Reality Check: మే 12 డెడ్‌లైన్: ట్రంప్ ‘నో’ అంటే ఇరాన్ పరిస్థితేంటి?

  • 5 మే 2018
ఇరాన్ కార్పెట్లకు అమెరికాలో గిరాకీ ఎక్కువ Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇరాన్ కార్పెట్లకు అమెరికాలో గిరాకీ ఎక్కువ

ఇరాన్‌కు ట్రంప్ విధించిన డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. అణ్వాయుధాల విషయంలో ‘పద్ధతి మార్చుకోకుంటే మళ్లీ ఆంక్షలు తప్పవు’ అని ఇరాన్‌ను ఆయన పదేపదే హెచ్చరిస్తున్నారు.

ఒకవేళ ఇరాన్‌పై మళ్లీ ఆంక్షలు విధిస్తే, ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది ప్రశ్నార్థకం.

అమెరికా, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ.. ఈ ఆరు అగ్ర దేశాలతో అణ్వాయుధాలకు సంబంధించి ఇరాన్ ప్రభుత్వం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా తమ ఆర్థిక వ్యవస్థ, ట్రేడింగ్, బ్యాంకింగ్, చమురు తదితర రంగాలపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షల్ని ఎత్తేస్తే తమ అణ్వాయుధ కార్యకలాపాలను తగ్గించడానికి ఇరాన్ ఒప్పుకుంది.

ప్రస్తుతం ఆ ఒప్పందం అమల్లో ఉంది. అయినా కూడా అప్పుడప్పుడూ ఇరాన్ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో తిరిగి ఆ దేశంపై ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు.

ఈ విషయంపై మే 12న ఆయన తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

ఈ నేపథ్యంలో.. 2015లో అణ్వాయుధ ఒప్పందం అమల్లోకి వచ్చి ఇరాన్‌పై ఆంక్షల్ని ఎత్తేశాక ఆ దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైందా, లేదా అన్న అంశంపై బీబీసీ రియాల్టీ చెక్.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆంక్షల్ని తొలగించాక ఇరాన్ అణ్వాయుధ కార్యకలాపాలు మందగించాయి

ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై చమురు ప్రభావం ఎంత?

ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా చమురు ఎగుమతులపై ఆధారపడి ఉంది. అంతర్జాతీయ ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు చమురు ఎగుమతులు తగ్గడంతో దేశ ఆర్థిక వ్యవస్థ డీలా పడింది.

కానీ 2015లో ఆంక్షల్ని తొలగించడంతో మళ్లీ చమురు ఎగుమతులు పుంజుకున్నాయి.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) లెక్కల ప్రకారం ఒప్పందం అమల్లోకి వచ్చిన తొలి ఏడాదిలో ఇరాన్ జీడీపీ 12.5శాతం మేర పెరిగింది. ఒక్కసారిగా పెరిగిన చమురు ఎగుమతులే దానికి కారణం.

కానీ ఆ తరువాత జీడీపీ తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది అది 4శాతం మేర పెరుగుతుందని ఐఎంఎఫ్ భావిస్తోంది. కానీ అణ్వాయుధ ఒప్పందం తరువాత ఆ దేశం పెట్టుకున్న 8శాతం లక్ష్యం కన్నా కూడా అది తక్కువే.

ఇరాన్‌పై ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు ఆ దేశ చమురు ఉత్పత్తుల శాతం దాదాపు సగానికి సగం పడిపోయింది. 2013లో రోజుకు 11లక్షల బ్యారెళ్ల చమురు మాత్రమే ఎగుమతయ్యేది. కానీ ప్రస్తుతం 25లక్షల బ్యారెళ్ల చమురు ఎగుమతవుతోంది.

Image copyright AFP

పిస్తా లాంటి మిగతా ఎగుమతుల పరిస్థితేంటి?

ఇరాన్ చమురేతర ఉత్పత్తుల ఎగుమతుల విలువ 2018 మార్చి నాటికి 3లక్షల కోట్ల రూపాయలు దాటింది. అణ్వాయుధ ఒప్పందానికి ముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 33వేల కోట్ల రూపాయలు ఎక్కువ.

ఇరాన్‌కు ప్రత్యేకమైన పిస్తాలాంటి కొన్ని ఉత్పత్తుల ఎగుమతుల విలువ ప్రస్తుతం 7,300 కోట్ల రూపాయలకు చేరింది. గతేడాదితో పోలిస్తే ఇది కాస్త తక్కువే.

కానీ పిస్తా, కుంకుమ పువ్వు లాంటి ఉత్పత్తుల ఎగుమతులు.. ఆంక్షల కంటే దేశంలో నెలకొన్న కరవు పరిస్థితుల వల్లే ఎక్కువ ప్రభావితమయ్యాయి.

ఒప్పందం కారణంగా ఇరాన్ కార్పెట్ల ఎగుమతులు కూడా పెరిగాయి. అక్కడినుంచి మొత్తం ఎగుమతయ్యే కార్పెట్లలో 30శాతం అమెరికాకే వెళ్తాయి. ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు ఆ మేర ఇరాన్ నష్టపోవాల్సి వచ్చింది.

ఆంక్షలు ఎత్తేశాక యురోపియన్ యూనియన్‌తో కూడా ఇరాన్ వ్యాపార సంబంధాలు మెరుగుపడ్డాయి. కానీ చైనా, దక్షిణ కొరియా, టర్కీలు ఇప్పటికీ ఇరాన్‌కు ప్రధాన వ్యాపార భాగస్వాములుగా ఉన్నాయి.

చిత్రం శీర్షిక ఇరాన్‌పై ఆంక్షల్ని తొలగించిన రోజు జరిగిన సమావేశం

కరెన్సీ విలువ పెరిగిందా? తగ్గిందా?

2012లో ఇరాన్ కరెన్సీ ‘రియాల్’ విలువ డాలర్‌తో పోలిస్తే మూడులో రెండొంతుల మేర పడిపోయింది. దేశ ఆర్థిక రంగంలో నిర్వహణ లోపాలతో పాటు అంతర్జాతీయ ఆంక్షల కారణంగా రియాల్ విలువ నానాటికీ పడిపోతూ వచ్చింది.

కానీ ఒప్పందం అమల్లోకి వచ్చాక కరెన్సీ విలువ పెరుగుతందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని పేర్కొన్నారు. ఆయన చెప్పినట్టుగానే నాలుగేళ్లపాటు రియాల్ విలువ స్థిరంగా ఉంది.

గతేడాది చివర్లో ఇరాన్‌తో ఉన్న ఒప్పంద పునరుద్ధరణపై డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటి నుంచి రియాల్ విలువ మళ్లీ క్షీణించడం మొదలైంది. గత సెప్టెంబర్‌ నుంచి ఇప్పటిదాకా డాలర్‌తో పోలిస్తే రియాల్ విలువ సగానికి పడిపోయింది.

భవిష్యత్తులో ఆంక్షలు మళ్లీ అమలైతే ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందేమోనన్న భయంతో చాలామంది ఇరానియన్లు ముందుగానే విదేశీ కరెన్సీని కొనుక్కొని పెట్టుకుంటున్నారు.

ఇప్పటిదాకా దాదాపు 30బిలియన్ డాలర్లు విలువైన కరెన్సీ ఇరాన్‌ నుంచి ఇతర దేశాలకు వెళ్లిందని భావిస్తున్నారు.

దాంతో ఇరాన్ ప్రభుత్వం ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ కార్యాలయాలపై కొరడా ఝుళిపించింది. విదేశీ కరెన్సీ అమ్మకాలపై ఆంక్షలు విధించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక భవిష్యత్తుకు భయపడి చాలామంది విదేశీ కరెన్సీని కొంటున్నారు

మధ్య తరగతిపై ప్రభావం

విదేశీ ఆంక్షలు తదనంతర పరిణామాల ప్రభావం ఇరాన్ మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడిందని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాన్ లెక్కలు చెబుతున్నాయి. 2014-15వరకూ ఇరాన్ ప్రజల నెలవారీ బడ్జెట్ క్రమంగా తగ్గుతూ వచ్చి, న్యూక్లియర్ ఒప్పందం అమల్లోకి వచ్చి మళ్లీ పురోగమించడం మొదలుపెట్టింది.

ముఖ్యంగా ఇతరుల సగటు నెలవారీ బడ్జెట్‌ 15శాతం మేర తగ్గితే మధ్య తరగతి కుటుంబాల బడ్జెట్ 20శాతం మేర తగ్గింది.

దేశంలో ఆర్థిక వ్యవస్థలో నియంత్రణ లోపాలతో పాటు అంతర్జాతీయ ఆంక్షల ప్రభావం సగటు పౌరులపైనా పడింది.

ఇకముందు పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది మే 12న ట్రంప్ వెల్లడించే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)