మనీలాలో జైళ్లు చాలడం లేదు.. ఎందుకో తెలుసా?

  • 6 మే 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption800 మంది కోసం నిర్మించిన జైల్లో 5500 మంది ఖైదీల పాట్లు

ఫిలిపీన్స్ దేశం స్పెయిన్ పరిపాలనలో ఉన్న కాలంలో.. అంటే 1800లలో మనీలా సిటీ జైలును నిర్మించారు. అప్పట్లో 800 మంది ఖైదీలకు సరిపడే విధంగా ఈ జైలును నిర్మించారు. కానీ, ఇప్పుడు ఆ జైలులో 5,500 మందికన్నా ఎక్కువ మంది ఖైదీలున్నారు.

తగినంత చోటు లేక పక్కపక్కనే నిద్రపోతూ, కదలలేని పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. ఇరుకైన గదులలో వేడి వాతావరణం వల్ల ఇక్కడ క్షయవ్యాధి వ్యాప్తి చెందుతోంది. గత ఏడాదితో పోల్చితే ఈసారి అంటు వ్యాధులు 40% ఎక్కువగా విస్తరించాయి.

సమస్యలతో సతమతమవుతున్న న్యాయ వ్యవస్థే ఇక్కడి జైళ్లు ఖైదీలతో నిండిపోవడానికి ముఖ్య కారణం. ఇక్కడి కోర్టుల్లో న్యాయ విచారణ నత్తనడకన సాగుతోంది. డెన్నిస్ గార్షియా ఈ జైలులో అత్యధిక కాలంగా ఖైదీగా ఉన్నారు. రెండుసార్లు దొంగతనం కేసులో పట్టుబడి ఇక్కడ గత పదహారు సంవత్సరాలుగా బందీగా ఉన్నారు.

''నా కేసులకు సంబంధించి ఇరవైసార్లు విచారణకు హాజరయ్యాను. ఇదొక అర్థంకాని కలలాంటిది. ఎంతో విలువైన సమయం వృధా అయిపోయింది. న్యాయమూర్తులు మారుతూ ఉంటారు. నేను బయటపడతానా లేక ఇక్కడే చనిపోతానా అన్నది తెలియట్లేదు" అని డెన్నిస్ అన్నారు.

జైలు అధికారులు చెప్పిన దాని ప్రకారం, 2016లో ఆ దేశ ప్రభుత్వం మాదకద్రవ్యాల అక్రమార్కులపై కొరడా ఝుళిపించడం ప్రారంభించిన నాటి నుంచి జైలులో ఖైదీల సంఖ్య 30 శాతానికి పైగా పెరిగింది. కానీ జైళ్ల కోసం బడ్జెట్ మాత్రం నామమాత్రంగానే పెంచారు.

మనీలా సిటీ జైలు అక్కడి న్యాయ వ్యవస్థ ప్రస్తుత స్థితికి అద్దం పడుతుంది. లెక్కలేనంతమంది జైలు గోడల మధ్య మగ్గిపోతున్నారు. విచిత్రం ఏమిటంటే, ప్రభుత్వం డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్న నేపథ్యంలో చాలామంది ఖైదీలు జైలే పదిలమని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)