బతకడని అవయవ దానానికి సిద్ధమయ్యారు.. చివరి క్షణంలో కళ్లు తెరిచాడు

  • 10 మే 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionబతకడని అవయవదానానికి సిద్ధమయ్యారు.. తర్వాత ‘‘అద్భుతం’’ జరిగింది

మరణ శయ్యపై ఉన్న తమ 13 ఏళ్ల కొడుకు బతకడని అవయవ దానానికి సిద్ధమైన తల్లిదండ్రులు అన్ని పేపర్లపై సంతకం చేశారు. కానీ ఆక్సిజన్ ఆపివేసే ముందు ఆ బాలుడు స్పృహలోకి వచ్చాడు.

ట్రెంటన్ మెక్ కిన్లే అనే బాలుడు అమెరికాలోని అలబామా రాష్ట్రంలో మార్చిలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.

కారు ట్రైలర్ నుంచి తలకిందులుగా పడడంతో అతడి తల నేలను తాకింది. తలకు ఏడు ఫ్రాక్చర్స్ అయ్యాయి. మెదడు తీవ్రంగా దెబ్బతింది.

అతడు ఇక కోలుకోలేడని వైద్యులు తల్లిదండ్రులకు చెప్పేశారు. బాలుడి అవయవాలతో మరో ఐదుగురు పిల్లలకు కొత్త జీవితం ఇవ్వచ్చన్నారు.

అతడి లైఫ్ సపోర్ట్ తీసేయడానికి ఒక రోజు ముందు.. ట్రెంటన్ తను స్పృహలోనే ఉన్నట్టు సంకేతాలు చూపించాడు.

ప్రమాదం తర్వాత ట్రెంటన్‌ పుర్రెను తెరిచి చాలా శస్త్రచికిత్సలు చేశారని, అతడి మూత్రపిండాలు పాడయ్యాయని, గుండె కూడా ఆగిపోయినంత పనయిందని అతడి తల్లి జెన్నిఫర్ రీండిల్ చెప్పారు.

ఒకసారి ట్రెంటన్ 15 నిమిషాల పాటు ఆపరేషన్ టేబుల్ మీద నిశ్చలంగా ఉండిపోయాడు. దాంతో "తనెప్పటికీ మామూలుగా కాలేడు" అని డాక్టర్లు చెప్పారని ఆమె వివరించారు.

‘‘మా కొడుకు అవయవాలు మరో ఐదుగురు పిల్లల ప్రాణాలు కాపాడతాయని తెలిశాక, అవయవ దానం కాగితాలపై సంతకం చేయాలనుకున్నా’’ అని రీండిల్ సీబీఎస్ న్యూస్‌కు చెప్పారు.

"మేం దానికి ఒప్పుకున్నాం. అవయవాలు దానం చేస్తే అవి అవసరమైన వాళ్ల ద్వారా ట్రెంటన్‌ను సజీవంగా ఉంచినట్టు అవుతుందని డాక్టర్లు పేర్కొన్నారు’’ అంటూ మార్చిలో తన కొడుకు స్పృహలోకి వచ్చిన ఆ క్షణాలను రిండిల్ గుర్తు చేసుకున్నారు.

"తర్వాత రోజు మరణాన్ని ధ్రువీకరించడానికి ట్రెంటన్‌కు చివరి బ్రెయిన్ వేవ్ టెస్ట్ చేయాలనుకున్నారు. కానీ తను జీవించి ఉన్నట్టు తెలుసుకుని ఆ టెస్ట్ రద్దు చేశారు."

Image copyright JENNIFER REINDL/FACEBOOK

ఇప్పుడు ట్రెంటన్ మెల్లగా కోలుకుంటున్నాడు.

"నేను కాంక్రీట్‌ను గుద్దుకున్నా, ట్రైలర్ నా తలమీద పడింది. ఆ తర్వాత జరిగిందేదీ నాకు గుర్తు లేదు" అని ట్రెంటన్ చెప్పాడు.

అతడికి ఇప్పటికీ నరాల బలహీనత ఉంది, మూర్ఛ వస్తుంటుంది. ట్రెంటన్ సగం పుర్రెను తిరిగి కలపడానికి సర్జరీ చేయాలి.

అతడు నడుస్తున్నాడు. మాట్లాడుతున్నాడు. చదవుతున్నాడు. లెక్కలు కూడా చేస్తున్నాడు. ఇది "ఒక అద్భుతం" అని ట్రెంటన్ తల్లి రిండిల్ అంటారు.

స్పృహలో లేనప్పుడు తనకు స్వర్గంలో ఉన్నట్టు అనిపించిందని ట్రెంటన్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు