మిథాలీరాజ్: కిట్ కొనడానికి కష్టపడ్డ అమ్మాయి.. ఇప్పుడు పారితోషికంలో నంబర్ 1

  • 5 మే 2018
మిథాలి

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్.. క్రీడారంగంలోని టాప్ స్టార్లలో ఒకరు. ఈ మధ్యే ఆమె పారితోషికం ఏకంగా మూడు రెట్లు పెరిగి దాదాపు 50 లక్షల రూపాయలకు చేరుకుంది. ఆమెతో పాటు జట్టులోని మరో ముగ్గురు మహిళల వేతనం కూడా అదే స్థాయిలో పెరిగింది.

ఈ నేపథ్యంలో మిథాలీ బీబీసీతో మాట్లాడారు. తాను ఈ దశకు చేరుకోవడానికి చాలా శ్రమించినట్లు చెప్పారు. ఆ కష్టమేంటో ఆమె మాటల్లోనే వినాలంటే ఈ కింది వీడియో చూడండి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionమహిళ క్రికెట్‌లో అత్యధిక పారితోషికం మిథాలీకే..

‘ఇది క్రీడాకారిణుల శ్రమకు లభించిన ప్రతిఫలం. ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాం. నేను 1999లో భారత జట్టుకు ఎంపికైనపుడు మాకు వ్యక్తిగత స్పాన్సర్లు కూడా లేరు. ఒక అంతర్జాతీయ స్ధాయి క్రికెటర్ కోరుకునే కిట్‌ను నాకు కొనివ్వడం కోసం మా నాన్న చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది’ అని ఆమె అన్నారు.

భారత మహిళా క్రికెట్ జట్టు గత ఏడాది ప్రపంచ కప్ పోటీలలో రన్నరప్‌గా నిలిచింది. దాంతో, మహిళా క్రికెట్ పట్ల ప్రజాదరణ విశేషంగా పెరిగింది. అయితే, ఇంతటి స్థాయికి చేరుకున్నా మిథాలీ రాజ్‌కు ఇస్తున్న పారితోషికం, ఒక సి-గ్రేడ్ పురుష క్రికెటర్‌కు ఇచ్చే దానిలో సగం కూడా లేదు.

ఇంగ్లండ్‌లో కూడా క్రీడల వేతనాలకు సంబంధించిన లింగ వివక్ష అక్కడి క్రికెట్‌లో మరీ ఎక్కువగా కనిపిస్తుంది. దీని గురించి ఆ జట్టు క్రీడాకారిణి హీథర్ నైట్ బీబీసీతో మాట్లాడారు.

‘మహిళల ప్రొఫెషనల్ క్రికెట్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఆడ, మగ క్రికెటర్ల పారితోషికాల మధ్య ఉన్న తేడా తగ్గడానికి కొంత సమయం పడుతుంది. పురుషుల క్రికెట్ కూడా ఆర్థికంగా ఒక దశకు చేరుకోవడానికి చాలా సమయం పట్టింది.

వేతనం విషయంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుగుతున్నాయి. కొన్ని నెలల తరువాత పరిస్థితిలో మార్పు ఉంటుందని ఆశిస్తున్నా’ అని ఆమె చెప్పారు.

మహిళలకు ఎక్కువ వేతనాలు ఇవ్వాలని, దానివల్ల వారు మహిళా క్రికెట్ విషయంలో నెలకొన్న సామాజిక అడ్డుగోడలను అధిగమించగలుగుతారని ఇంగ్లండ్‌లో మహిళల క్రికెట్ టోర్నీ చూడటానికి వచ్చిన అభిమానులు అభిప్రాయపడ్డారు.

మహిళా క్రికెటర్లకు వేతనాల చెల్లింపులో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. ఇది రేపటి తరాలకు ఆశావహంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు