కాన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్: ఈ 10 చిత్రాలపైనే అందరి కన్ను!

  • 9 మే 2018
కాన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్ Image copyright REUTERS/ALTITUDE/LUCASFILM/UNIVERSAL

కాన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌కు దేశ విదేశాల నుంచి తారలు తరలివస్తున్నారు. కాన్స్‌ సినీ సందడి ఇప్పటికే మొదలైంది.

మంగళవారం నుంచి మే 19 వ‌ర‌కు కాన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్ జరగబోతోంది.

ఈసారి కాన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు చాలా చిత్రాలు ముస్తాబయ్యాయి.

వాటిలో ప్రధానంగా 10 చిత్రాల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఈ సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం.

Image copyright MEMENTO FILMS

'ఎవ్రీబడి నోస్'

కాన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించే తొలి చిత్రం ఎవ్రీబడి నోస్.

ఇరాన్‌కు చెందిన అస్గర్ ఫర్హాది దీనికి దర్శకత్వం వహించారు.

నటులు పెనెలోప్ క్రజ్, జేవియర్ బార్డెమ్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.

వీరితో పాటు అర్జెంటీనా నటుడు రికార్డో డారిన్ కూడా ఇందులో ఉన్నారు.

బ్యూనస్‌ ఎయిర్స్‌లో ఉండే పెనెలోప్ క్రజ్ దంపతులు మాడ్రిడ్‌కు వస్తారు. అక్కడ అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.

అలాంటి సమయంలో వారు ఎలా ప్రవర్తించారు.. వారి జీవితంలో ఆ సంఘటనలు ఎలాంటి ప్రభావం చూపించాయి. చివరికి వారు ఏం చేశారు అన్నది చిత్ర కథాంశం.

ఈ సినిమా బ్రిటన్‌లో ఇంకా విడుదల కాలేదు.

Image copyright DAVID LEE/FOCUS FICTURES

'బ్లాక్‌క్లాన్స్‌మెన్'

నటులు స్పైక్ లీకి కాన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ గతంలోనూ ఎన్నో అవార్డులు ఇచ్చింది.

1986లో ఆయన తొలి అవార్డు అందుకున్నారు.

1991లో 'జంగిల్ ఫీవర్‌' మరో అవార్డు తీసుకొచ్చింది.

ఈసారి కూడా ఆయన తీసిన 'బ్లాక్‌క్లాన్స్‌మెన్' చిత్రం అవార్డుల రేసులో ఉంది.

ఒక ఆఫ్రికన్-అమెరికన్‌ పోలీసు అధికారి స్థానిక 'కు క్లక్స్ క్లాన్‌' లోకి చొరబడతారు. ఆ తర్వాత ఏమైంది.. ఎందుకు అక్కడికి వెళ్లారు అనేది కథాంశం.

Image copyright 2017 BY UNDER THE LL SEA

'అండర్‌ ద సిల్వర్ లేక్'

అమెరికాకు చెందిన నిర్మాత డెవిడ్ రాబర్ట్ మిట్‌చల్ నాలుగేళ్ల క్రితం "ఇట్ ఫాలోస్" చిత్రంతో మంచి మార్కులు కొట్టేశారు.

తక్కువ బడ్జెట్‌తో హర్రర్ మూవీ తీసి అందరి ప్రశంసలు పొందారు.

"అండర్ ద సిల్వర్ లేక్‌"తో కేన్స్‌కొస్తున్నారు. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆండ్రూ గార్ఫిల్డ్, రిలే క్యౌగ్, టోఫెర్ గ్రేస్ నటించారు.

కాన్స్‌లో ప్రీమియర్ తర్వాత జూన్ 22న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Image copyright FILM4/CURZON ARTIFICAL EYE

'కోల్డ్ వార్'

పోలాండ్‌కు చెందిన పావెల్ పావ్లికోవ్స్కి "కోల్డ్‌వార్" చిత్రానికి దర్శకత్వం వహించారు.

యూరప్‌లో 1950 కాలం నాటి ప్రేమకథ ఇది.

వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఎలా పుట్టింది.. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఇందులోని ఆసక్తికర అంశం.

పోలాండ్‌ జానపద సంగీత, నృత్యం బృందం నేపథ్యంలో సినిమా నడుస్తుంది.

2015 బఫ్టా అవార్డు గెలుచుకున్న తర్వాత పావెల్ తీసిన తొలి చిత్రం ఇది.

Image copyright ALAN AMATO

'ద మ్యాన్ హు కిల్డ్ డాన్ క్యుఇక్షొతె'

టెర్రీ గిల్లియం దర్శకత్వం వహించిన "డాన్ క్యుఇక్షొతె" చిత్రంతో ఈ ఏడాది కాన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్ ముగించాలని భావిస్తున్నారు. ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ ఫిల్మ్ ఇది.

అయితే, తన అనుమతి లేకుండా ఈ చిత్రాన్ని కాన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించరాదని ఈ సినిమా మాజీ నిర్మాత డిమాండ్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి ఆది నుంచి అడ్డంకులే ఎదురవుతున్నాయి.

2000లో చిత్ర నిర్మాణం ఆగిపోయింది.

కానీ పట్టుదలతో గిల్లియం ఈ చిత్రాన్ని పూర్తి చేశారు.

Image copyright LUCASFILM

'సోలో: ఎ స్టార్ వార్స్ స్టోరీ'

కాన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్న స్టార్‌వార్స్ యూనివర్స్‌ ప్రిక్వెల్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇది.

అల్డెన్ ఎరెన్రిచ్ సోలో పాత్ర పోషిస్తున్నారు.

ఇందులో డొనాల్డ్ గ్లోవర్ కూడా నటించారు.

బ్రిటన్ నటులు ఎమీలియా క్లార్క్, తాండీ న్యూటన్, ఫోబ్ వాలెర్-బ్రిడ్జ్ ఈ చిత్ర ప్రీమియర్‌కి వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమా మే 24న బ్రిటన్‌లో విడుదల కాబోతోంది.

Image copyright ZENTROPA/CHRISTIAN GEISNAES

'ది హౌజ్ దట్ జాక్ బిల్ట్'

ఈ సినిమాలో మాట్ డిల్లాన్ టైటిల్ రోల్ షోషించారు.

ఈ చిత్రంలో జాక్ తెలివైన సీరియల్ కిల్లర్‌గా కనిపిస్తారు.

హత్యలు చేయడం కూడా ఒక కళే అన్నట్లుగా చూపిస్తారు.

12 ఏళ్ల పాటు ఎవరికీ చిక్కకుండా వరుస హత్యలు చేస్తారు.

జాక్ సీరియల్ కిల్లర్ అన్న సంగతి ఎలా బయటపడిందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఉమా థుర్మాన్, బ్రూనో గంజ్, సోఫీ గ్రబోల్ కూడా నటించిన ఈ చిత్రానికి లార్స్ వాన్ ట్రియెర్ దర్శకత్వం వహించారు.

Image copyright MICHAEL GIBSON/HBO

'ఫారెన్‌హీట్ 451'

1953లో అమెరికా రచయిత రే బ్రాడ్బరీ రాసిన సైన్స్ ఫిక్షన్ నవల ఆధారంగా ఫారెన్‌హీట్ 451 చిత్రం తెరకెక్కింది.

ఇందులో మైఖేల్ బి జోర్డాన్, మైఖేల్ షానన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

మేఖేల్ ఇటీవలే బ్లాక్ పాంథర్‌లో నటించారు. ప్రస్తుత చిత్రంలో ఫైర్ ఆఫీసర్‌గా కనిపిస్తారు.

సాహిత్యం, పుస్తకాలు కనిపిస్తే కాల్చివేయాలని అమెరికా ప్రభుత్వం ఫైర్ ఆఫీసర్లను పంపిస్తుంది.

విప్లవాలు, ఆందోళనలు చేసేలా ప్రజలను ప్రోత్సహించకుండా ఉండేందుకు సాహిత్యాన్ని ధ్వంసం చేయాలని అనుకుంటారు.

ఈ నేపథ్యంలో హీరో ఏం చేశారు.. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది సినిమా కథ.

రమిన్ బహ్‌రానీ ఫారెన్‌హీట్ 451 సినిమాకి దర్శకత్వం వహించారు.

ఈయన 2014లో వచ్చిన 99హోమ్స్ చిత్రంలో షానన్‌తో కలిసి పనిచేశారు.

Image copyright ALTITUDE

'విట్నీ'

ప్రముఖ గాయని విట్నీ హౌస్టన్ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న సినిమా ఇది.

కెరీర్‌లో ఉవ్వెత్తున ఎగిసి తర్వాత ఆమె ఎలా డీలాపడిందో ఇందులో చూపించారు.

దీనికి కెవిన్ మెక్‌డొనాల్డ్ దర్శకత్వం వహించారు.

నిజానికి విట్నీ: కెన్ ఐ బీ మీ పేరుతో గతంలోనే ఒక డాక్యుమెంటరీ వచ్చింది.

కానీ ప్రస్తుత సినిమాకు విట్నీ తల్లిదండ్రుల మద్దతు ఉంది.

గతంలో ఎప్పుడూ చూడని విట్నీ అరుదైన దృశ్యాలు, ఆమె ప్రదర్శనలకు ఈ సినిమాలో స్థానం కల్పించారు.

Image copyright UNIVERSAl

'పోప్ ఫ్రాన్సిస్: ఏ మ్యాన్ ఆఫ్ హిజ్ వర్డ్'

పోప్‌ ఫ్రాన్సిస్ నిజ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

జర్మనీ దర్శకుడు విమ్ వెండర్స్ రెండేళ్లు శ్రమించి ఈ సినిమా తెరకెక్కించారు.

ఈ చిత్రాన్ని పోప్ ఫ్రాన్సిస్ జీవిత చరిత్రలా కాకుండా ఆయన ఈ స్థాయికి ఎలా చేరుకున్నారు.. ఆయన వ్యక్తిగత జీవితం ఎలా సాగిందన్న కోణంలో తీశారు.

అమెరికాలో మే 18న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.