిదారీ వ్యవస్థ.. ఉత్పత్తిని, లాభాలను ఎలా పెంచేసుకుందో కార్ల్ మార్క్స్ గమనించారు. ఈ ఉరుకులు పరుగుల కారణంగానే పని విభజన జరిగింది.

ఒక స్క్రూ మీద మూడు గీతలు గీయడమే మీరు చేయాల్సిన పని అనుకోండి.

అప్పుడు అదే పని గంటల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి చేస్తే ఎలా ఉంటుంది?

మీరు చేసే ఆ పనిలో ఆనందం పొందగలరా? అసాధ్యం కదా.

ఎంత సులువైన పని అయినా.. దాన్నే రోజుల తరబడి పదే పదే చేయడం కష్టంగా అనిపిస్తుంది.

Image copyright Getty Images

4. మార్పుకు ప్రజలే ప్రతినిధులు!

సమాజంలో ఏదైనా తప్పు ఉంటే మీకు అన్యాయం, అసమానత్వం జరుగుతోందని భావిస్తారు. దాన్ని నిలదీస్తారు. నిరసన తెలుపుతారు. తప్పుడు దారిలో వెళ్తున్న సమాజాన్ని సరైన మార్గంలో పెట్టేందుకు ప్రయత్నిస్తారు.

19వ శతాబ్దంలో బ్రిటన్‌ కొత్త పెట్టుబడిదారీ వ్యవస్థ ఎటూ కదలకుండా మెదలకుండా ఉండే కార్మిక శక్తిని చూసి ఉంటుంది.

కానీ మార్పు వస్తుందని కార్ల్ మార్క్స్ నమ్మారు. మార్పు కోసం కార్మికులను ప్రోత్సహించారు. ఆ తర్వాత ఈ ఆలోచన సత్ఫలితాలిచ్చింది.

వ్యవస్థీకృత నిరసనలు, పోరాటాలు సమాజాన్ని సమగ్రంగా మార్చేందుకు ఎంతో దోహదం చేశాయి. ముఖ్యంగా జాతి వివక్ష వ్యతిరేక చట్టాలు, పేద, ధనిక వివక్ష వ్యతిరేక చట్టాలు రావడానికి కృషి చేశాయి.

"సమాజాన్ని మార్చాలంటే విప్లవం రావాలి. మెరుగైన సమాజం కోసం మేం ఉద్యమిస్తాం. మా పోరాటం ఫలితంగానే ఉద్యోగులకు జాతీయ ఆరోగ్య పథకం వచ్చింది. రోజుకు 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చింది" అని లండన్‌లో మార్క్సిజం ఉత్సవాన్ని నిర్వహించిన వారిలో ఒకరైన లూయిస్ నిల్సన్ అన్నారు.

మార్క్స్‌ను అందరూ ఒక తత్వవేత్తగా అభివర్ణిస్తారు. కానీ లూయిస్ నిల్సన్ దాన్ని అంగీకరించరు.

"మార్క్స్‌ను తత్వవేత్త అంటే కేవలం సిద్ధాంతాలు రాసిన వ్యక్తిగానే ఆయన కనిపిస్తారు. కానీ కార్ల్ మార్క్స్‌లో ఒక ఉద్యమకారుడు ఉన్నారు. కార్మికుల కోసం పోరాటం చేసిన నాయకుడున్నారు. అంతర్జాతీయ కార్మికుల సంస్థను ఏర్పాటు చేశారు" అని నిల్సన్ అంటారు.

కార్ల్‌ మార్క్స్ ఇచ్చిన "ప్రపంచ కార్మికులారా ఏకం కండి" నినాదం నిజంగా ఒక ఆయుధం లాంటిది.

మెరుగైన జీవితం కోసం నిరంతరం పోరాటం చేయడమనే సంప్రదాయం మార్క్స్ నుంచి మనకొచ్చిన నిజమైన వారసత్వం.

మార్పు కోసం ఉద్యమిస్తున్న వాళ్లు తాము మార్క్సిస్టులమని చెప్పుకున్నా, చెప్పుకోలేకపోయినా అది మార్క్సిజం సిద్ధాంతంపైనే ఆధారపడి ఉంటుందని నిల్సన్ చెప్పారు. మహిళలకు ఓటు హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు నిల్సన్.

పార్లమెంట్‌లో ఉన్న పురుషులు జాలిపడి మహిళలకు ఓటు హక్కు కల్పించలేదు. పోరాటం, ఉద్యమం ఫలితంగానే మహిళలకు ఆ హక్కు వచ్చింది. వారాంతపు సెలవు మనకెలా వచ్చింది? కార్మిక సంఘాలు సమ్మె చేసినప్పుడు యాజమాన్యాలు దిగిరాక తప్పలేదు. మరి, సాధారణ ప్రజల జీవితాలు మెరుగుపడాలంటే మనమేం చేయాలి?

సామాజిక మార్పు కోసం మార్క్సిజం ఒక ఇంజన్‌లా పనిచేస్తోంది. దీనికి ఎంతో పట్టుంది.

"వాళ్లు కోరుకుంటున్న సంస్కరణలు తప్పకుండా వారికి ఇచ్చేయాలి. లేదంటే వారు మనకు విప్లవాన్ని పరిచయం చేస్తారు" అని 1943లో బ్రిటన్ రాజకీయ నాయకుడు క్విన్టిన్‌హాగ్ అంగీకరించారు.

Image copyright Getty Images

5. ప్రభుత్వం గురించి మార్క్స్ హెచ్చరించారు.. మీడియా మీద ఓ కన్నేసి ఉంచాలన్నారు.

ప్రభుత్వం - కార్పొరేట్ కంపెనీల మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది?

చైనాకు గూగుల్‌ దొడ్డిదారి కీ ఇచ్చిందని తెలిస్తే అది మీకు అసౌకర్యంగా అనిపిస్తుందా?

ఓటర్ల మనోభావాలను ప్రభావితం చేసే వ్యవస్థలను సృష్టించే కంపెనీలకు ఫేస్‌బుక్ తన యూజర్ల వ్యక్తిగత వివరాలను అందిస్తే ఎలా ఉంటుంది?

19వ శతాబ్దంలో మార్క్స్, ఏంగెల్స్ సరిగ్గా ఇలాంటి అభ్యంతరాలనే లేవనెత్తారు.

కానీ ఆనాడు వాళ్లేమీ సోషల్‌ మీడియాలో చురుగ్గా లేరు!

కానీ ఈ ప్రమాదాన్ని చాలా ముందుగా పసిగట్టి, దాన్ని విశ్లేషించిన మొదటి వాళ్లు మార్క్స్, ఏంగెల్స్‌లేనని బ్యూనస్‌ఎయిర్స్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్ వాలేరియా వెగ్ వీస్ చెప్పారు.

వాళ్లు (మార్క్స్, ఏంగెల్స్) ఆ కాలంలో ప్రభుత్వం, బ్యాంకులు, వ్యాపార కంపెనీలు, ఏజెంట్ల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను అధ్యయనం చేశారు. దీనిపై పరిశోధన చేస్తూ 15వ శతాబ్దం నాటి పరిస్థితులనూ విశ్లేషించారని వాలేరియా తెలిపారు.

సుదీర్ఘ అధ్యయనం తర్వాత వారొక నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రక్రియ మంచిదైనా, చెడ్డదైనా అది ప్రభుత్వానికో లేదంటే వ్యాపార సంస్థకో ప్రయోజనం చేకూర్చేలా ఉందని తేల్చారు.

Image copyright Getty Images

మీడియానూ కార్ల్ మార్క్స్ సునిశితంగా పరిశీలించారు.

ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేసే విషయంలో మీడియా ప్రాముఖ్యాన్ని మార్క్స్ అర్థం చేసుకున్నారు.

ఇప్పుడు మనం ఫేక్ న్యూస్, మీడియా పక్షపాతం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆనాడే కార్ల్ మార్క్స్ దీన్ని ప్రశ్నించారు అని వాలేరియా చెప్పారు.

"ఆనాడు ప్రచురితమైన కథనాలను చదివి మార్క్స్ ఒక అవగాహనకు వచ్చేవారు. చిన్న చిన్న నేరాలు, పేద ప్రజల్లో నేరప్రవృత్తి వంటి అంశాలు పత్రికల్లో ఎక్కువగా కనిపించేవి. కానీ వైట్ కాలర్ నేరాలు, రాజకీయ కుంభకోణాలను మీడియా తొక్కిపట్టి ఉంచేదని ఆయన ఆనాడే అర్థం చేసుకున్నారు" అని వాలేరియా అన్నారు.

సమాజాన్ని విభజించేందుకు మీడియా కూడా ఒక చక్కని సాధనం.

"ఆంగ్లేయుల నుంచి ఐర్లాండ్ పౌరులు ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని, తెల్ల జాతీయులు నల్ల జాతీయులను అవమానిస్తున్నారని, వలసవాదులు స్థానికుల మధ్య గొడవలు.. ఇలా జగడాలు పెట్టేందుకు మీడియాను ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. పేద ప్రజలు తమలో తాము కొట్లాడుకుంటుంటే శక్తిమంతమైన సంపన్నుల జోలికి ఎవరూ రారు" అని వాలేరియా వివరించారు.

నిజానికి మార్క్సిజం ఆధునిక పెట్టుబడిదారీ విధానం కంటే ముందే వచ్చింది. కానీ ప్రస్తుతమిది నిర్ధరించుకోవాల్సిన విషయం. పెట్టుబడిదారీ విధానం గురించి బాగా తెలియడానికి ముందే ప్రపంచం మార్క్సిజం గురించి చదువుకొని ఉంది.

Image copyright Getty Images

ఆర్థికశాస్త్ర పితామహుడిగా పేరున్న ఆడమ్ స్మిత్ క్యాపిటలిజం పదాన్ని 'ఇన్విజిబుల్ హ్యాండ్' పుస్తకంలో మొదటిసారి వాడలేదని రచయిత లిండా యూహ్ చెప్పారు.

ఆడమ్‌ స్మిత్ కంటే ముందే 1854లో 'వానిటీ ఫెయిర్' అనే పుస్తకంలో రచయిత విలియం మేక్పీస్ థాకరే క్యాపిటలిజం పదాన్ని ఉపయోగించారని యూహ్ అన్నారు.

ఆ పుస్తకంలో క్యాపిటలిస్ట్ పదాన్ని 'సంపదకు యజమాని' అనే అర్థం వచ్చేలా ఉపయోగించారని యూహ్ వివరించారు.

కానీ ఆర్థిక పరిభాషలో ఈ పదాన్ని తొలిసారి ఉపయోగించింది మాత్రం కార్ల్ మార్క్సే. ఆయన 1867లో రాసిన క్యాపిటల్ (దాస్ క్యాపిటల్) పుస్తకంలో దీని ప్రస్తావన ఉంది.

ఆ తర్వాత మార్క్సిజానికి ఈ పదం పర్యాయపదంగా మారిపోయింది. అంటే ఒక రకంగా పెట్టుబడిదారీ విధానం కంటే ముందే మార్క్సిజం వచ్చింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)