ట్రంప్ - కిమ్ భేటీ: ముగ్గురు అమెరికా ఖైదీలను విడుదల చేసిన ఉత్తర కొరియా

  • 9 మే 2018
కిమ్ హాక్-సాంగ్, కిమ్ డోంగ్-చు, టోనీ కిమ్ Image copyright REUTERS / AFP
చిత్రం శీర్షిక ఎడమ నుంచి కుడివైపు.. కిమ్ హాక్-సాంగ్, కిమ్ డోంగ్-చు, టోనీ కిమ్

ఉత్తర కొరియా నిర్బంధించిన అమెరికా పౌరులు ముగ్గురిని జైలు నుంచి విడుదల చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్‌లో తెలిపారు.

ట్రంప్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ మధ్య త్వరలో జరుగనున్న చరిత్రాత్మక సమావేశం నేపథ్యంలో సుహృద్భావ సూచికగా ఈ పరిణామాన్ని పరిగణిస్తున్నారు.

శిఖరాగ్ర సదస్సు ఏర్పాట్లలో భాగంగా ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయోతో పాటు ఖైదీలు ముగ్గురూ తిరిగి వస్తారని ట్రంప్ పేర్కొన్నారు.

ఉత్తర కొరియా విడుదల చేసిన కిమ్ హాక్-సాంగ్, టోనీ కిమ్, కిమ్ డోంగ్-చు.. ముగ్గురూ ‘‘ఎవరి సాయం లేకుండా విమానంలో నడువగలుగుతున్నారు’’ అని అమెరికా అధ్యక్ష భవనం పేర్కొంది.

దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణపై వారిని ఉత్తర కొరియా అరెస్ట్ చేసి శ్రామిక శిబిరాలకు పంపించింది.

వీరి విడుదల విషయాన్ని ట్రంప్ బుధవారం ఒక ట్వీట్ ద్వారా ప్రకటించారు. ‘‘వారు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.

‘‘కిమ్ జోంగ్ ఉన్‌తో మంచి భేటీ’’ కోసం తేదీని, వేదికను ఖరారు చేసినట్లు కూడా ట్రంప్ తెలిపారు.

వీరి విడుదలను ట్రంప్ అభినందించారని.. సానుకూలమైన సుహృద్భావ సంకేతంగా ఈ చర్యను ట్రంప్ పరిగణిస్తున్నారని వైట్ హౌస్ అధికార ప్రతినిధి సారా సాండర్స్ ఆ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Image copyright Reuters

ఉత్తర కొరియా విడుదల చేసిన అమెరికా పౌరులు ఎవరు?

కిమ్ హాక్-సాంగ్‌ను 2017 మేలో ‘‘శత్రుపూరిత చర్యలు’’ అనుమానంపై అరెస్ట్ చేశారు. ఆయన తానొక క్రైస్తవ మిషనరీ ప్రతినిధినని.. ప్యాంగ్యాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (పీయూఎస్‌టీ) లో ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించదలచుకున్నానని గతంలో పేర్కొన్నారు.

టోనీ కిమ్ (కిమ్ సాంగ్-డుక్ అని కూడా పిలుస్తారు) కూడా పీయూఎస్‌టీలో పనిచేశారు. 2017 ఏప్రిల్‌లో ఆయనను గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఆయన ఉత్తర కొరియాలో మానవతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని దక్షిణ కొరియా మీడియా చెప్తోంది.

అరవయ్యో దశకం ఆరంభంలో పాస్టర్‌గా పనిచేసిన కిమ్ డోంగ్-చుల్‌ను 2015లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఆయనకు 10 సంవత్సరాలు కఠిన శ్రమను శిక్షగా విధించారు.

ఈ ముగ్గురి అరెస్టు, జైలు నిర్బంధం రాజకీయ ప్రేరేపితమని.. మానవ హక్కుల ఉల్లంఘన అని విమర్శలు వచ్చాయి.

వీరిని ఈ నెల ఆరంభంలో జైలు నుంచి ప్యాంగ్యాంగ్‌లోని హోటల్‌కు మార్చారని వార్తలు వచ్చాయి. దాంతో ఈ ముగ్గురినీ త్వరలో విడుదల చేస్తారన్న ఊహాగానాలూ వచ్చాయి.

Image copyright AFP
చిత్రం శీర్షిక ఒటో వామ్‌బీర్‌ ప్యాంగ్యాంగ్‌లో తన నేరాన్ని అంగీకరించిన ఏడాది తర్వాత చనిపోయాడు

ఉత్తర కొరియా జైళ్లు ఎలా ఉంటాయి?

ఉత్తర కొరియాలో సరైన విచారణ పద్ధతులను పాటించకుండా సుమారు 1.20 లక్షల మందిని జైళ్లలో నిర్బంధించినట్లు కమిటీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇన్ నార్త్ కొరియా (హెచ్ఆర్ఎన్‌కే) చెప్తోంది.

దక్షిణ కొరియాకు చెందిన డీవీడీని వీక్షించటం మొదలుకుని దేశం వదిలి వెళ్లటానికి ప్రయత్నించటం వరకూ.. ఉత్తర కొరియా ప్రభుత్వం ఎలాంటి కారణానికైనా ప్రజలను జైలులో పెడుతుందని కార్యకర్తలు చెప్తారు.

రాజకీయ ఖైదీలను వేరే జైళ్లకు పంపిస్తారు. క్రూరమైన శ్రామిక శిబిరాలు వాటిలో ముఖ్యమైనవి. గనుల తవ్వకం, చెట్లు నరికి దుంగలు మోయటం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.

అమెరికన్ మిషనరీ కెన్నెత్ బే కూడా ఉత్తర కొరియాలో ఇలాంటి శిక్షకు గురయ్యారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోయినా వారంలో ఆరు రోజుల పాటు పొలంలో పనిచేయించారు.

ఒక హోటల్ చిహ్నాన్ని దొంగిలించిన నేరానికి జైలులో పెట్టిన ఒటో వామ్‌బీర్‌ను.. గత ఏడాది విడుదల చేసినపుడు తీవ్రంగా జబ్బుపడి ఉన్నాడు. విడుదలై ఇంటికి తిరిగొచ్చిన కొద్ది రోజులకే చనిపోయాడు.

అతని మరణానికి కారణమేమిటనేది ఇంకా తెలియదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)