ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి తప్పుకున్న అమెరికా: ఇప్పుడేం జరుగుతుంది?

  • 9 మే 2018
అమెరికా, ఇరాన్ అధ్యక్షులు ట్రంప్, రౌహానీ Image copyright EPA
చిత్రం శీర్షిక అమెరికా, ఇరాన్ అధ్యక్షులు ట్రంప్, రౌహానీ

ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో, తదుపరి పరిణామాలు ఎలా ఉండొచ్చు? ట్రంప్ నిర్ణయంపై ఇరాన్ ఏమంటోంది? ఒప్పందంలో భాగస్వాములైన బ్రిటన్, రష్యా, చైనా తదితర దేశాలు ఏమంటున్నాయి? అసలు ఈ ఒప్పందం ఉద్దేశం ఏమిటి? ఇది అమల్లోకి వచ్చాక ఇరాన్‌లో పరిస్థితులు ఎలా మారాయి?

తమ ఆర్థిక వ్యవస్థ, ట్రేడింగ్, బ్యాంకింగ్, చమురు తదితర రంగాలపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తేస్తే తమ అణు కార్యకలాపాలను తగ్గించేందుకు అంగీకరిస్తూ, ఇరాన్ 2015లో దీనిపై సంతకం చేసింది. ఈ ఆంక్షలను ఐక్యరాజ్య సమితి, అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ) విధించాయి.

ఈ ఒప్పందం కుదరడంలో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక పాత్ర పోషించారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనాలతో ఇరాన్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని 'జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జేసీపీవోఏ)'గా వ్యవహరిస్తారు.

అమెరికా తప్ప, ఒప్పందంపై సంతకాలు చేసిన అన్ని దేశాలు దీని నిబంధనలకు అనుగుణంగానే ఇరాన్ వ్యవహరిస్తోందని భావిస్తున్నాయి. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) కూడా ఇదే అభిప్రాయంతో ఉంది.

ఆంక్షలను తిరిగి విధిస్తా: ట్రంప్

''ఈ ఒప్పందం లోపభూయిష్టమైనది, కాలం చెల్లినది, భయంకరమైనది, ముందెన్నడూ లేనంత ఏకపక్షమైనది'' అని ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు చేసిన ప్రకటనలో ట్రంప్ వ్యాఖ్యానించారు.

''ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలూ తీసుకోకపోతే ఏం జరుగుతుందో మాకు బాగా తెలుసు.. ఉగ్రవాదానికి మద్దతిచ్చే ప్రధాన దేశమైన ఇరాన్, అత్యంత విధ్వంసకర ఆయుధాలైన అణ్వస్త్రాలను కొద్దికాలంలోనే సొంతం చేసుకోగలదు. అందువల్లే ఈ ఒప్పందం నుంచి వైదొలగుతున్నాం'' అని ట్రంప్ తెలిపారు.

ఒప్పందం కుదిరినప్పుడు ఇరాన్‌పై ఎత్తివేసిన ఆంక్షలను తిరిగి విధిస్తానని ఆయన ప్రకటించారు.

"ఈ ఒప్పందం అమెరికాను, దాని మిత్రదేశాల ప్రయోజనాలను కాపాడాల్సిందిపోయి, ఇరాన్ అణు కార్యక్రమంపై చాలా బలహీనమైన పరిమితులను విధించింది. ఇది సిరియా, యెమెన్ తదితర ప్రాంతాల్లో ఇరాన్ దుష్ట కార్యకలాపాలపై ఎలాంటి పరిమితులనూ విధించలేదు" అని ట్రంప్ ఆక్షేపించారు.

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు అభివృద్ధి చేసుకొనే విషయంలో ఈ ఒప్పందం చేసిందేమీ లేదని ట్రంప్ విమర్శించారు. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి ఒప్పందంలో ఉన్న పర్యవేక్షణ వ్యవస్థలు తగినంత బలంగా లేవని ఆయన చెప్పారు.

ట్రంప్ నిర్ణయాన్ని ఇరాన్ ప్రధాన ప్రత్యర్థులు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ స్వాగతించాయి.

Image copyright EPA
చిత్రం శీర్షిక ఇరాన్ పార్లమెంటులో కొందరు సభ్యులు అమెరికా జాతీయ పతాకాన్ని తగులబెట్టారు.

అవసరమైతే యురేనియం శుద్ధికి సిద్ధం: ఇరాన్

ఒప్పందం రూపంలో అమెరికా తమకు మాట ఇచ్చిందని, తాజా నిర్ణయంతో ఈ మాటను అమెరికా తప్పుతోందని ఇరాన్ వ్యాఖ్యానించింది. అవసరమైతే యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని తిరిగి మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ప్రకటించారు.

అణు ఇంధనంతోపాటు అణ్వాయుధాల తయారీకి యురేనియం శుద్ధి కీలకం.

అణు ఒప్పందంలో భాగస్వాములైన ఇతర దేశాలతో చర్చిస్తామని, వాటి సహకారంతో ఒప్పందం లక్ష్యాలు నెరవేరే పక్షంలో ఒప్పందంలో కొనసాగుతామని రౌహానీ చెప్పారు. రానున్న కొన్ని వారాల్లో ఆయా ఐరోపా దేశాలతోపాటు రష్యా, చైనాలతో చర్చలు జరుపుతామని ఆయన మంగళవారం తెలిపారు. చర్చల తర్వాత నిర్ణయం తీసుకొంటామని చెప్పారు.

ట్రంప్ నిర్ణయంపై ఇరాన్ పార్లమెంటులో తీవ్రస్థాయి నిరసనలు వ్యక్తమయ్యాయి. కొందరు సభ్యులు అమెరికా జాతీయ పతాకాన్ని తగులబెట్టారు. ట్రంప్‌కు మానసిక సామర్థ్యం లేదని స్పీకర్ అన్నట్లు వార్తలు వచ్చాయి.

ఇరాన్‌లో ఎవరి మాట నెగ్గుతుంది?

ఈ ఒప్పందానికి రౌహానీ గట్టి మద్దతుదారు. ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో ఇరాన్‌లో ఎవరి మాట పైచేయి అవుతుందన్నదాన్ని బట్టి తదుపరి పరిణామాలు ఉంటాయి. ఇరాన్‌లో ఉదారవాద నాయకుల మాట నెగ్గితే, ఈ అంశంలో యూరప్ నాయకుల పాత్ర కీలకమవుతుంది.

ఇరాన్ అతివాద నాయకుల్లో కొందరు ఈ ఒప్పందంతోపాటు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ) నుంచి కూడా ఇరాన్ వైదొలగాలని డిమాండ్ చేస్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక థెరిసా మే (బ్రిటన్), మేక్రాన్ (ఫ్రాన్స్), ఏంజెలా మెర్కెల్ (జర్మనీ)

అమెరికా అడ్డంకులు సృష్టించకూడదు: బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ

ఒప్పందానికి కట్టుబడి ఉంటామని, దీనితో సంబంధమున్న ఇతర పక్షాలతో తాము కలిసి పనిచేస్తామని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఒక సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశాయి. ఒప్పందం అమల్లో అడ్డంకులు సృష్టించవద్దని అమెరికాను కోరాయి. ట్రంప్ నిర్ణయంతో ఈ ఒప్పందమేమీ ముగిసిపోలేదని ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జీన్-ఈవ్స్ లె డ్రియాన్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 14న ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇరాన్ సమావేశం కానున్నాయని తెలిపారు.

రష్యా, చైనా కూడా ఒప్పందానికి తమ మద్దతు కొనసాగుతుందని ప్రకటించాయి. ట్రంప్ నిర్ణయం తమకు తీవ్ర విచారం కలిగించిందని రష్యా వ్యాఖ్యానించింది.

ఒప్పందం కొనసాగేలా చూడాలనే కృతనిశ్చయంతో యూరోపియన్ యూనియన్ ఉందని ఈయూ ఉన్నతస్థాయి దౌత్యవేత్త ఫెడెరికా మొఘెరిని తెలిపారు.

అమెరికా ఆంక్షలు ఎప్పటి నుంచి అమలు?

ఇరాన్‌పై లోగడ తొలగించిన ఆంక్షలు ఇప్పుడు వెంటనే అమల్లోకి రాబోవని యూఎస్ ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఆంక్షలు వర్తించే కంపెనీలు వాటి కార్యకలాపాలను నిలిపివేసేందుకు ఆరు నెలల వరకు సమయం ఉంటుందని తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

ఇరాన్ చమురు రంగం, వైమానిక ఎగుమతులు, విలువైన లోహాల వాణిజ్యంతోపాటు నాటి ఒప్పందంలో పేర్కొన్న ఇతర వాణిజ్య, పారిశ్రామిక అంశాల్లో అమెరికా ఆంక్షలు వర్తిస్తాయి. అమెరికా డాలర్ బ్యాంకు నోట్ల కొనుగోలుకు ఇరాన్ చేసే ప్రయత్నాలకూ ఇవి వర్తిస్తాయి.

ఇరాన్‌తో కలిసి వ్యాపారం చేస్తున్న యూరోపియన్ కంపెనీలు ఆరు నెలల్లో ఈ వ్యాపార సంబంధాలు తెంచుకోవాలని, లేదంటే ఈ కంపెనీలూ అమెరికా ఆంక్షలను ఎదుర్కోక తప్పదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ హెచ్చరించారని వార్తలు వెలువడ్డాయి.

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలతో పోలిస్తే ఇరాన్‌తో కలిసి పనిచేస్తున్న అమెరికాయేతర కంపెనీలపై అమెరికా విధించే ఆంక్షలు రాజకీయంగా మరింత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.

ఈ అణు ఒప్పందం లోపరహితంగా (పర్ఫెక్ట్‌గా) ఏమీ లేదని, ఇరాన్ క్షిపణి కార్యక్రమం, మధ్యప్రాచ్యంలో ఇరాన్ వైఖరి అంశాలు ఒప్పందం పరిధిలో లేవని, అయినప్పటికీ ఇది ఎంతో కొంత ఫలితం ఇస్తోందని బీబీసీ రక్షణ, దౌత్య వ్యవహారాల ప్రతినిధి జొనాథన్ మార్కస్ చెప్పారు. ట్రంప్ నిర్ణయంతో అమెరికా దౌత్య విధానానికీ, అమెరికాకు అత్యంత సన్నిహితమైన దేశాలకూ మధ్య ఘర్షణ ఏర్పడగలదని ఆయన అభిప్రాయపడ్డారు.

Image copyright POOL/GETTY IMAGES
చిత్రం శీర్షిక ఒబామా

ఒబామా ఏమన్నారు?

ట్రంప్ నిర్ణయాన్ని ఒబామా తీవ్రంగా ఆక్షేపించారు. ఈ ఒప్పందం ఫలితాలు ఇస్తోందని, అమెరికా ప్రయోజనాలను కాపాడుతోందని ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టులో చెప్పారు.

''ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడమంటే.. అమెరికాకు అత్యంత సన్నిహిత దేశాలను, అమెరికా ఉన్నతస్థాయి దౌత్యవేత్తలు, శాస్త్రవేత్తలు, గూఢచార నిపుణులు ఎన్నో చర్చలు జరిపి తీసుకొచ్చిన ఒప్పందాన్ని ఖాతరు చేయకపోవడమే'' అని ఒబామా వ్యాఖ్యానించారు.

ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎంత?

ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా చమురు ఎగుమతులపై ఆధారపడి ఉంది. అంతర్జాతీయ ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు చమురు ఎగుమతులు తగ్గడంతో దేశ ఆర్థిక వ్యవస్థ డీలా పడింది. 2015లో అణు ఒప్పందం కుదిరాక ఆంక్షలను తొలగించడంతో మళ్లీ ఎగుమతులు పుంజుకున్నాయి.

ఇరాన్‌పై ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు చమురు ఉత్పత్తులు బాగా పడిపోయాయి. 2013లో రోజుకు 11 లక్షల బ్యారెళ్ల చమురు మాత్రమే ఎగుమతయ్యేది. ప్రస్తుతం 25 లక్షల బ్యారెళ్ల చమురు ఎగుమతవుతోంది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) లెక్కల ప్రకారం ఒప్పందం అమల్లోకి వచ్చిన తొలి ఏడాది ఇరాన్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) దాదాపు 12.5 శాతం పెరిగింది. ఒక్కసారిగా పెరిగిన చమురు ఎగుమతులే దీనికి కారణం. తర్వాత జీడీపీ తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది అది నాలుగు శాతం మేర పెరుగుతుందని ఐఎంఎఫ్ భావిస్తోంది.

Image copyright AFP/Getty Images
చిత్రం శీర్షిక ఇరాన్‌కు చెందిన ఖార్క్ ఐలాండ్‌లోని చమురు కేంద్రం

కరెన్సీ విలువ ఎలా మారింది?

2012లో ఇరాన్ కరెన్సీ 'రియాల్' విలువ డాలర్‌తో పోలిస్తే మూడింట రెండొంతుల మేర పడిపోయింది. దేశ ఆర్థిక రంగంలో నిర్వహణ లోపాలతోపాటు అంతర్జాతీయ ఆంక్షల కారణంగా రియాల్ విలువ నానాటికీ పడిపోతూ వచ్చింది.

అణు ఒప్పందం అమల్లోకి వచ్చాక రియాల్ విలువ స్థిరంగా ఉంది. నిరుడు చివర్లో ఒప్పందం కొనసాగింపుపై ట్రంప్ వ్యతిరేకత వ్యక్తంచేసినప్పటి నుంచి రియాల్ విలువ మళ్లీ క్షీణించడం మొదలైంది. గత సెప్టెంబర్‌ నుంచి ఇప్పటిదాకా డాలర్‌తో పోలిస్తే రియాల్ విలువ సగానికి పడిపోయింది.

భవిష్యత్తులో ఆంక్షలు మళ్లీ అమలైతే ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందేమోనన్న భయంతో చాలా మంది ఇరానియన్లు ముందుగానే విదేశీ కరెన్సీని కొనుక్కొని పెట్టుకుంటున్నారు. ఇప్పటిదాకా దాదాపు మూడు వేల కోట్ల డాలర్ల విలువైన కరెన్సీ ఇరాన్‌ నుంచి ఇతర దేశాలకు వెళ్లిందని భావిస్తున్నారు. దీంతో ఇరాన్ ప్రభుత్వం ఫారన్ ఎక్స్‌ఛేంజ్ కార్యాలయాలపై కొరడా ఝుళిపించింది. విదేశీ కరెన్సీ అమ్మకాలపై ఆంక్షలు విధించింది.

విదేశీ ఆంక్షల ప్రభావం ఇరాన్ మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడిందని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాన్ గణాంకాలు సూచిస్తున్నాయి. వీటి ప్రకారం 2014-15 వరకు ఇరాన్ ప్రజల నెలవారీ బడ్జెట్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. అణు ఒప్పందం అమల్లోకి వచ్చాక పెరగడం మొదలైంది. అమెరికా ఆంక్షలు అమల్లోకి వస్తే పరిస్థితులు ఎలా మారతాయో చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)