కృత్రిమ మేధస్సు: మీరు శాసించండి..గూగుల్ పాటిస్తుంది!

  • 10 మే 2018
Google's new assistant Image copyright Google

మీకు బదులుగా మీ ఫోనే మీరు కోరుకున్న అపాయింట్‌మెంట్స్ ఫిక్స్ చేస్తే! చిన్న చిన్న పనులన్నీ కంప్యూటరే చేసిపెడితే! ఈ ఊహే కొత్తగా, వింతగా ఉంది కదా. కానీ ఇదెంతో దూరంలో లేదని గూగుల్‌ చెబుతోంది.

డాక్టర్‌ అపాయింట్‌మెంట్, రెస్టారెంట్‌లో టేబుల్ రిజర్వేషన్ ఇలా నిత్యం ఎన్నో పనులు ఉంటాయి.

ఉరుకులు పరుగుల జీవితంలో ఫోన్ చేసి వాటిని బుక్ చేయడం ఒక్కోసారి మర్చిపోతుంటాం.

ఇకపై అలాంటి పనులన్నీ మీ ఫోన్ లేదా కంప్యూటరే చేసి పెడుతుందని గూగుల్ చెబుతోంది.

అంటే మీ బదులు మీ గూగుల్ అసిస్టెంట్‌ ఫోన్ చేసి మీకోసం అపాయింట్‌మెంట్ బుక్ చేస్తుందన్న మాట.


మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: గూగుల్‌ డుప్లెక్స్ ఎలా పనిచేస్తుందో చూడండి!

ఈ సరికొత్త టెక్నాలజీని గూగుల్‌ ఆవిష్కరించింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌ సాయంతో గూగుల్ అసిస్టెంట్‌ ఈ పని చేసిపెడుతుందని ఆ సంస్థ ప్రకటించింది.

ఈ టెక్నాలజీకి 'గూగుల్ డుప్లెక్స్' అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు.

గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్స్ వార్షిక సదస్సులో ఈ టెక్నాలజీని పరిచయం చేశారు.

ఏదైనా అపాయింట్‌మెంట్ బుక్ చేయమని గూగుల్ డుప్లెక్స్‌కు మీరు చెబితే.. దాన్ని అది పాటిస్తుంది.

దీనికి సంబంధించి గూగుల్ అసిస్టెంట్ నుంచి మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది.

అయితే, ప్రస్తుతం ఇది కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. భారతీయ భాషల్లో ఇది అందుబాటులో లేదు.

గూగుల్ డుప్లెక్స్‌ ఎలా పనిచేస్తుందో ప్రదర్శించి చూపించారు.

Image copyright Google

ఈ సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఇద్దరు వ్యక్తులు.. హెయిర్ కట్ కోసం అపాయింట్‌మెంట్, మరొక రెస్టారెంట్‌లో టేబుల్ బుక్ చేశారు.

గూగుల్ అసిస్టెంట్ ప్రశ్నలు సూటిగా అడిగేసరికి ఉద్యోగి మొదట కాస్త తికమకపడ్డారు.

గూగుల్ డుప్లెక్స్‌‌ సాఫ్ట్‌వేర్‌లో రోబో వాయిస్‌ అచ్చం మనిషి స్వరంలాగే సహజంగా ఉంది.

గతంలో ఉన్న వర్చువల్ సహాయకుడి కంటే మరింత మెరుగ్గా స్వరం ఉంది.

పైగా మనం మాట్లాడేటప్పుడు తరచూ ఉపయోగించే (ఉదాహరణకు ఆ..) పదాలు కూడా చేర్చారు.

ఒక యంత్రంతో మాట్లాడుతున్నామని అవతలి వ్యక్తులు అస్సలు గుర్తించలేరని గూగుల్ చెబుతోంది.

ప్రజలకు ఈ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని, వ్యాపారానికి ఎంతో విలువ చేకూరుస్తుందని గూగుల్ సీఈవో పిచాయ్ అభిప్రాయపడ్డారు.

Image copyright Google

"ఇది నిజమేనని నమ్మడం కష్టమే" అని క్రియేటీవ్ స్ట్రాటెజీస్ కన్సల్టెన్సీకి చెందిన విశ్లేషకుడు బెన్ బజరాన్ అన్నారు.

గూగుల్‌ డుప్లెక్స్‌ను ప్రజలు నమ్మితే దీన్ని విస్తృతంగా ఉపయోగించే అవకాశం ఉందని ఇతర నిపుణులు అభిప్రాయపడ్డారు.

అమెజాన్, ఆపిల్‌లు ఇప్పటికే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. అమెజాన్ అలెక్సా, ఆపిల్ సిరి ఈ కోవకే చెందుతాయి.

ఇప్పుడు గూగుల్ డుప్లెక్స్ విజయవంతమైతే, ప్రత్యర్థుల కంటే గూగుల్ ఒక మెట్టు పై స్థాయిలో ఉండే అవకాశం ఉంది.

అమెజాన్ ఎకో, గూగుల్ హోమ్ పేర్లతో ఇటీవలే ఈ రెండు సంస్థలు వాయిస్ స్పీకర్లను విడుదల చేశాయి.

ఇవి భారతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.