అమెరికా ‘బెదిరింపుల’తో శాంతికి విఘాతం: ఉ.కొరియా

  • 6 మే 2018
కిమ్ జోంగ్-ఉన్ Image copyright Reuters

చరిత్రాత్మక శిఖరాగ్ర సదస్సుకు అమెరికా - ఉత్తర కొరియాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. అమెరికా ‘‘ఒత్తిడి, సైనిక బెదిరింపులు’’ మానుకోవాలని ఉత్తర కొరియా హెచ్చరించింది.

ఉత్తర కొరియా అణ్వాయుధాలను త్యజించే వరకూ ఆంక్షలు తొలగించబోమని చెప్పటం ద్వారా అమెరికా ఉద్దేశపూర్వకంగా తమను రెచ్చగొడుతోందని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ కొద్ది వారాల్లో భేటీ కావాల్సి ఉంది. ఈ రెండు దేశాల అగ్రనాయకుల భేటీ ఇదే మొదటిది అవుతుంది.

ఉత్తర కొరియా, అమెరికాల మధ్య కొన్ని నెలల పాటు మాటల యుద్ధం కొనసాగిన తర్వాత.. ఇటీవల ఉత్తర, దక్షిణ కొరియాల అగ్రనేతలు సమావేశమయ్యారు.

గత నెలాఖరులో జరిగిన ఆ శిఖరాగ్ర సమావేశంలో.. కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితం చేయాలని ఉభయ కొరియాలు అంగీకరించాయి.

అదే వరుసలో అమెరికా, ఉత్తర కొరియా అగ్రనాయకులు త్వరలో భేటీ కావటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. మామూలుగా అమెరికాను తరచుగా విమర్శించే ఉత్తర కొరియా ఇటీవలి కాలంలో అటువంటివేమీ చేయలేదు.

Image copyright Getty Images

ఈ పరిస్థితుల్లో ఉత్తర కొరియా అమెరికా వైఖరిని తప్పుపడుతూ తాజాగా విమర్శలు చేయటం.. ఆ రెండు దేశాల మధ్య చర్చలు సులభం కాదని తేటతెల్లం చేస్తున్నాయని బీబీసీ ఆసియా ఎడిటర్ మైఖేల్ బ్రిస్టో పేర్కొన్నారు.

ఉభయ కొరియాల మధ్య అణ్వస్త్ర నిరాయుధీకరణ ఒప్పందం ఆంక్షలు, ఇతర ఒత్తిడిల ఫలితంగానే జరిగిందని చెప్పటం ద్వారా ‘‘ప్రజాభిప్రాయాన్ని అమెరికా తప్పుదోవ పట్టిస్తోంది’’ అని ఉత్తర కొరియా అధికారి అభ్యంతరం వ్యక్తంచేసినట్లు ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది.

కొరియా ద్వీపకల్పం మీద తన సైనిక బలగాలను మోహరించటం ద్వారా ప్రస్తుతమున్న మంచి వాతావరణాన్ని అమెరికా చెడడొడుతోందని కూడా ఉత్తర కొరియా ఆరోపించింది.

‘‘చరిత్రాత్మక ఉత్తర - దక్షిణ శిఖరాగ్ర సమావేశం, పాన్మున్జోం ప్రకటనల ఫలితంగా కొరియా ద్వీపకల్పం మీద పరిస్థితి శాంతి, సమన్వయాల దిశగా పయనిస్తున్న సమయంలో అమెరికా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోంది’’ అని ఆ ప్రకటనలో నిందించింది.

‘‘ఈ చర్య.. ఎంతో కష్టపడి నెలకొల్పిన చర్చల వాతావరణాన్ని చెడగొట్టటానికి, పరిస్థితిని మళ్లీ మొదటికి తీసుకురావటానికి చేస్తున్న ప్రమాదకరమైన ప్రయత్నం మినహా మరొకటి కాదు’’ అని తప్పుపట్టింది.

‘‘ఉత్తర కొరియా శాంతి కాంక్షను ‘బలహీనత’ అని అమెరికా పొరపాటుగా పరిగణించి.. మాపై ఒత్తిడి, సైనిక హెచ్చరికలను కొనసాగించటం ఏమాత్రం దోహదపడదు’’ అని పేర్కొంది.

Image copyright Getty Images

ఉత్తర కొరియా మీద ఆంక్షలను, ఇతర ఒత్తిడిని కొనసాగిస్తానని.. తన కఠిన వైఖరి వల్లే ఉత్తర కొరియా చర్చల దారిలోకి వచ్చిందని డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల కిందట వ్యాఖ్యానించారు.

ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్.. ఏప్రిల్ 27వ తేదీన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌తో సమావేశమయ్యారు.

కొరియా యుద్ధాన్ని లాంఛనంగా ముగించేందుకు అమెరికా, చైనాలతో చర్చలు కొనసాగిస్తామని ఆ సందర్భంగా ఇరువురు నేతలూ పేర్కొన్నారు.

కొరియా యుద్ధం 1953లో తాత్కాలిక సంధి ద్వారా ఆగినప్పటికీ.. పూర్తిగా ముగిసిపోలేదు.

అలాగే.. అణ్వస్త్ర రహిత కొరియా ద్వీపకల్పానికి కట్టుబడి ఉంటామనీ ఇరువురు నేతలూ ప్రకటించారు.

కిమ్‌తో తన చర్చలకు ఒక తేదీని, వేదికను నిర్ణయిస్తామని ట్రంప్ చెప్తున్నారు. కానీ ఇంకా ఏమీ వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)