కార్ల్ మార్క్స్ చెప్పిన ఈ నాలుగు సిద్ధాంతాలకు నేటికీ తిరుగులేదు

  • మ్యాక్స్ సీత్జ్
  • బీబీసీ ముండో
కార్ల్ మార్క్స్

ఫొటో సోర్స్, Getty Images

మే 5న కార్ల్ మార్క్స్ 201వ జయంతి.

19వ శతాబ్దంలో జర్మనీకి చెందిన తత్వవేత్త కార్ల్ మార్క్స్ చాలా గ్రంథాలు రాశారు. కానీ ఆయన రాసిన వాటిలో రెండు - 'కమ్యూనిస్టు ప్రణాళిక', 'పెట్టుబడి' - ఒక సమయంలో ప్రపంచంలోని చాలా దేశాల్లోని కోట్లాది మంది ప్రజలపై ఇవి రాజకీయంగా, ఆర్థికంగా చాలా ప్రభావం చూపాయి.

రష్యన్ విప్లవం తర్వాత సోవియట్ యూనియన్ ఆవిర్భావం ఇందుకో ఉదాహరణ. 20వ శతాబ్దపు చరిత్రపై సోషలిస్టు పంథా చూపిన ప్రభావాన్ని ఎవరూ కాదనలేరు.

చివరకు, అనేకానేక పరిణామాల ఫలితంగా సోషలిస్టు శిబిరం కుప్పకూలిపోయింది. పెట్టుబడిదారీవిధానం ఈ భూగ్రహాన్నంతా చుట్టేసింది. అయితే, అలా కమ్యూనిజం విఫలమైనప్పటికీ, నేటికీ ప్రాసంగికతను కోల్పోని మార్క్స్ సిద్ధాంతాలేమిటో ఓసారి చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images

1- రాజకీయ కార్యక్రమం

కమ్యూనిస్టు ప్రణాళిక, తదితర వ్యాసాల్లో మార్క్స్ పెట్టుబడిదారీ సమాజంలో 'వర్గ పోరాటం' గురించి ప్రస్తావించారు. వర్గ పోరాటం ద్వారానే, చివరకు కార్మికవర్గం మొత్తం ప్రపంచమంతటా బూర్జువా వర్గాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆయన వివరించారు.

తన ప్రఖ్యాత గ్రంథం 'దాస్ కేపిటల్' (పెట్టుబడి)లో ఆయన తన ఈ సిద్ధాంతాలను చాలా వాస్తవికంగా, శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించారు.

'అన్నింటినీ ఆక్రమించుకునే పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా మార్క్స్ చాలా తాత్వికంగా అనేక వాదనలు లేవనెత్తారు. ఆ విధానం మొత్తం మానవ నాగరికతనే ఎలా బానిసగా మార్చిందో ఆయన తెలియజెప్పారు' అని మార్క్స్ జీవిత చరిత్ర రాసిన బ్రిటన్‌కు చెందిన ఫ్రాన్సిస్ వీన్ అన్నారు.

20వ శతాబ్దంలో కార్మికులు రష్యా, చైనా, క్యూబా, తదితర దేశాల్లో పాలకవర్గంగా ఉన్న వారిని అధికారంలోంచి కూలదోసి, వ్యక్తిగత ఆస్తినీ, ఉత్పత్తి సాధనాలను చేజిక్కించుకున్నారు.

"ప్రపంచీకరణ తొలి విమర్శకుడు మార్క్సే. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న అసమానతలపై ఆయన ఆనాడే హెచ్చరించారు" అని బ్రిటన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో జర్మన్ చరిత్రకారుడు అల్‌బ్రెఖ్త్ రిసల్ అంటారు.

2007-08లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక మాంద్యం ఆయన సిద్ధాంతాల ప్రాసంగికతను మరోసారి రుజువు చేశాయి.

ఫొటో సోర్స్, Getty Images

2- పదే పదే మాంద్యం ఏర్పడటం

పెట్టుబడి 'పితామహుడు' ఆడమ్ స్మిత్ తన 'వెల్త్ ఆఫ్ నేషన్స్‌' పుస్తకంలో రాసిన సిద్ధాంతాలకు భిన్నంగా, మార్కెట్‌ను నడిపించేవి అదృశ్య శక్తులేమీ కాదని మార్క్స్ భావించారు.

మాంద్యం పదే పదే పునరావృతమవుతుందనీ, దానికి కారణాలు పెట్టుబడిదారీ విధానంలోనే ఇమిడి ఉన్నాయని మార్క్స్ చెప్పారు.

"పెట్టుబడిదారీ విధానం అంతరించి పోయేదాకా ఇలాగే జరుగుతుందని మార్క్స్ సూత్రీకరించారు" అని అల్‌బ్రెఖ్త్ అంటారు.

ప్రపంచవ్యాప్తంగా 1929లో షేర్ మార్కెట్లు బోర్లా పడిపోయాయి. ఆ తర్వాత కాలంలో 2007-08లో వచ్చిన మాంద్యం మరింత హెచ్చు స్థాయిలో ఉంది. ప్రపంచంలోని విత్త మార్కెట్లన్నీ ఎన్నడూ చూడనంత సంక్షోభంలో కూరుకుపోయాయి.

అయితే ఈ సంక్షోభాల ప్రభావం భారీ పరిశ్రమలకన్నా ఆర్థిక రంగంపైనే ఎక్కువ పడిందని విశ్లేషకులంటారు.

ఫొటో సోర్స్, Getty Images

3- అంతులేని లాభాలు, గుత్తాధిపత్యం

మార్క్స్ చెప్పిన సిద్ధాంతాల్లో కీలకమైంది - 'అదనపు విలువ'. కార్మికుడు తనకు దక్కే కూలీడబ్బుకు మించి సృష్టించేదే అదనపు విలువ.

మార్క్స్ అభిప్రాయం ప్రకారం, ఉత్పత్తి సాధనాల యజమానులు ఈ అదనపు విలువను కాజేస్తారు. కార్మిక వర్గాన్ని అట్టడుగు స్థానానికి తొక్కి వేస్తూ లాభాల మీద లాభాలు పోగు చేసుకుంటారు.

ఈ విధంగా పెట్టుబడి అంతా కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది. దీని వల్ల నిరుద్యోగం పెరుగుతుంది. వేతనాలు పడిపోతుంటాయి. దీన్ని మనం నేటికీ చూస్తూనే ఉన్నాం.

బ్రిటిష్ పత్రిక 'ది ఎకానమిస్ట్'లో వచ్చిన ఇటీవలి విశ్లేషణ ప్రకారం, గత రెండు దశాబ్దాల్లో అమెరికా వంటి దేశాల్లో వేతనాలు గిడసబారిపోయాయి. అంటే, ఏ మాత్రం పెరుగుదల లేదు. కానీ, అధికారుల వేతనాల్లో మాత్రం 40 నుంచి 110 రెట్ల వృద్ధి నమోదైంది.

ఫొటో సోర్స్, Getty Images

4- ప్రపంచీకరణ, అసమానత్వం

అయితే, పెట్టుబడిదారీ విధానం తన గొయ్యిని తానే తవ్వుకుంటుందని మార్క్స్ రాసిన మాట నిజం కాలేదని మార్క్స్ జీవిత చరిత్ర రచయిత ఫ్రాన్సిస్ వీన్ అన్నారు. సరిగ్గా ఇందుకు భిన్నంగా జరిగింది. కమ్యూనిజం అంతరించిపోయింది. మరోవైపు పెట్టుబడిదారీ వ్యవస్థ సర్వవ్యాపితమైంది.

మార్క్స్ చెప్పిన జోస్యం ఫలించకపోవచ్చు గానీ పెట్టుబడిదారీ ప్రపంచీకరణపై ఆయన చేసిన విమర్శలో మాత్రం ఏ మాత్రం తప్పులేదు.

పెట్టుబడిదారీ ప్రపంచీకరణే అంతర్జాతీయ అస్థిరత్వానికి ప్రధాన కారణమవుతుందని ఆయన 'కమ్యూనిస్టు ప్రణాళిక'లో పేర్కొన్నారు. 20, 21వ శతాబ్దాల్లో చోటు చేసుకున్న ఆర్థిక సంక్షోభాలు దీన్ని రుజువు చేశాయి కూడా.

ఈ కారణంగానే, ప్రపంచీకరణ ఫలితంగా తలెత్తుతున్న సమస్యలపై నేడు జరుగుతున్న చర్చలో మార్క్సిజం ప్రస్తావన పదే పదే వస్తూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)