పాకిస్తాన్ హోం మంత్రి అహ్‌సాన్ ఇక్బాల్‌పై కాల్పులు

  • 7 మే 2018
పాకిస్తాన్ హోం మంత్రి అహ్‌సాన్ ఇక్బాల్ Image copyright Reuters
చిత్రం శీర్షిక పాకిస్తాన్ హోం మంత్రి అహ్‌సాన్ ఇక్బాల్

పాకిస్తాన్ హోం మంత్రి అహ్‌సాన్ ఇక్బాల్‌పై ఒక దుండగుడు కాల్పులు జరపడంతో ఆయన కుడి చేతికి గాయమైంది. ప్రాణాపాయం తప్పింది.

ఈశాన్య పాకిస్తాన్‌లో పంజాబ్ రాష్ట్రంలోని నారోవాల్ నగరంలో ఈ ఘటన జరిగింది.

ఇక్బాల్ ఒక క్రైస్తవ సంస్థతో సమావేశమై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని, దాడి వెనక ఉద్దేశం స్పష్టం కాలేదని ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

దుండగుడు రెండోసారి కాల్చబోతుండగా, అక్కడున్నవారు అతన్ని కొట్టి అడ్డుకున్నారు.

అతడిని అరెస్టు చేసి, విచారిస్తున్నామని అధికారులు చెప్పారు.

అతడి పేరు అబీద్ హుస్సేన్‌ అని, వయసు 21 ఏళ్లని పాకిస్తాన్ మీడియా తెలిపింది.

అతడు 'తెహ్రీకే లబాయిక్ యా రసూల్ అల్లా' అనే అతివాద ఇస్లామిక్ రాజకీయ పార్టీకి చెందినవాడనే సమాచారం ఉందని ఓ పోలీసు నివేదిక చెబుతోందని రాయిటర్స్ వెల్లడించింది.

పాక్‌లో తీవ్ర వివాదాస్పదమైన దైవదూషణ చట్టాన్ని సవరించేందుకు జరిగే ప్రయత్నాలను ఈ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తోంది. పాకిస్తాన్‌లో దైవదూషణ చట్టం అమలు తీరుపై చాలా విమర్శలు ఉన్నాయి. వ్యక్తిగత ద్వేషాలను తీర్చుకునేందుకు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శకులు చెబుతున్నారు.

మంత్రి ఇక్బాల్ పాలక పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్) పార్టీలో సీనియర్ నాయకుడు.

దాడిపై సత్వరం నివేదిక అందజేయాలని పోలీసు విభాగం అధిపతిని పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖాకన్ ఆదేశించారు. దాడిని అమెరికా ఖండించింది.

పాకిస్తాన్‌లో జులై 15న సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)